రండి బాబూ... రండి..
ABN , Publish Date - Oct 13 , 2025 | 01:17 AM
మద్యం దుకాణాలను దక్కించుకోవడానికి రెండేళ్ల క్రితం చూపిన ఆసక్తి ప్రస్తుత టెండర్ల ప్రక్రియలో కనిపించడం లేదు.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
మద్యం దుకాణాలను దక్కించుకోవడానికి రెండేళ్ల క్రితం చూపిన ఆసక్తి ప్రస్తుత టెండర్ల ప్రక్రియలో కనిపించడం లేదు. దరఖాస్తు ఫీజు పెరిగిన నేపథ్యంలో టెండరు వేసి నష్టపోతామనే భయంలో వ్యాపారులు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మద్యం వ్యాపారులకు కలిసొచ్చే ఎన్నికలు లేకపోవడంతో టెండర్లు అరకొరగానే వస్తున్నాయి. దీంతో రండి బాబూ.. రండి.. మద్యం దుకాణాలకు టెండర్లు వేయండి.. అనే పద్ధతిలో ఎక్సైజ్ అధికారులే ప్రచారం మొదలుపెట్టారు. మద్యం వ్యాపారులను ఫోన్లలో పలకరిస్తూ ఆహ్వానాలు పలుకుతున్నారు. గతంలో మద్యం దుకాణాలకు టెండర్లు వేసిన వారికి దాదాపు 16వేల మెసేజ్‌లు వెళ్లాయి. దీంతోపాటు కరపత్రాలు, బ్యానర్ల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం స్థానిక ఎన్నికలు వాయిదా పడడంతో మద్యం వ్యాపారులు టెండర్ల వైపు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. హైకోర్టు బీసీ రిజర్వేషన్లపై స్టే ఇవ్వడంతో ఎన్నికలు ప్రక్రియ నిలిచిపోయింది. డిసెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుండడంతో మద్యం దుకాణాలు దక్కించుకుంటే లాభదాయకంగా ఉంటుందని వ్యాపారులు ఆలోచనలు చేస్తూ సిండికేట్‌గా ముందుకెళ్లే విధంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమైన వారు మద్యం టెండర్లు, ఎన్నికల ఖర్చు దృష్టిలో పెట్టుకొని మద్యం టెండర్లకు దూరంగా ఉన్నవారు తిరిగి టెండర్లలో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఆసక్తి చెబుతున్నారు.
మిగిలింది ఐదు రోజులే..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 48 మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియ ప్రారంభమై 16 రోజులు గడిచిపోయింది. ఇప్పటివరకు వ్యాపారం బాగా ఉండే దుకాణాలకు మాత్రమే టెండర్లు వేశారు. టెండర్ల గడువు ఈనెల 18 తేదీతో ముగిసిపోతుంది. 23న డ్రా పద్ధతిలో దుకాణాల కేటాయింపు జరుగుతుంది. ఇందుకు కేవలం ఐదు రోజులే గడువు మిగిలి ఉండడంతో సోమవారం నుంచి గణనీయంగా దరఖాస్తులు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. దీనికి అనుగుణంగా ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లకు సైతం సిద్ధమైంది.
అప్లికేషన్ ఫీజు రూపంలో రూ.5.55కోట్ల ఆదాయం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో టెండర్ల ప్రక్రియలో 48 దుకాణాల్లో 28 దుకాణాలకు మాత్రమే 185 టెండర్లు దాఖలయ్యాయి. ప్రస్తుతం ఎక్సైజ్ శాఖకు జిల్లా నుంచి అప్లికేషన్ ఫీజు ద్వారా రూ 5.55 కోట్ల ఆదాయం సమకూరింది. గత లైసెన్స్ పీరియడ్‌లో 48 దుకాణాలకు డ్రా పద్ధతిలో మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ పూర్తిచేశారు. 2023-25 కాలానికి సంబంధించి మద్యం వ్యాపారులు భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. 2023 ఆగస్టులో జరిగిన టెండర్లలో 2036 మంది దరఖాస్తులు చేసుకోగా, 150 మంది మహిళలు ఉన్నారు. దరఖాస్తు రుసుము రూ.2 లక్షలు ఉండడంతో ఎక్సైజ్ ఖజానాకు జిల్లా నుంచి 40.72 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి దరఖాస్తు ఫీజు పెరిగింది. గతంలో రూ.రెండు లక్షలు ఉండగా, ఈసారి మూడు లక్షలకు పెంచారు. జిల్లాలో ఇప్పటివరకు మద్యం అమ్మకాల ద్వారా ఎక్సైజ్ శాఖకు భారీ రాబడి ఉంది. 1 డిసెంబరు 2023 నుంచి 10 అక్టోబరు 20225 వరకు జిల్లాలో వచ్చిన ఆదాయం రూ 961 కోట్లు ఉంది. 1డిసెంబరు 2021 నుంచి 30 నవంబరు 2023 వరకు రూ.996 కోట్ల ఆదాయం సమకూరింది.
సిండికేట్లపై ఎక్సైజ్ నజర్..
మద్యం టెండర్లు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమై 16 రోజులు గడిచిపోయినా 185 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. రెండో శనివారం అయినప్పటికీ సెలవు లేకుండా దరఖాస్తులు స్వీకరించినా స్పందన కనిపించకపోవడంపై ఎక్సైజ్ శాఖ సిండికేట్లపై దృష్టి పెట్టినట్లు తెలిసింది. సిండికేట్ల ద్వారా అప్లికేషన్లు తగ్గి ఆదాయం పడిపోతే రీనోటిఫై చేసే ఆలోచనలో ఎక్సైజ్ శాఖ ఉన్నట్లు తెలుస్తోంది గతంలో దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలు ఉండగా ఈసారి రూ.3 లక్షలకు పెంచడంతోనే దరఖాస్తులు తగ్గినట్లుగా చర్చ జరుగుతోంది.