Share News

నిలిచిన పత్తి కొనుగోళ్లు..

ABN , Publish Date - Nov 17 , 2025 | 11:59 PM

నిత్యం తెల్ల బంగారంతో కళకళలాడే జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌ యార్డు జిన్నింగ్‌ మిల్లర్ల సమ్మెతో సోమవారం వెలవెలబోయింది.

నిలిచిన పత్తి కొనుగోళ్లు..
మూసిఉన్న జమ్మికుంట మార్కెట్‌ మెయిన్‌ గేట్‌

జమ్మికుంట, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): నిత్యం తెల్ల బంగారంతో కళకళలాడే జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌ యార్డు జిన్నింగ్‌ మిల్లర్ల సమ్మెతో సోమవారం వెలవెలబోయింది. జమ్మికుంటలో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే జిన్నింగ్‌ మిల్లులు బోసిపోయాయి. ఈ సందర్భంగా జిన్నింగ్‌ మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు దోనకొండ మల్లారెడ్డి మాట్లాడుతూ ఎల్‌-1, ఎల్‌-2, ఎల్‌-3, నిబంధనలతో తమకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. సీసీఐ ఎకరాకు ఏడు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని నిబంధన విధించడం సమంజసం కాదన్నారు. కపాస్‌ కిసాన్‌ యాప్‌తో రైతులు గందరగోళానికి గురవుతున్నారని తెలిపారు. చాలా మంది రైతులకు స్మార్ట్‌ ఫోన్లు లేక పోవడం వల్ల తక్కువ ధరకు పత్తి అమ్ముకుని నష్టపోతున్నారన్నారు. గతంలో మాదిరిగానే సీసీఐ కొనుగోళ్లు చేపట్టాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం, సీసీఐ ఉన్నతాధికారుల దృష్టికి పలుమార్లు తీసుకు వెళ్లినా స్పందించలేదన్నారు. అందుకోసమే సమ్మె బాట పట్టామని, తమ డిమాండ్లు నెరవేరే వరకు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఫ రైతులు సహకరించాలి

- మార్కెట్‌ ఇన్‌చార్జి కార్యదర్శి రాజు

జిన్నింగ్‌ మిల్లుల సమ్మెతో మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. కపాస్‌ కిసాన్‌ యాప్‌లో రైతులు స్లాట్‌ బుక్‌ చేసుకోవద్దు. కొనుగోళ్లు ప్రారంభమైతే ఒక రోజు ముందు రైతులకు సమాచారం అందిస్తామన్నారు. అప్పటి వరకు రైతులు పత్తి తీసుకు రావద్దు. రైతులు ఇందుకు సహకరించాలి.

Updated Date - Nov 17 , 2025 | 11:59 PM