Share News

క్రిటికల్‌ కేర్‌లో సౌకర్యాలు సమకూర్చాలి

ABN , Publish Date - Aug 06 , 2025 | 12:34 AM

: జిల్లా జనరల్‌ ఆసుపత్రి క్రిటికల్‌ కేర్‌లో సౌకర్యాలు సమకూర్చుకోవాలని కలెక్టర్‌ పమేలా సత్పతి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో ’వైద్యసేవలు మెరుగయ్యేదెన్నడు’ అన్న శీర్షికన కథనం ప్రచురితమైంది.

క్రిటికల్‌ కేర్‌లో సౌకర్యాలు సమకూర్చాలి
జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వీరారెడ్డితో మాట్లాడుతున్న కలెక్టర్‌ పమేలాసత్పతి

సుభాష్‌నగర్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లా జనరల్‌ ఆసుపత్రి క్రిటికల్‌ కేర్‌లో సౌకర్యాలు సమకూర్చుకోవాలని కలెక్టర్‌ పమేలా సత్పతి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో ’వైద్యసేవలు మెరుగయ్యేదెన్నడు’ అన్న శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి కలెక్టర్‌ స్పందించి మంగళవారం జిల్లా ఆసుపత్రిలోని క్రిటికల్‌ కేర్‌ను సందర్శించారు. ఐసీయూ, వార్డులు, ఆపరేషన్‌ థియేటర్‌తోపాటు ఇతర బ్లాకులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆక్సిజన్‌ లైన్‌ను ఏర్పాటు చేయాలని, అవసరమైన ఇతర సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. వైద్యసేలను విస్తృతం చేసేందుకు వైద్యులు, ఇతర సిబ్బందిని సర్దుబాటు చేయాలని సూపరింటెండెంట్‌కు సూచించారు. అనంతరం మాతా శిశు ఆరోగ్యకేంద్రాన్ని సందర్శించారు. అక్కడి ఓపీ విభాగం, స్కానింగ్‌ గదిని పరిశీలించారు. గర్భిణులతో మాట్లాడి, అక్కడ అందుతున్న వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రధాన ద్వారం వద్ద విచ్చలవిడిగా చెప్పులు విడిచి ఉండడాన్ని గమనించిన కలెక్టర్‌ చెప్పులకు ప్రత్యేక ర్యాక్స్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వీరారెడ్డి, ఆర్‌ఎంవో డాక్టర్‌ నవీన, డాక్టర్‌ సాయిని నరేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 06 , 2025 | 12:34 AM