గందరగోళంగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్
ABN , Publish Date - Oct 01 , 2025 | 12:20 AM
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై గందరగోళం నెలకొంది. మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంపై అధికార కాంగ్రెస్ పార్టీ సహ వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు అవాక్కవుతున్నారు.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై గందరగోళం నెలకొంది. మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంపై అధికార కాంగ్రెస్ పార్టీ సహ వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు అవాక్కవుతున్నారు. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు, పంచాయతీ ఎన్నికలకు పొంతన లేకుండా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ గందరగోళంగా ఉందనే అభిప్రాయలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ షెడ్యూల్ వల్ల పోటీ చేసే అభ్యర్థులు, ఓటర్లు అయోమయానికి గురయ్యే పరిస్థితి ఏర్పడింది. గతంలో ఎన్నడూ ఈ విధంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కాలేదని ఆయా పార్టీలకు చెందిన నాయకులు అంటున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబరు 9వ తేదీన, రెండవ విడత అక్టోబర్ 13వ తేదీన జారీ కానున్నది. అదే రోజు నుంచి 11, 15వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. పోలింగ్ 23, 27 తేదీల్లో జరగనుండగా, కౌంటింగ్ నవంబర్ 11న నిర్వహిస్తామని ప్రకటించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహిస్తుండగా, మొదటి విడత అక్టోబర్ 17న, రెండో విడత 21న, మూడో విడత 25వ తేదీన నోటిఫికేషన్ జారీ కానున్నది. అదే రోజు నుంచి 19, 23, 27 తేదీల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. విడతల వారీగా ఎన్నికల పోలింగ్ అక్టోబరు 31న, నవంబర్ 4న, 8వ తేదీన నిర్వహించనున్నారు. అదే రోజు ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. రిజర్వేషన్లను అనుసరించి ఐదేళ్లకోసారి జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నాయకులు చూస్తారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం ముగిసి ఏడాదిన్నరకు పైగా అవుతున్నది. మండల, జిల్లా పరిషత్‌ల పాలకవర్గాల పదవీ కాలం ముగిసి ఏడాది దాటింది. ఈ రెండు ఎన్నికలు రాష్ట్రంలో మూడు నుంచి ఆరు మాసాల గ్యాప్‌తో జరుగుతున్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయమై ఎన్నికల నిర్వహణలో జాప్యం జరగడంతో సెప్టెంబరు నెలాఖరులోగా స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు, షెడ్యూల్ విడుదల చేసిన మేరకు ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు జీఓ 9 ఉత్తర్వులు జారీ చేసి రిజర్వేషన్లు ప్రకటించింది. రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా వచ్చే నెల 8వ తేదీన పూర్తి స్థాయి విచారణ జరగనున్నది.
ఫ మండల, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడం గందర గోళానికి దారి తీసింది. ఈ రెండింటి ఎన్నికల మధ్య కనీసం నెల రోజుల తేడా కూడా లేదు. సాధారణంగా రిజర్వేషన్లను అనుసరించి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందే కొందరు నాయకులు, తమ అదృష్టాన్ని పంచాయతీ ఎన్నికల్లో పరీక్షించుకోవాలని చూస్తారు. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం ఆ విధంగా పోటీ చేసేందుకు కావాల్సిన సమయం ఇవ్వకపోవడంతో స్థానిక నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ పూర్తి కాక ముందు, ఫలితాలు వెలువడక ముందే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఉండడం అయోమయానికి గురి చేస్తున్నది. ఒక అభ్యర్థి రెండు ఎన్నికల్లో ఏక కాలంలో పోటీ చేయడం కష్టం. ఒకవేళ పోటీ చేసినా గుర్తుల గురించి ప్రచారం ఎలా చేసుకోవాలనే ప్రశ్న నెలకొంది. అలాగే ఎంపీటీసీ, జడ్పీటీసీ మొదటి, రెండో విడత ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 23, 27 జరగనున్నది. అదే సమయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కూడా ప్రచారం చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అటు.. ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు, ఇటు.. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు చేసే ప్రచారంతో ఓటర్లు అయోమయానికి గురి కావాల్సి వస్తుంది. దీంతో అభ్యర్థుల గెలుపు ఓటముల్లో ప్రభావం ఉండే అవకాశాలు లేకపోలేదు. రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించి స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై పునరాలోచన చేయాలని ఆయా రాజకీయ పార్టీల నాయకులు కోరుతున్నారు.