సీపీఆర్‌తో ప్రాణాలు కాపాడవచ్చు
ABN , Publish Date - Oct 17 , 2025 | 11:49 PM
సీపీఆర్ ద్వారా ప్రాణాపాయస్థితి నుంచి వ్యక్తిని కాపాడవచ్చని, దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ పిలుపునిచ్చారు.
కరీంనగర్ టౌన్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): సీపీఆర్ ద్వారా ప్రాణాపాయస్థితి నుంచి వ్యక్తిని కాపాడవచ్చని, దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ పిలుపునిచ్చారు. శుక్రవారం నగరంలోని కళాభారతి ఆడిటోరియంలో సీపీఆర్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా మున్సిపల్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి అవగాహన కల్పించారు. ఒక వ్యక్తి హఠాత్తుగా కుప్పకూలినపుడు, ప్రాణాపాయ స్థితి నుండి రక్షించడానికి కార్డియో పల్మనరీ రీససిటేషన్ (సీపీఆర్) చేయాల్సిన పద్ధతి గురించి జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ, వైద్య సిబ్బంది అవ గాహన కల్పించారు. ఉద్యోగులకు సీపీఆర్ టెక్నిక్స్ నేర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎవరైనా గుండె ఆగిపోయి పడిపోయినపుడు సీపీఆర్ ద్వారా రక్త ప్రసరణను తిరిగి అవయవాలకు పంపించి ప్రాణాలను కాపాడవచ్చన్నారు. ప్రజల జీవనశైలిలో మార్పులు తెచ్చుకోవాలని, శారీరక వ్యా యామం లాంటివి అలవాటు చేసుకోవాలని ఉద్యోగులకు సూచించారు. మానసిక ఒత్తిడిని తగ్గించు కోవాలని, యోగా వ్యాయమం చాలా ముఖ్యమన్నారు. నగరపాలక సంస్థ అధికారులు ఉద్యోగుల కోసం త్వరలో ఒక వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు ఖాదర్ మోహియుద్దీన్, వేణుమాధవ్, అసిస్టెంట్ కమిషనర్ దిలీప్‌కుమార్, వైద్య, టౌన్ ప్లానింగ్, సానిటేషన్, రెవెన్యూ, ఇంజనీరింగ్ అధికారులు, ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు.