డీసీసీ అధ్యక్ష పదవికి పోటాపోటీ
ABN , Publish Date - Oct 22 , 2025 | 12:58 AM
కాంగ్రెస్‌లో పదవుల పండగకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందనే చర్చ జోరుగా సాగుతోంది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటా పోటీ నెలకొంది. డీసీసీ అధ్యక్షుడిగా పలువురు రేసులో ఉన్నారు.
జగిత్యాల, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌లో పదవుల పండగకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందనే చర్చ జోరుగా సాగుతోంది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటా పోటీ నెలకొంది. డీసీసీ అధ్యక్షుడిగా పలువురు రేసులో ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వాయిదా పడడంతో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా వివిధ స్థాయిల్లో నూతన కమిటీల నియామక ప్రక్రియ చేపట్టింది. డీసీసీ అధ్యక్ష పదవికి ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. డీసీసీ అధ్యక్షుడి నియామకానికి ఏఐసీసీ పరిశీలకుడిగా తమిళనాడుకు చెందిన మాజీ ఎంపీ డాక్టర్ జయకుమార్, టీపీసీసీ పరిశీలకులు కేతూరి వెంకటేశ్, మహ్మద్ ఖాజా ఫకీరొద్దీన్‌లు జగిత్యాల జిల్లాకు వచ్చారు. డీసీసీ అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే 36 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఏఐసీసీ పరిశీలకుడు డాక్టర్ జయ కుమార్, పీసీసీ పరిశీలకుడు కేతూరి వెంకటేశ్‌లు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. పలు నియోజకవర్గాల్లో సాధారణ జనం అభిప్రాయాలను సైతం సేకరించారు. డీసీసీ అధ్యక్ష పదవికి అర్హులైన వారి జాబితాను టీపీసీసీ, ఏఐసీసీకి అందజేయనున్నట్లు తెలుస్తోంది.
ఫదరఖాస్తు చేసుకున్నవారు..
జిల్లా కేంద్రంలో ఏఐసీసీ పరిశీలకుడు డాక్టర్ జయకుమార్ ఈనెల 17న ప్రత్యేక సమావేశం నిర్వహించి 36 మంది ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. డీసీసీ అధ్యక్ష పదవికి కాంగ్రెస్ నాయకులు జువ్వాడి నర్సింగరావు, కల్వకుంట్ల సుజిత్‌రావు, గాజెంగి నందయ్య, వాకిడి సత్యంరెడ్డి, కొమిరెడ్డి విజయ్ ఆజాద్, కొమిరెడ్డి కరం, కొమిరెడ్డి లింగారెడ్డి, షేర్ నర్సారెడ్డి, గుంటి జగదీశ్వర్, ఎండీ షాకీర్ సిద్ధిఖీ, అబ్దుల్ హఫీజ్, చెదలు సత్యనారాయణ, అల్లె పాండురంగ, పట్నం శేఖర్, గడ్డం రాజేశం, ముస్కు నిశాంత్ రెడ్డి, కూన భార్గవ్, పోగుల శ్రీనివాస్, తొట్ల అంజయ్య, రుత్త నారాయణ, లక్ష్మీ నారాయణ, సింగిరెడ్డి నరేశ్ రెడ్డి, అందె మారుతి, సంగనభట్ల దినేష్, వేముల సుభాష్, పుప్పాల వనిత, రాజేశం, శైలేందర్, పెద్దిరెడ్డి రవీందర్ రెడ్డి, అందె లలిత, రాజేశ్వరీ, మమత, బండ భాస్కర్‌రెడ్డి, కూన రాకేశ్, మదన్‌కుమార్, కృష్ణలు దరఖాస్తులు సమర్పించారు.
ఫపోటీ వీరి మధ్యే..
డీసీసీ పీఠం కోసం 36 మంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ పోటీ ప్రధానంగా ఐదుగురి మధ్యే ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పదవిని ఓసీకి కేటాయిస్తారా.. బీసీకి కేటాయిస్తారా..ఎస్సీ, ఎస్టీ వర్గాలకు దక్కుతుందా అని తేలనప్పటికీ ఆయా వర్గాలకు చెందిన పలువురు ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రధానంగా కోరుట్ల నియోజకవర్గంలో అధిక పోటీ నెలకొంది. కోరుట్ల నియోజకవర్గానికి డీసీసీ అధ్యక్ష పదవి కేటాయిస్తారన్న చర్చ పార్టీలో జరుగుతోంది. కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ నాయకులు జువ్వాడి నర్సింగరావు, టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు కొమిరెడ్డి జ్యోతిదేవీ, కొమిరెడ్డి రాములుల కుమారుడు కొమిరెడ్డి విజయ్ ఆజాద్, జగిత్యాల నియోజకవర్గానికి చెందిన గాజెంగి నందయ్య, గుంటిజగదీశ్వర్‌ల మధ్య పోటీ నెలకొన్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. దీంతో పాటు ధర్మపురి నియోజకవర్గానికి చెందిన సంగనభట్ల దినేష్, వేములవాడ నియోజకవర్గానికి చెందిన సింగిరెడ్డి నరేశ్‌రెడ్డిల పేర్లు చర్చల్లోకి వస్తున్నాయి.
ఫఅధిష్ఠానం ఆశీస్సులు ఎవరికో..?
గతంలో ఎన్నడూ లేని విధంగా డీసీసీ పీఠం కోసం పోటీ తీవ్రం కావడంతో ఎవరికి ఆ పీఠం దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆశీస్సులున్న వారికే పీఠం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరికి వారే పదవిపై ధీమాగా ఉండగా, అధిష్టానం దృష్టిలో ఎవరున్నారే విషయం కానీ, జిల్లా వ్యాప్తంగా పర్యటించిన ఏఐసీసీ పరిశీలకులు డాక్టర్ జయ కుమార్, టీపీసీసీ పరిశీలకులు కేతూరి వెంకటేశ్, మహ్మద్ ఖాజా ఫకీరోద్దిన్‌లు పరిశీలనలో కార్యకర్తలు ఎవరి వైపు మొగ్గు చూపారనే విషయం కానీ తెలియాంటే మరో ఒకటి, రెండు రోజులు ఆగాల్సిందే.
ఫకొద్దిరోజుల్లో ఉత్కంఠకు తెర
డీసీసీ అధ్యక్ష పీఠం కోసం వచ్చిన దరఖాస్తులను జిల్లా పరిశీలకులు పీసీసీకి అందజేసినట్లు సమాచారం. పీసీసీ స్థాయిలో చర్చించి నాయకులు, కార్యకర్తల్లో ఎక్కువ మంది కోరిన వ్యక్తి.. ఐదేళ్లుగా పార్టీకి చేసిన సేవలు, భవిష్యత్‌లో కలిగే లాభాలను బేరీజు వేసుకొని ఎంపిక చేయనున్నారు. ఈనెల 25న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల అధ్యక్షుల పేర్లను ప్రకటించాలని పీసీసీ నిర్ణయించినట్లు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. డీసీసీ అధ్యక్ష పీఠం ఎవరికి దక్కుతుందో కొద్దిరోజుల్లో తేలనుంది.