Share News

ఇసుక అక్రమరవాణాపై కొరడా

ABN , Publish Date - May 16 , 2025 | 12:42 AM

ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నవారిపైన కేసులు నమోదు చేయటం సాధారణ ప్రక్రియ..

ఇసుక అక్రమరవాణాపై కొరడా

కరీంనగర్‌ క్రైం, మే 15 (ఆంధ్రజ్యోతి): ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నవారిపైన కేసులు నమోదు చేయటం సాధారణ ప్రక్రియ.. ఇక నుంచి అనుమతిలేని ఇసుకను కొనుగోలు చేసినవారిపై కూడా వ్యవస్థీకృత నేరం కింద చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ అనుమతి ఉన్న ఇసుక క్వారీల నుంచే ఇసుకను రవాణా చేయాలని, నిర్మాణదారులు, బిల్డర్ల అనుమతి ఉన్న క్వారీల ఇసుకనే కొనుగోలు చేయాలంటున్నారు. అనుమతిలేని ఇసుకగా తెలిసి, ప్రభుత్వ ఆదాయం కోల్పోయే విధంగా అక్రమార్కుల వద్ద కొనుగోలు చేస్తే కేసులను ఎదుర్కోవల్సిందేనని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఫ గ్రామాల వారీగా సమావేశాలు

కరీంనగర్‌ రూరల్‌ పోలీస్‌ సబ్‌డివిజన్‌ పరిధిలో అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న రవాణాదారులపై పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. కరీంనగర్‌ రూరల్‌ పోలీసు సబ్‌డివిజన్‌ పరిధిలోని కరీంనగర్‌ రూరల్‌, కొత్తపల్లి, చొప్పదండి, గంగాధర, రామడుగు, తిమ్మాపూర్‌, మానకొండూర్‌, గన్నేరువరం, చిగురుమామిడి మండలాల పరిధిలో అక్రమ ఇసుక రవాణా నియంత్రణకు రూరల్‌ ఏఎస్పీ శుభం ప్రకాశ్‌ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రూరల్‌ పోలీస్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలోని పోలీస్‌ స్టేషన్ల వారీగా గ్రామాల్లోని ట్రాక్టర్‌ యజమానులు, డ్రైవర్లు, గ్రామస్థులు, బిల్డర్‌లతో నాలుగు రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక నుంచి అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

10 సంవత్సరాలుగా పోలీస్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలో ఇసుక అక్రమ రవాణా కేసులు ఎదుర్కొంటున్న వారి జాబితాను తయారు చేసి ఆ కేసుల్లోని నిందితులను ముందస్తు చర్యగా స్థానిక తహసీల్దార్ల ఎదుట హాజరుపరుస్తున్నారు. బైండోవర్‌ నిబంధనలు ఉల్లంఘించి మళ్లీ ఇసుక అక్రమ రవాణాచేస్తే లక్ష రూపాయల జరిమానా చెల్లించే విధంగా సొంత పూచీకత్తును విధిస్తున్నారు. కరీంనగర్‌ రూరల్‌ మండలంలోని చేగుర్తి, దుర్శేడ్‌, వల్లంపహడ్‌, నగునూర్‌, బొమ్మకల్‌ గ్రామాలకు చెందిన 18 మంది ట్రాక్టర్‌ యజమానులు, డ్రైవర్లను బైండోవర్‌ చేశారు.

ఫ యథేచ్చగా అక్రమ రవాణా

జిల్లాలో కొంత కాలంగా ఇసుక మాఫియాతో కొందరు స్థానిక నాయకులు, కొందరు ప్రభుత్వశాఖల ఉద్యోగులు కుమ్మక్కై యదేచ్ఛగా ఇసుక అక్రమరవాణాకు తమ వంతు పూర్తి స్థాయి సహకారాన్ని అందించినట్లు విమర్శలున్నాయి. కమిషనరేట్‌లోని కొందరు పోలీసు సిబ్బంది, అధికారులు ఇసుక అక్రమ దందాతో అంటకాగినందుకు శాఖాపరమైన విచారణ అనంతరం వేటు పడింది. ఖాజీపూర్‌లో మూడేళ్ల క్రితం అధికారిక ఇసుక క్వారీని నిలిపివేశారు. అయినా చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ట్రాక్టర్లతో మానేరువాగు నుంచి రోజుకు వందల సంఖ్యలో ఇసుకను అక్రమంగా తరలిస్తూ కరీంనగర్‌లో విక్రయిస్తున్నారు. కొందరు కరీంనగర్‌ శివారు ప్రాంతాల్లోని వ్యవసాయభూముల్లోని ముళ్లపొదల చాటున, నగరంలోని ఇళ్ల స్థలాల్లో నిల్వ చేస్తున్నారు. అయినా అటు భూగర్భజలశాఖ, రెవెన్యూ, పోలీసు శాఖలు పట్టించుకోలేదు. దీంతో ఇసుక అక్రమ రవాణా యథేచ్చగా సాగింది.

ఫ ప్రభుత్వం చర్యలు

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణాను అరికట్టి ప్రభుత్వ ఆదాయం పెంచే విధంగా చర్యలకు ఉపక్రమించింది ఇసుకను తరలించేందుకు తప్పనిసరిగా ప్రభుత్వానికి డీడీ చెల్లించాలని షరతు విధించింది. ఇళ్ళ నిర్మాణాలకు, ఇతర ప్రభుత్వ పనులకు తప్పకుండా ఆర్‌డీఓ, తహసీల్దార్‌ల నుంచి అనుమతి తీసుకోవాల్సిందే. అయినా కొందరు ఇసుక అక్రమ రవాణాదారులు ఇళ్ల నిర్మాణం పేరిట స్థానిక తహసీల్దార్లకు దరఖాస్తు చేసుకుని అదనంగా 20 నుంచి 30 ట్రాక్టర్ల ఇసుకను అమ్ముకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇందుకు అధికారులు కొందరు సహకరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఇసుక అక్రమరవాణాను నియంత్రించి ప్రభుత్వానికి ఆదాయం పెంచేందుకు పోలీసుశాఖతోపాటు రెవెన్యూశాఖ అధికారులు రంగంలోకిదిగారు. ఇందులో భాగంగానే ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న గ్రామాలు, వాగుల పరిసర గ్రామాలలో పోలీసులు సమావేశాలు నిర్వహించి ఇసుక అక్రమదందాకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

ఫ పెరిగిన ధరలు....

కరీంనగర్‌లో సాధారణంగా ట్రాక్టర్‌ ఇసుకకు 1200 నుంచి 1500 రూపాయల వరకు విక్రయించేవారు. ఎక్కువ ఇసుక ఖాజీపూర్‌, సుల్తానాబాద్‌ మండలం గొల్లపల్లి నుంచే కరీంనగర్‌కు వస్తుండేది. ఇటీవల ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేయటంతో ఇసుక ధరను 2500 నుంచి 3,000 రూపాయలకు వరకు పెంచారు. దీంతో నిర్మాణదారలుపై భారం పడుతున్నది.

ఫ అతి వేగంతో ప్రమాదాలు

దొంగ చాటుగా అక్రమ ఇసుకను తరలించే క్రమంలో ఎక్కువ శాతం రాత్రి సమయాల్లోనే ట్రాక్టర్లు గ్రామాల నుంచి కరీంనగర్‌కు నడిచేవి. ఈ సమయంలో అతివేగంగా నడపడంతోపాటు మైనర్లు ట్రాక్టర్లు నడపడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. పోలీసులు ట్రాక్టర్‌ డ్రైవర్లపై కేసులు నమోదుస్తుండడంతో యజమానులు తెలివిగా మైనర్లతో ఇసుక రవాణా చేయిస్తున్నారు. ఒక ట్రిప్పుకు డ్రైవర్‌కు 500 రూపాయలు ఇస్తుండడంతో డ్రైవర్లు కూడా రోజుకు పది ట్రిప్పులకుపైగా నడపాలనే ఉద్దేశంతో అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు.

ఫ ఏడాదిలో 610 కేసులు.. 1198 మంది అరెస్టు...

జిల్లాలో ఇసుక అక్రమ రవాణా చేసిన సంఘటనల్లో 2024 సంవత్సరంలో 610 కేసులు నమోదు కాగా 1198 మందిని అరెస్టు చేశారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 797 వాహనాలను సీజ్‌ చేసి జరిమానా విధించారు. 2023లో 27 కేసులు నమోదై 120 మంది అరెస్టయ్యారు. 244 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - May 16 , 2025 | 12:42 AM