ఖర్గే సభపై కాంగ్రెస్ నజర్
ABN , Publish Date - Jul 03 , 2025 | 01:18 AM
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్) ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్ర పర్యటన వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ, మండల, బ్లాక్ శాఖల అధ్యక్షులను, ముఖ్య నేతలను పెద్ద ఎత్తున తరలించేందుకు సన్నద్ధమవుతున్నది. మూడు నెలల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈనెల 4న ఎల్‌బీ స్టేడియంలో ఖర్గే ప్రసంగించనున్నారు.
- పెద్ద ఎత్తున నేతలను తరలించేందుకు ప్రయత్నాలు
- స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక ప్రణాళిక
- గ్రామస్థాయి నేతల కోసమే సదస్సు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్ర పర్యటన వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ, మండల, బ్లాక్ శాఖల అధ్యక్షులను, ముఖ్య నేతలను పెద్ద ఎత్తున తరలించేందుకు సన్నద్ధమవుతున్నది. మూడు నెలల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈనెల 4న ఎల్‌బీ స్టేడియంలో ఖర్గే ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న గ్రామ, మండల, బ్లాక్, జిల్లా శాఖల అధ్యక్షుల సమ్మేళనం రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. పార్టీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేసి పటిష్టమైన శక్తిగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం ద్వారా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయాలని అధిష్ఠానం భావిస్తోంది. పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఇప్పటికే జిల్లాల్లో అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా, పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా సమావేశాలు నిర్వహించారు.
ఫ డీసీసీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం
డీసీసీ అధ్యక్షుడు, మానకొండూర్ శాసన సభ్యుడు కవ్వంపల్లి సత్యనారాయణ నేతృత్వంలో ఇప్పటికే ప్రత్యేక కార్యాచరణతో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. డీసీసీ కార్యాలయంలో కవ్వంపల్లితోపాటు పార్లమెంట్ నియోజకవర్గ పీసీసీ సమన్వయ కర్తలు మహ్మద్ ఖాజా ఫకృద్దీన్, ఆడం రాజ్ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి తదితర నేతలు సమావేశంలో పాల్గొని క్షేత్రస్థాయి నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కాంగ్రెస్ నేత వి నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి నేతల, ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. వి నరేందర్‌రెడ్డితో పాటు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, వైద్యుల అంజన్‌కుమార్, బుచ్చిరెడ్డి, సరిళ్ల ప్రసాద్, భూమాగౌడ్, శ్రవణ్‌నాయక్, పిట్టల శ్రీనివాస్, నేతికుంట యాదయ్య, వెన్నం రజితారెడ్డి, చర్ల పద్మ, సిరాజ్ హుస్సేన్ తదితర నాయకులు సన్నాహాక సమావేశానికి హాజరయ్యారు. ఖర్గే సభకు పెద్ద ఎత్తున క్షేత్ర స్థాయి నేతలను తరలించేందుకు సంసిద్ధత ప్రకటించారు. క్షేత్ర స్థాయిలో ఉన్న అన్ని కమిటీల నేతలను ముఖ్య కార్యకర్తలను చైతన్య వంతులను చేయాలని భావిస్తున్నారు. ఎన్నికల విషయంలో రాష్ట్ర హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో గ్రామ స్థాయి నేతలు కూడా సభపపై ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే గ్రామాల్లో స్థానిక ఎన్నికలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఫ వారం రోజులకో కార్యక్రమంతో ప్రజల్లోకి..
నియోజక వర్గ స్థాయి నేతలు ఆయా గ్రామాల బాధ్యులను గుర్తించి వారికి వాహనాలను సమకూర్చి గ్రామ స్థాయి నేతల తరలింపునకు కార్యాచరణ రూపొందించారు. గ్రామ మండల బ్లాక్, జిల్లా శాఖల అధ్యక్షులకు మాత్రమే పరిమితమైన సదస్సు అయినా అనుబంధ సంఘాల నేతలను, క్షేత్ర స్థాయిలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నేతలను కూడా తరలించాలని నిర్ణయించారు. ఇప్పటి నుంచి ప్రతి వారం, పదిహేను రోజులకు ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లి ఇప్పటికే అందిన ఫలాలను వివరించేందుకు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బిఆర్‌ఎస్, బీజేపీ చేస్తున్న ప్రచారాలను తిప్పికొట్టే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.