రావయ్యా.. గణపయ్య..
ABN , Publish Date - Aug 27 , 2025 | 01:12 AM
ఆది దేవుడు... సర్వ విఘ్నాలను తొలగించే వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడానికి భక్తులు ఏర్పాట్లు చేసుకున్నారు.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
ఆది దేవుడు... సర్వ విఘ్నాలను తొలగించే వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడానికి భక్తులు ఏర్పాట్లు చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా గణేష్ ఉత్సవాల సందడి మొదలైంది. తొలిపూజలు అందుకునే గణపయ్యను కొలువుదీరేలా సర్వాంగ సుందరంగా మండపాలను సిద్ధం చేశారు. పట్టణాల నుంచి పల్లెల వరకు.. చౌరస్తాల నుంచి గల్లీల వరకు తొమ్మిది రోజుల పాటు వినాయక సంబురాలతో భక్తులు తన్మయత్వం చెందనున్నారు. బుధవారం ప్రారంభమయ్యే వినాయక సందడికి పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ముందుకు రావడంతో అశావహుల సహకారంతో మరింత జోరుగా, ఉత్సాహంగా యువకులు వేడుకలు జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. నిర్వాహకులు ఉత్సవాల కోసం ఖరీదైన మండపాలు, భారీ విగ్రహాలను ప్రతిష్టించడానికి ఏర్పాట్లు పూర్తిచేశారు. విఘ్నాలు తొలగించే వాడిగా ఏ పని మొదలుపెట్టినా విఘ్నేశ్వరున్ని ధ్యానించడంతోనే మొదలయ్యే సంప్రదాయం భూలోకంలేనే కాదు.. దేవలోకంలోనూ ఉంది. వేదాలకు అది స్వరూపమైన ఓంకార రూపమే గణపతిగా భావిస్తారు. పంచభూతాలకు సంకేతంగా వినాయకుడు పూజలు అందుకుంటాడు. దక్షిణాయానంలో తొలి పండుగగా వినాయక చవితిని అన్ని కులాలు, ఉత్సవాలను జరుపుకుంటారు.
ఫ బొజ్జ గణపయ్య ఖర్చు రూ.10 కోట్లపైనే..
జిల్లా వ్యాప్తంగా లంబోధరుడికి స్వాగతం పలకడానికి, ఘనంగా ఉత్సవాలు నిర్వహించడానికి బొజ్జ గణపయ్య ఖర్చు భారీగానే ఉంది. జిల్లాలో దాదాపు ఐదు వేల భారీ విగ్రహాలను ప్రతిష్టించనున్నారు. ఇందుకోసం రూ.10 కోట్ల పైగానే నిర్వాహకులు ఖర్చు చేయనున్నారు. సిరిసిల్ల, వేములవాడల్లోనే 3 వేల విగ్రహాల వరకు ప్రతిష్టిస్తే, ప్రతి గ్రామంలో ఐదు నుంచి పది వరకు ప్రతిష్టిస్తారు. విగ్రహాల కోసం సంఘాలు రూ.45వేల నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. మండపాల కోసం అదనపు ఖర్చు కూడా ఉంటుంది. మహారాష్ట్ర, నాందేడ్‌తో పాటు హైదరాబాద్, ప్రాంతాల నుంచి విగ్రహాలను తీసుకవస్తున్నారు. మట్టి విగ్రహాలను కూడా ఏర్పాటుకు పూనుకున్నారు. ఈసారి 10 శాతం వరకు ధరలు కూడా పెరిగాయి. ఇళ్లలో పూజలు నిర్వహించుకోవడానికి చిన్న విగ్రహాల అమ్మకాలు కూడా మార్కెట్‌లో మొదలయ్యాయి. వివిధ ఆకృతుల్లో ఉండే చిన్న విగ్రహాలు రూ.300 నుంచి రూ.2 వేల వరకు ధర పలుకుతున్నాయి. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతో పాటు వివిధ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు మట్టి వినాయకులను పంపిణీ చేశారు.
ఉత్సవాలపై పోలీస్ నజర్
జిల్లాలో వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరిగే విధంగా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. డీజేలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. రాత్రి పది గంటల తరువాత సౌండ్ సిస్టమ్‌ను నిలిపివేసే విధంగా ఆదేశాలు ఇచ్చారు. మండపాల వివరాలను ఇప్పటికే సేకరించారు. వినాయక ఉత్సవాల ప్రారంభం నుంచి చివరివరకు ప్రత్యేక దృష్టిని పెడుతున్నారు. ఇప్పటికే నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించారు. పలు సూచనలు చేశారు. నిమజ్జనం రోజు కూడా క్రమపద్ధతిలో వెళ్లడానికి ముందుగానే సీరియల్ నంబర్లను కేటాయిస్తున్నారు. సంప్రాదాయ పద్ధతిలో ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవడానికి సూచనలు చేస్తున్నారు. గణేష్ మండపాలను ప్రజారవాణా, ఎమర్జెన్సీ వాహనాలకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలి. మండపాలు ఏర్పాటు చేసేవారు సంబంధిత శాఖల అనుమతి, విద్యుత్ శాఖ అనుమతి తీసుకోవాలని సూచించారు. మండపాల పూర్తి బాధ్యత నిర్వాహకులదేనని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మండపాల వద్ద 24 గంటలు వలంటీర్లు ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. డీజేలు కాకుండా చిన్న స్పీకర్‌లను పోలీసుల అనుమతితో ఏర్పాటు చేసుకోవాలి. మండపాల వద్ద ఏమైనా అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచనలు చేశారు.
ఫ పూజకు ఇలా సిద్ధం కావాలి..
- చవితి రోజు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పట్టు వస్త్రాలు, నూతన వస్త్రాలు ధరించాలి.
- గడపలకు పసుపు, కుంకుమలు, గుమ్మాలకు మంగళ తోరణాలు కట్టాలి.
- మట్టితో వినాయక విగ్రహాన్ని తయారుచేసుకొని పూజకు సిద్ధం చేసుకోవాలి.
- వినాయకుని పూజ కోసం 21పత్రులను సిద్ధం చేసుకోవాలి. వాటితో పాటు పసుపు, కుంకుమ, అగర్‌వత్తులు, హారతికర్పూరం, అక్షింతలు, దీపస్తంభాలు, కందులు, వత్తులు, నూనె లేక నెయ్యి, పంచామృతాలు, తమలపాకులు, వక్కలు, పూజ పుష్పాలు, పండ్లు, పత్రి, వ్రతం, యజ్ఞోపవితం, గంధం, పంచపాత్ర, ఉద్దరీన, పల్లెములు, హారతిపల్లెం, కొబ్బరికాయలు, జేగంట, పాలవెల్లి, గొడుగు, నైవేధ్యం సామగ్రి, పిండివంటలు సిద్ధం చేసుకోవాలి.
- ఇంటిలోనే ఈశన్య ప్రాంతంలో తూర్పు ముఖంగా శుభ్రం చేసి అలికి ముగ్గులు పెట్టాలి. వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఉపయోగించే పీఠాన్ని లేదా మండపాన్ని పసుపు, కుంకుమలతో అలంకరించాలి.
- మండపంలో అష్టదల పద్మముగ్గు వేయాలి. వెదురు కర్రలతో పాలవిల్లి తయారు చేసి, వెలగ, మారేడు, మొక్కజొన్న కంకులు, జామ పండ్లు, అరటిపండ్లు, మామిడి ఆకులు, పూలతో పాలవిల్లిని అలంకరించాలి.
- అష్టదల పద్మంలో బియ్యం పోసి వినాయకున్ని ప్రతిష్టించాలి. దీపాన్ని వెలిగించాలి. అక్షింతలు ఉంచి కలశ పూజ చేయాలి. పసుపుతో చేసిన గణపతిని తమలపాకుపై ఉంచి పూజ చేయాలి.
- లోహవిగ్రహాలు ఉన్నా మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకున్న సామగ్రితో పూజ నిర్వహించాలి.