భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Sep 24 , 2025 | 12:12 AM
తెలంగాణ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తోందని బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎగమంటి ఎల్లారెడ్డి అన్నారు.
సిరిసిల్ల టౌన్, సెప్టెంబర్ 23 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తోందని బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎగమంటి ఎల్లారెడ్డి అన్నారు. మంగళవారం బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ)ఆధ్వర్యంలో జిల్లా సహాయ కార్మిక అధికారి నజీర్‌కు కార్మికుల పలు డిమాండ్లను అమలుచేయాలని వినతిపత్రం అందించారు. ఈ సందర్భం గా ఎల్లారెడ్డి మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో పని చేస్తున్న కార్మికులు దేశ అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్నారని, నిర్మాణ రంగాన్ని నమ్ముకొని జీవిస్తున్న కార్మికుల సంక్షేమం కోసం ఐక్యపోరాటాల ఫలితంగా 1996లో భవన నిర్మాణ కార్మిక చట్టం ఏర్పడిందన్నారు. దేశవ్యాప్తంగా వెల్ఫేర్ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలను సాధించుకున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నూతన విధానల వలన కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు నిధులను పక్కదారి పట్టించే విధంగా వెల్ఫేర్ బోర్డు స్కీంలకు సంబంధించి ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్ప చెప్పేందుకు తీసుకొచ్చిన జీవో నంబరు 12 వలన కార్మికులకు తీవ్రమైన నష్టం జరుగుతుందని ప్రభుత్వం వెంటనే జీవో నెంబరు 12ను సవరించాలని లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా కార్మికులను ఐక్యం చేసి ఆందోళలను చేపడతామ న్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఈసంపెల్లి రాజ ఎల్లయ్య, సావనపెల్లి ప్రభాకర్, దేవయ్య, నాగారాజు తదితరులు పాల్గొన్నారు.