Share News

పత్తి చేలు వర్షార్పణం..

ABN , Publish Date - Sep 24 , 2025 | 12:52 AM

చేతికొచ్చే దశలో పత్తి పంట రైతుల ఆశలను ఆవిరి చేస్తోంది. నిత్యం కురుస్తున్న వర్షాలతో పత్తి పంట దెబ్బతింటోంది. వర్షాలు ఆరంభంలో అనావృష్టిని చూసిన రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులు అల్పపీడన ప్రభావంతో అతివృష్టితో చేజారిపోతున్న పంటను చూసి ఆందోళన చెందుతున్నారు.

పత్తి చేలు వర్షార్పణం..

- తెల్ల బంగారంపై రైతుల ఆశలు ఆవిరి

- వదలని వానతో రాలుతున్న పూత, కాత

- పంట ఎదగక దిగుబడిపై ఆందోళన

- జిల్లాలో 46,385 ఎకరాల్లో పత్తి సాగు

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

చేతికొచ్చే దశలో పత్తి పంట రైతుల ఆశలను ఆవిరి చేస్తోంది. నిత్యం కురుస్తున్న వర్షాలతో పత్తి పంట దెబ్బతింటోంది. వర్షాలు ఆరంభంలో అనావృష్టిని చూసిన రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులు అల్పపీడన ప్రభావంతో అతివృష్టితో చేజారిపోతున్న పంటను చూసి ఆందోళన చెందుతున్నారు. రెండు నెలలుగా పడుతున్న వర్షాలతో పత్తి చెట్టుకు ఉన్న పూత, పిందెలు రాలిపోతున్నాయి. కాసిన కాయలు సైతం కుళ్లిపోతున్నాయి. జిల్లాలో ఖరీఫ్‌లో 2.35 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా, ప్రధానంగా పత్తి 46,385 ఎకరాల్లో సాగు చేశారు. ఇప్పటికే అధిక వర్షాలతో పదివేల ఎకరాల వరకు నష్టం వాటిల్లినట్లు రైతులు ఆవేదన చెందుతున్నారు.

దిగుబడి కష్టమే..

దుక్కులు దున్నడం మొదలు విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులతో జిల్లా రైతులు ఎకరానికి రూ 25 వేల నుంచి రూ 35 వేల వరకు ఖర్చు చేశారు. వర్షాలు ఆలస్యంగా కురవడంతో విత్తనాలు ఆలస్యంగా వేసుకున్నారు. కొందరు రైతులు ముందుగా విత్తనాలు వేసుకోవడంతో విత్తనాలు మొలకెత్తక రెండోసారి కూడా విత్తనాలు వేసుకున్నారు. తర్వాత అల్పపీడనంతో వదలని వాన దిగుబడి కష్టమే అన్నట్లుగా మార్చండి. జిల్లా సాధారణ వర్షపాతం 688.6 మిల్లీమీటర్లకు 771.9 మిల్లీమీటర్లు కురిసింది. అధిక వర్షాలతో పత్తి చేల్లో తడి ఆరకపోవడంతో కలుపు తీసే పరిస్థితి లేకుండా పోయింది. దీనికి తోడు చీడపీడల సమస్య మొదలైంది. పత్తి పంట ఎర్రబారిపోతోంది. పత్తి నాణ్యత కోల్పోతుండడంతో దిగుబడితో పాటు ధర కూడా రాకపోవచ్చని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పెట్టుబడి వచ్చేలా లేదు..

- గోజగాని శంకర్‌రావు, ఆరేపల్లి

రోజూ పడుతున్న వర్షాల వల్ల పత్తి పంట దెబ్బ తింటోంది. పెట్టుబడులు వచ్చేలా కనిపించడం లేదు. చేను జాలు పట్టింది. పత్తి చేనులో కాయలు మునిగిపోతున్నాయి. ఆకులు ఎర్ర పడుతున్నాయి.

పత్తి నల్లబడింది..

- సల్మాల చంద్రయ్య, దుమాల

రెండు ఎకరాల్లో రూ.56 వేలు పెట్టుబడి పెట్టి పత్తి సాగు చేశాను. కురుస్తున్న వర్షాలకు పత్తి చేను నల్లబడింది. పూత రాలిపోతోంది. మందులు పిచికారి చేసినా పంట కోలుకోవడం లేదు. పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు.

జిల్లాలో ఖరీఫ్‌ సాగు వివరాలు(ఎకరాల్లో..)

మండలం మొత్తం పత్తి

గంభీరావుపేట 18598 85

ఇల్లంతకుంట 36970 12000

ముస్తాబాద్‌ 23835 530

సిరిసిల్ల 5623 800

తంగళ్లపల్లి 21086 870

వీర్నపల్లి 8300 300

ఎల్లారెడ్డిపేట 21100 3600

బోయినపల్లి 19167 6400

చందుర్తి 21367 6200

కోనరావుపేట 23140 4800

రుద్రంగి 10964 2200

వేములవాడ 10038 4800

వేములవాడ రూరల్‌ 15142 3800

----------------------------------------------------------------------

మొత్తం 235330 46385

----------------------------------------------------------------------

Updated Date - Sep 24 , 2025 | 12:52 AM