‘స్మార్ట్‌సిటీ’ పనులను డిసెంబరులోగా పూర్తి చేయండి
ABN , Publish Date - Oct 15 , 2025 | 12:40 AM
నగరంలో స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ నిధుల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను డిసెంబరు 31లోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
కరీంనగర్ టౌన్, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): నగరంలో స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ నిధుల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను డిసెంబరు 31లోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులతో అభివృద్ధి పనులు, వీధిదీపాల నిర్వహణ, పన్నుల వసూళ్లపై సమీక్ష నిర్వహించారు. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో ప్రారంభించి కొనసాగుతున్న డిజిటల్ లైబ్రరీ భవనం, బాలసదన్ భవనం, ఐసీసీసీ భవనం, ఎస్‌వీపీ భవనం ఆధునీకరణ పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. అక్టోబరుతో ఎస్‌వీపీ భవనం ఆధునీకరణ పనులను పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని సూచించారు. టవర్‌సర్కిల్ రెన్యూవేషన్ అభివృద్ధి పనులను ప్రారంభించి త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు. మంచినీటి సరఫరాలో ఇబ్బందులు రాకుండా నీటి శుద్ధీకరణ కేంద్రంలో చేపట్టిన మరమ్మతు పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నల్లా పన్నుల వసూళ్లకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్‌ఈ రాజ్‌కుమార్, ఈఈలు సంజీవ్‌కుమార్, రొడ్డ యాదగిరి, డీఈలు లచ్చిరెడ్డి, ఓం ప్రకాశ్, అయూబ్‌ఖాన్, దేవేందర్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ పాల్గొన్నారు.