నిరంతరంగా అభివృద్ధి.. సంక్షేమం
ABN , Publish Date - Sep 18 , 2025 | 12:21 AM
ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం నిరంతరంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో పోలీస్ గ్రౌండ్‌లో ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
- జిల్లాలో ఘనంగా ప్రజా పాలన వేడుకలు
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం నిరంతరంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో పోలీస్ గ్రౌండ్‌లో ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సందేశం ఇచ్చారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బీ గితే హాజరయ్యారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్బంగా విప్ మాట్లాడుతూ సెప్టెంబరు 17, 1948లో తెలంగాణ నాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై 78వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా తెలంగాణ ప్రజా పాలన వేడుకలను జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిందని, ప్రజా ప్రభుత్వం సెప్టెంబరు 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తోందని, ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచి అమలు చేయడం ప్రారంభించిందన్నారు. 2047 నాటికి దేశ ముఖచిత్రాన్ని మార్చే గేమ్ ఛేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పమన్నారు. సంకల్పానికి దార్శనిక పత్రమే తెలంగాణ రైజింగ్-2047 అని అన్నారు. ఇది ప్రణాళిక కాదని, ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పమన్నారు.
మహిళల అభ్యున్నతే ధ్యేయం
ఇందిరా మహిళా శక్తిలో భాగంగా డీఆర్డీవో, మెప్మా ఆధ్వర్యంలో జిల్లాలోని ఎస్‌హెచ్‌జీల ద్వారా 23 ఫర్టిలైజర్ దుకాణాలు ప్రారంభించామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 7111 యూనిట్ల లక్ష్యానికి ఇప్పటివరకు 1586 యూనిట్లను గుర్తించి రూ.200 కోట్ల బ్యాంక్ రుణాలు ఇచ్చామన్నారు. శ్రీనిధి ద్వారా రూ. 68 కోట్లు లక్ష్యం కాగా, రూ 25 కోట్ల రుణాలు ఇచ్చామన్నారు. 5691 యూనిట్లు లక్ష్యం కాగా, 1607యూనిట్లు గ్రౌండింగ్ చేశామన్నారు. చేయూత పింఛన్లు జిల్లాలో లక్షా17 వేల 370మంది పింఛన్‌దారులకు పంపిణీ చేస్తున్నామన్నారు.
నేతన్నలకు చేతి నిండా పని
సిరిసిల్లలోని నేతన్నలకు చేతి నిండా పని కల్పిస్తూ వారికి భరోసా ఇచ్చే విదంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తుందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 64.70 లక్షల మందికి పైగా ఉన్న ఎస్‌హెచ్‌జీ సభ్యులకు ఏడాదికి ఉచితంగా రెండు ఏకరూప చీరల కోసం 4.30 కోట్ల మీటర్ల వస్త్ర ఉత్పత్తి ఆర్డర్ల సిరిసిల్ల మరమగ్గాలకు కేటాయించిందిన్నారు. దీంతో జిల్లాలోని మరమగ్గాల ఆసాములు, కార్మికులు, అనుబంధ కార్మికులకు 8 నుంచి 10 నెలల వరకు ఉపాధి దొరుకుతుందన్నారు.
రూ.13 వేల కోట్లతో సన్న బియ్యం పంపిణీ
పీడీఎస్ వ్యవస్థ పేదల ఆహార భద్రతకు భరోసా ఇస్తోందని, అదే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీని ప్రారంభించిందన్నారు. జిల్లాలో కొత్తగా 14వేల 75 రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగిందని 30 వేల 376 మంది కుటుంబ సభ్యుల పేర్లు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో చేర్చడం జరిగిందని అన్నారు.
రూ 20 వేల కోట్ల రైతు రుణమాఫీ
గత ఏడాది ఆగస్టు 15న రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టామని. రాష్ట్రంలోని 25.35 లక్షల మంది రైతులకు, రూ 20వేల కోట్ల రుణమాఫీ చేసి.. కొత్త చరిత్ర సృష్టించామన్నారు. ఇందిరమ్మ రైతు భరోసా కింద ఎకరాకు రూ 12 వేల పెట్టుబడి సాయం ప్రకటించి, తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశామన్నారు. రాష్ట్రంలోని 70 లక్షల 11 వేల 184 మంది రైతులకు, అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న 1.2 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందించామన్నారు. జిల్లాలో 393 మంది రైతు కుటుంబాలకు రూ 18 కోట్లు బీమా కింద పంపిణీ చేశామన్నారు. రైతు భరోసా కింద లక్ష 26 వేల 278 మంది రైతులకు రూ 149.27 కోట్లు పంపిణీ చేశామన్నారు. 47977 మంది రైతులకు రూ 381.45 రుణ మాఫీ చేశామన్నారు. రాష్ట్రంలో 7178 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని. సన్నాలకు క్వింటాల్‌కు రూ 500 బోనస్ ఇస్తున్నామని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌లో భాగంగా 29 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, దీని కోసం రూ 16691 సబ్సిడీని విద్యుత్తు సంస్థలకు చెల్లిస్తున్నామన్నారు. అన్నదాతల సంక్షేమానికి రూ లక్ష 13 వేల కోట్లలను ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు.
జిల్లాలో 12623 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు
తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, దీనికి రూ 22.వేల 500 కోట్లు వెచ్చించామన్నారు. జిల్లాలో 12 623 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు 7927 ఇళ్లు, మిడ్ మానేర్ ముంపు గ్రామాల ప్రజలకు 4696 ఇళ్లు ప్రభుత్వం అదనంగా మంజూరు చేసిందన్నారు. 10234 ఇంటి నిర్మాణలకు మంజూరు ఉత్తర్వులు పంపిణీ చేయగా, 5305 గృహాలకు లబ్ధిదారులు ముగ్గుపోశామని, వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం రూ 38 కోట్లకు పైగా నేరుగా జమ చేసిందన్నారు. గృహజ్యోతి పథకం ద్వారా మార్చి 2024నుంచి ఆగస్టు 2025 వరకు 17లక్షల 52 వేల జీరో కరెంట్ బిల్లులు జారీ చేసి, రూ 67.70 కోట్ల లబ్ధి చేకూర్చామన్నారు. జెగ్గారావుపల్లి, పద్మనగర్, పాపయ్యపల్లి, గుండారం, తిప్పాపూర్‌లో 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాల కోసం ఎన్‌పీడీసీఎల్‌కు ప్రతిపాదనలు పంపించామన్నారు. మహాలక్ష్మీ పథకం ద్వారా ఆడబిడ్డలకు రూ 6 వేల 790 కోట్లు ఆదా అయ్యిందని. రాష్ట్రంలో ఆడబిడ్డల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం రూ 46వేల 689 కోట్లు సమకూర్చిందన్నారు. జిల్లాలో 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు రూ 119.50 కోట్ల విలువైన 315 లక్షల జీరో టికెట్లపై మహిళలు ప్రయాణం చేశారని అన్నారు.
ఆరోగ్యశ్రీ పరిధి రూ 10 లక్షలకు పెంపు...
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో వైద్యారోగ్యంపై రూ 16 వేల 521 కోట్ల వ్యయం చేశామన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిని రూ 5 లక్షల నుంచి రూ 10 లక్షలకు పెంచగా, డిసెంబర్ 9, 2023 నుంచి ఆగస్టు 2025 వరకు 24154వేల మంది రోగులు రూ 62 కోట్ల విలువైన ఆపరేషన్లు, ఇతర వైద్య సేవలు పొందారన్నారు. జిల్లాలో సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఇప్పటివరకు రూ 16.85 కోట్ల, అలాగే 275 ఎల్‌వోసీల ద్వారా రూ.5కోట్ల సాయం అందజేశామన్నారు. ధర్తి అబా జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంపిక చేసిన రుద్రంగి, వీర్నపల్లి నుంచి గిరిజన ప్రాంతాల లబ్ధిదారుల నుంచి 82 మంది దరఖాస్తులు ప్రక్రియలో ఉన్నాయన్నారు.
విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించేలా ఏర్పాట్లు
జిల్లాలోని విద్యార్థులు జాతీయస్థాయిలో పోటీ పరీక్షలకు సిద్ధం చేసేలా 39 రెసిడెన్షియల్ విద్యాలయాల్లో అన్‌అకాడమీ సంస్థ ద్వారా రూ.25 లక్షలతో ఐఐటీ ఫౌండేషన్, ఐఐటీ-జేఈఈ, నీట్-యూజీ మెడికల్ ఆన్లైన్ కోచింగ్ తరగతులను నిర్వహిస్తూ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తోందన్నారు. జిల్లాలో 13వేల 258 మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారన్నారు. యువతను రక్షించుకుంటేనే తెలంగాణకు భవిత అందుకే యువత ఉద్యోగ, ఉపాధికి పెద్ద పీట వేస్తున్నామన్నారు. ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం టీజీపీఎస్సీని సంస్కరించామని. 20 నెలల కాలంలో దాదాపు 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. అలాగే భూ భారతి అమలులో భాగంగా జిల్లాలో అవసరమైన గ్రామపాలన అధికారులను ప్రభుత్వం నియమించిందన్నారు.
ఉపాధి పనుల జాతర
జిల్లాలోని 12 మండలాల పరిధిలోని అన్ని గ్రామాల్లో పనుల జాతర కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఉపాధిహామీ పథకం, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, స్వచ్ఛభారత్ వంటి విభాగాల్లో 258 పనులు రూ 7.80 కోట్లతో చేపట్టామన్నారు. తెలంగాణ మాగాణాలకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇచ్చే ప్రణాళికలతో పెండింగ్ ప్రాజెక్టులను లక్ష్యాలు నిర్దేశించుకుని పూర్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, ఏఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆలస్యం..
జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో బుధవారం ప్రజా పాలన దినోత్సవానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆలస్యంగా రావడం ప్రొటోకాల్ వివాదంగా మారింది. ప్రభుత్వ ప్రొటోకాల్ ప్రకారం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతాలాపన పూర్తవుతున్న క్రమంలో కలెక్టర్ వేదిక పైకి వచ్చారు. ముఖ్య అతిథి కంటే ముందే ఉండాల్సిన కలెక్టర్ ప్రొటోకాల్ పాటించకుండా వ్యవహరించిన తీరు ప్రజా పాలన దినోత్సవాన్ని అవమానించినట్లుగా విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ముఖ్యఅతిథి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సందేశం ఉంటుందన్న అంశాన్ని చేర్చకుండా ఆహ్వాన పత్రిక వెల్లడించారు. కలెక్టర్ ప్రొటోకాల్ పాటించని తీరుపై ప్రభుత్వ విప్ శ్రీనివాస్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఇతర అధికారులకు ఫిర్యాదు చేశారు.