ఉనికిని చాటుకునేందుకే సీఎంపై విమర్శలు
ABN , Publish Date - Dec 23 , 2025 | 12:16 AM
ఉనికిని చాటుకునేందుకే కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మన్‌కుమార్ అన్నారు. ఆయన సోమవారం కరీంనగర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... రెండేళ్లపాటు ఫాంహౌస్‌లో పడుకోవడంతో బీఆర్‌ఎస్‌ను ప్రజలు మరచిపోయారని విమర్శించారు.
కరీంనగర్ అర్బన్, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఉనికిని చాటుకునేందుకే కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మన్‌కుమార్ అన్నారు. ఆయన సోమవారం కరీంనగర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... రెండేళ్లపాటు ఫాంహౌస్‌లో పడుకోవడంతో బీఆర్‌ఎస్‌ను ప్రజలు మరచిపోయారని విమర్శించారు. కృష్ణా, గోదావరి జలాల కేటాయింపుపై ప్రత్యేక అసెంబ్లీ పెడతానని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల చెప్పారని, బీఆర్‌ఎస్ హయాంలో నీటి కేటాయింపుల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పూర్తిస్థాయిలో చర్చించి మంత్రి సమాధానం చెబుతారన్నారు. నిరుద్యోగులు, రైతు రుణమాఫీ, భరోసా, బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చించేందుకు కేసీఆర్ ప్రతిపక్షనేతగా ఎందుకు హాజరు కాలేదని మంత్రి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి జ్యుడీషియల్ రిపోర్ట్‌పై చర్చ పెడితే కేసీఆర్ అసెంబ్లీకి రాలేదని, తన బాధ్యతను మరిచారని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో చేసిన పాపాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెలా మొదటి తారీఖున వడ్డీ చెల్లిస్తుందన్నారు. ప్రజలు మార్పు కోరుకుని కాంగ్రెస్ ప్రజాపాలనకు అవకాశం ఇచ్చారని, సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వాన ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజాపానను సాగిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం గురించి చర్చ పెడితే కూడా కేసీఆర్ అసెంబ్లీకి రాలేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో పేదలకు సంక్షేమ పథకాలు అందించలేదని, అభివృద్ధిని మరిచారని విమర్శించారు. ఒక్క రేషన్‌కార్డు కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అర్హత ఉన్న వారికి రేషన్ కార్డు ఇచ్చి సన్న బియ్యం ఇస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తున్నామని, ధర్మపురి నియోజక వర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి, లబ్దిదారుల ఖాతాల్లో ఐదు లక్షల రూపాయలు జమచేశామని మంత్రి తెలిపారు. ఏదైనా సమస్యపై ప్రతి పక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలన్నారు. దళితులు, బలహీన వర్గాల ప్రజలు.. తెలంగాణ ఏర్పాటుతో మేలు జరుగుతుందని కోట్లాడి తెలంగాణ తెచ్చుకున్నారని అన్నారు. ధర్మపురి నియోజక వర్గంలో 104 గ్రామాల్లో ప్రజలు సంక్షేమ పథకాలను చూసి తీర్పు ఇచ్చారనిరు. కేసీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని మంత్రి అడ్లూరి హెచ్చరించారు. సమావేశంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.