సమయానికి ఆర్టీసీ బస్సులు నడిపించాలని ఆందోళన
ABN , Publish Date - Aug 21 , 2025 | 12:49 AM
విద్యా సంస్థల సమయానికి ఆర్టీసీ అధికారులు బస్సులను నడిపించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలోని నాయకులు విద్యార్థులతో కలిసి బుధవారం వీర్నపల్లి మండల కేంద్రంలో ఆందోళన చేపట్టారు.
వీర్నపల్లి(ఎల్లారెడ్డిపేట), ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి) : విద్యా సంస్థల సమయానికి ఆర్టీసీ అధికారులు బస్సులను నడిపించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలోని నాయకులు విద్యార్థులతో కలిసి బుధవారం వీర్నపల్లి మండల కేంద్రంలో ఆందోళన చేపట్టారు. స్థానిక ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు రాకపోకలు స్తంభించిపోయాయి. ఆర్టీసీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు సమయానికి పాఠశాలలు, కళాశాలలకు చేరుకోలేక తరగతులను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోతోందని వాపోయారు. అటవీ గ్రామాల విద్యార్థులకు ఆర్టీసీ బస్సు వసతి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అధికారులు వచ్చేంతవరకు ఇక్కడ నుంచి కదలబోమని తేల్చి చెప్పారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిరసనకారులను శాంతింపజేయడానికి యత్నించారు. పోలీసులు, నాయకులు, విద్యార్థుల నడుమ వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎల్లారెడ్డిపేట ఎస్‌ఐ రాహుల్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు చేరుకున్నారు. ఆర్టీసీ డిపో మేనేజర్‌తో ఫోనులో మాట్లాడారు. సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జూలపల్లి మనోజ్‌కుమార్, విద్యార్థులు ప్రవీణ్, దివ్య, సాత్విక్ తదితరులు పాల్గొన్నారు.