Share News

అరకొర నిధులపై అయోమయం..

ABN , Publish Date - Apr 30 , 2025 | 12:50 AM

పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు వేసవి సెలవుల్లో సమయాన్ని వృథా చేసుకోకుండా క్రీడలపై ఆసక్తిని పెంచే దిశగా క్రీడా శాఖ వేసవి శిబిరాలకు శ్రీకారం చుట్టింది.

అరకొర నిధులపై అయోమయం..

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు వేసవి సెలవుల్లో సమయాన్ని వృథా చేసుకోకుండా క్రీడలపై ఆసక్తిని పెంచే దిశగా క్రీడా శాఖ వేసవి శిబిరాలకు శ్రీకారం చుట్టింది. అయితే విద్యార్థులకు క్రీడాంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినా నామమాత్రపు నిధుల కేటాయింపులు నిరాశను కలిగిస్తున్నాయి. జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణ నిధులు చూస్తే ప్రభుత్వ నిర్లక్ష్యమే కనిపిస్తోంది. ప్రతి వేసవిలో నెల రోజుల పాటు నిర్వహించే వేసవి శిబిరాలు మే 1న ప్రారంభం కానున్నాయి. మే 30 వరకు గ్రామీణ ప్రాంతాల్లో, జిల్లా కేంద్రంలో జూన్‌ 6 వరకు శిబిరాలు నిర్వహించనున్నారు. శిబిరాల నిర్వహణ కోసం జిల్లాకు ప్రభుత్వం రూ.50 వేలు కేటాయించింది. ఇందులో 40 వేలు క్రీడల్లో శిక్షణ ఇచ్చే వారికి కేటాయిస్తే రూ.10 వేలు మాత్రమే శిబిరాల నిర్వహణకు ఉపయోగించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే శిబిరాల్లో శిక్షణ ఇచ్చేవారికి రూ.4 వేలు, జిల్లా కేంద్రంలో రూ.7500 వేతనం ఇవ్వనున్నారు. మండల కేంద్రాల్లో పది శిబిరాలకు వేతనాల కింద రూ.40 వేలు ఖర్చు కానున్నాయి. మిగిలిన రూ.10 వేలు శిబిరాల నిర్వహణకు ఉపయోగిస్తారు. దీనిని బట్టి శిబిరానికి వెయ్యి రూపాయలు నెల రోజుల పాటు ఉపయోగించుకోవాలి.. ఆ లెక్కన రోజుకు నిర్వహణ ఖర్చు కింద రూ.33 అవుతుంది. నామమాత్రంగా ఉన్న నిధులతో శిక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, క్రీడాకారులు కూడా నిర్వహణ ఏలా జరుగుతుందనే అయోమయాన్ని వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు క్రీడా శిబిరాలు దోహదపడుతాయని భావిస్తున్నా అరకొర నిధులతో నిర్వహణ భారంగానే మారింది. మొక్కుబడి నిధులతో సాగే శిబిరాలకు వచ్చే విద్యార్థులు ఈసారి ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేసుకొనే విధంగా చర్యలు చేపట్టారు. వెబ్‌సైట్‌లో వివరాలను నమోదు చేసుకోవడం ద్వారా విద్యార్థులు నెలరోజుల పాటు సాగే విద్యార్థుల ప్రతిభను అంచనా వేయనున్నారు.

ఫ మండలాల్లో 10, జిల్లా కేంద్రంలో12 శిబిరాలు..

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మండల, గ్రామీణ ప్రాంతాల్లో 10 శిబిరాలను, జిల్లా కేంద్రంలోని స్టేడియంలో 12 అంశాల్లో శిబిరం నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తిచేశారు. కోనరావుపేట మండలం ధర్మారంలో కబడ్డీ, తంగళ్లపల్లి మండల కేంద్రంలో అథ్లెటిక్స్‌, గంభీరావుపేట మండలం కొత్తపల్లిలో హ్యాండ్‌బాల్‌, రుద్రంగి మండల కేంద్రం, బోయినపల్లి మండలం విలాసాగర్‌, కొదురుపాక ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం, ఇల్లంతకుంట మండల కేంద్రాల్లో వాలీబాల్‌, కోనరావుపేట మండల కేంద్రం, ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌లో కరాటేపై శిక్షణ ఇవ్వనున్నారు. దీంతో పాటు జిల్లా కేంద్రంలోని స్టేడియంలో 12 అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. స్టేడియంలో అథ్లెటిక్స్‌ కరాటే, యోగా, వాలీబాల్‌, టేబుల్‌టెన్నిస్‌, షటిల్‌, బ్యాడ్మింటన్‌, క్రికెట్‌, బాస్కెట్‌బాల్‌, అర్చరీ, కబడ్డీ, క్యారమ్స్‌, చెస్‌లలో శిబిరాలు నిర్వహించనున్నారు. క్రీడలపై ఆసక్తి ఉన్న 14 సంవత్సరాలలోపుగల 20 నుంచి 30 మందికి శిబిరంలో శిక్షణ ఇవ్వనున్నారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు శిక్షణ అందించనున్నారు.

ఫ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి...

- ఏ రాందాస్‌, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి

జిల్లాలో నిర్వహించే వేసవి ప్రత్యేక శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. వివిధ క్రీడాంశాల్లో నైపుణ్యం ఉన్న శిక్షకులతో శిక్షణ అందించడానికి ఏర్పాట్లు చేశాం. ఉదయం, సాయంత్రం వేళల్లో శిక్షణ అందించనున్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం పది శిబిరాలు, జిల్లా కేంద్రంలో స్టేడియంలో 12 అంశాల్లో 12 శిబిరాలను నిర్వహించనున్నాం. ఆసక్తిగల విద్యార్థులు ఉచిత వేసవి క్రీడా శిక్షణలో పేర్లు నమోదు చేసుకోవాలి.

Updated Date - Apr 30 , 2025 | 12:50 AM