Share News

పత్తి రైతు విలవిల

ABN , Publish Date - Oct 06 , 2025 | 11:55 PM

అధిక వర్షాలకు పత్తి పంట దెబ్బతింటోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇన్ని రోజులు కష్టపడి పండించిన పత్తి పంట కళ్లెదుటే పనికి రాకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పత్తి రైతు విలవిల
హుజూరాబాద్‌ మండలం కాట్రపల్లిలో పత్తి చేనులో నిల్వ ఉన్న వర్షపు నీరు

హుజూరాబాద్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): అధిక వర్షాలకు పత్తి పంట దెబ్బతింటోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇన్ని రోజులు కష్టపడి పండించిన పత్తి పంట కళ్లెదుటే పనికి రాకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి భారీగా పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంట నీటి పాలవడంతో రైతులు విలవిలలాడుతున్నారు. డివిజన్‌లోని హుజూరాబాద్‌, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, సైదాపూర్‌, శంకరపట్నం మండలాల్లోని 25వేల ఎకరాల్లో పత్తి పంటను రైతులు సాగు చేస్తున్నారు. పూత దశలో ఉన్న పత్తి పంట ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పూర్తిగా దెబ్బతిన్నది. పత్తి ఎదిగే దశలో ఉండడంతో రైతులు ఎరువులు వేసి, మందులు పిచికారి చేశారు. పూత, పిందెలు, కాయలతో ఉన్న సమయంలో వరుసగా వర్షాలు కురవడంతో పూత, పిందె నేలరాలి పోయింది. పత్తి చేలలో నీరు నిల్వ ఉండడంతో మొక్కల కాండాలు నల్లబారాయి. ఆకులన్నీ ఎర్రగా మారి రాలిపోతున్నాయి. దీంతో రైతులు దిగుబడి తగ్గుతుందని ఆందోళన చెందుతున్నారు. నష్టపోయిన పంటలకు ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Oct 06 , 2025 | 11:55 PM