మానేరు చెక్ డ్యామ్ ఘటనపై సమగ్ర విచారణ
ABN , Publish Date - Nov 24 , 2025 | 11:48 PM
జమ్మికుంట మండలం తనుగుల సమీపంలోని మానేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ దెబ్బతిన్న ఘటనపై జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ సీరియస్‌గా స్పందించింది.
కరీంనగర్ క్రైం/జమ్మికుంట రూరల్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): జమ్మికుంట మండలం తనుగుల సమీపంలోని మానేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ దెబ్బతిన్న ఘటనపై జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ సీరియస్‌గా స్పందించింది. సోమవారం కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. నవంబరు 21న రాత్రి సమయంలో ఈ చెక్ డ్యామ్ దెబ్బతిన్నది. ఈ ఘటన నీటి ప్రవాహానికి సహజంగా జరిగిందా? లేక ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా విధ్వంసానికి పాల్పడ్డారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, జమ్మికుంట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఫ శాస్త్రీయ విచారణ- క్లూస్ టీం పరిశీలన..
ఘటనా స్థల పరిశీలనలో భాగంగా అధికారులతో పాటు హైదరాబాద్ నుంచి వచ్చిన ఫోరెన్సిక్ ల్యాబ్ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకట్ రాజ్ నేతృత్వంలోని బృందం కరీంనగర్ క్లూస్ టీం సభ్యులు, ఫింగర్ ప్రింట్ ఇన్‌స్పెక్టర్లు రాజు, స్వర్ణజ్యోతి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ఈ ఘటనకు కారణాలను వెలికితీయడానికి పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నామన్నారు. సాంకేతిక నిపుణుల సహకారంతో అక్కడి నుంచి నమూనాలు సేకరించామని తెలిపారు. ఎవరైనా బాధ్యులని తేలితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో హుజురాబాద్ ఏసీపీ మాధవి, పెద్దపల్లి ఏసీపీ కృష్ణ, ఇన్‌స్పెక్టర్లు రామకృష్ణగౌడ్, లక్ష్మీనారాయణ, ఎస్‌ఐలు శేఖర్‌రెడ్డి, ఆవుల తిరుపతి పాల్గొన్నారు.