Share News

పకడ్బందీ ప్రణాళికతో సమగ్ర అభివృద్ధి

ABN , Publish Date - Aug 12 , 2025 | 12:29 AM

పకడ్బందీ ప్రణాళికతో కరీంనగర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.

పకడ్బందీ ప్రణాళికతో సమగ్ర అభివృద్ధి
సుడా కార్యాలయం వాణిజ్య భవన సముదాయానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రులు శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, పాల్గొన్న కలెక్టర్‌, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి, మేడిపల్లి సత్యం

- మానేరు రివర్‌ ఫ్రంట్‌ పనులు పూర్తి చేస్తాం

- నగరంలో అసంపూర్తిగా ఉన్న పనులపై కార్యాచరణ..

- శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి..

- మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు..

కరీంనగర్‌ అర్బన్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): పకడ్బందీ ప్రణాళికతో కరీంనగర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. కరీంనగర్‌ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పక్కన సుడా వాణిజ్య భవన సముదాయ నిర్మాణం, ఐడీఎస్‌ఎంటీ షాపింగ్‌ కాంప్లెక్స్‌ ఆధునీకరణ పనులకు ఆయన సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మ్రాట్లాడుతూ నాలుగు కోట్లతో సుడా వాణిజ్య భవన నిర్మాణాన్ని చేపడుతున్నామన్నారు. ప్రస్తుతం మొదటి దశలో రెండు కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఐడీఎస్‌ఎంటీ షాపింగ్‌ కాంప్లెక్స్‌ పనులు 79 లక్షలతో చేపడుతున్నామన్నారు. పనులు వేగవంతంగా చేపట్టి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నగరంలో అసంపూర్తిగా ఉన్న పనులకు ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామనీ, ఆ పనులు వేగవంతంగా పూర్తయ్యేలా చూస్తామన్నారు. మానేర్‌ రివర్‌ ఫ్రంట్‌ పనులపై త్వరలోనే సమీక్ష జరిపి, పెండింగ్‌ పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. కార్యక్రమంలో , ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కలెక్టర్‌ పమేలా సత్పతి, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌, ఆర్డీవో మహేశ్వర్‌, మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్‌, మృత్యుంజయం, మాజీ కార్పొరేటర్లు పడిశెట్టి భూమయ్య, కట్ల సతీష్‌, నాయకులు ఎండీ తాజ్‌, సమద్‌నవాబ్‌, దన్నా సింగ్‌, గుండాటి శ్రీనివాస్‌రెడ్డి, వాడె వెంకట్‌రెడ్డి, కొట్టె ప్రభాకర్‌ పాల్గొన్నారు.

ఫ సుడా కార్యాలయంలో....

అభివృద్ధిపనులకు శ్ఖఉస్థాపనలు చేసిన అనంతరం మంత్రులు శ్రీధర్‌ బాబు, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ సుడడా కార్యాలయానికి చేరుకున్నారు. మంత్రులకు పోలీసులు గౌరవవందనం సమర్పించారు. అనంతరం మంత్రులు కలెక్టర్‌ పమేలా సత్పతి, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌తో జిల్లాలోని సమస్యలపై చర్చించారు. సమస్యల పరిష్కారం కోసం కొందరు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు మంత్రులకు వినతిపత్రాలు అందజేయగా అక్కడి నుంచే సంబంధిత అధికారులకు ఫోన్‌ చేసి మాట్లాడారు. మంత్రిని టీఎన్జీవోస్‌ నాయకులు, పలువురు రాజకీయ నాయకులు, అధికారులలు కలిశారు. కరీంనగర్‌ నూతన కలెక్టరేట్‌ భవనం పనులను త్వరగా పూర్తిచేయాలని మంత్రి శ్రీధర్‌బాబు అధికారులకు సూచించారు.

Updated Date - Aug 12 , 2025 | 12:29 AM