Share News

కాళేశ్వరంపై కుట్రలు కొనసాగుతున్నాయి

ABN , Publish Date - Aug 06 , 2025 | 12:36 AM

కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో మాజీ మంత్రి హరీష్‌రావు కాశేళ్వరం ప్రాజెక్టుపై నిర్వహించిన పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ను చింతకుంటలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన తిలకించారు.

కాళేశ్వరంపై కుట్రలు కొనసాగుతున్నాయి

భగత్‌నగర్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో మాజీ మంత్రి హరీష్‌రావు కాశేళ్వరం ప్రాజెక్టుపై నిర్వహించిన పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ను చింతకుంటలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన తిలకించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హరీష్‌రావు ఇచ్చిన ప్రజెంటేషన్‌ అద్భుతంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని హరీష్‌రావు అసెంబ్లీలో పూర్తి ఆధారాలతో నిలదీస్తారన్నారు. కాళేశ్వరానికి అనుమతులు ఇచ్చిందే కేంద్ర ప్రభుత్వమన్నారు. కాళేశ్వరం పూర్తి రిపోర్ట్‌ బయటకు వచ్చాక కాంగ్రెస్‌ సంగతి చూస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే సీఎం రేవంత్‌రెడ్డి హడావుడి చేస్తున్నారన్నారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి బాధ్యతను మాత్రమే నిర్వర్తించారని, అది రాజకీయ జోక్యం ఎలా అవుతుందని ప్రశ్నించారు. కేసీఆర్‌ను వేధించాలనే ధోరణి తప్ప సీఎం రేవంత్‌రెడ్డికి ప్రజా సమస్యలు పట్టడం లేదన్నారు. దేశంలో చాలా కమిషన్లు న్యాయ స్థానాల ముందు నిలబడలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై కమిషన్‌ ఇచ్చిన 650 పేజీల రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నచ్చిన పేరాలను లీక్‌ చేశారని, నచ్చని నాయకులను బద్నాం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో ప్రాజెక్టులు ఎండిపోతున్నాయని, చంద్రబాబు సాగునీరు దోచుకు పోతున్నాడన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ సస్య శ్యామలంఅయిందన్నారు. కేసీఆర్‌పై కుట్రలతో లేనిపోనివి సృష్టించి బిఆర్‌ఎస్‌ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌, బీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌, జడ్పీ మాజీ చైర్మన్‌ కనుమల్ల విజయ, గ్రంథాలయ మాజీ చైర్మన్‌ పొన్నం అనిల్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 06 , 2025 | 12:36 AM