Share News

గుబులు పుట్టిస్తున్న మబ్బులు

ABN , Publish Date - Oct 25 , 2025 | 01:02 AM

వరి, పత్తి పంట కోతకు, కాతకు వచ్చిన వేళలో మబ్బులు కమ్ముకోవడంతో రైతులు ఆందోళన చెందుతు న్నారు. రెండు రోజులుగా జిల్లాలో ఆకాశం మేఘావృ తమై అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తుండడంతో పంట చేతికి వస్తుందా, లేదా అని రైతులు దిగులు పడు తున్నారు.

గుబులు పుట్టిస్తున్న మబ్బులు

- ఆకాశం మేఘావృతం కావడంతో రైతుల ఆందోళన

- అక్కడక్కడ కురుస్తున్న చిరు జల్లులు

- కోతకు, కాతకు వచ్చిన వరి, పత్తి పంట

- తగ్గని తేమ శాతం, దక్కని మద్దతు ధరలు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

వరి, పత్తి పంట కోతకు, కాతకు వచ్చిన వేళలో మబ్బులు కమ్ముకోవడంతో రైతులు ఆందోళన చెందుతు న్నారు. రెండు రోజులుగా జిల్లాలో ఆకాశం మేఘావృ తమై అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తుండడంతో పంట చేతికి వస్తుందా, లేదా అని రైతులు దిగులు పడు తున్నారు. చిరుజల్లుల వల్ల పంటలో తేమ శాతం తగ్గక పోవడంతో మద్దతు ధరలు దక్కకుండా పోతున్నాయి. జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో 2,62,831 ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలను సాగు చేశారు. ఇందులో అత్యధికంగా వరి పంట 2,10,046 ఎకరాల్లో సాగు చేయగా, పత్తి పంట 49,783 ఎకరాల్లో వేశారు. మొక్కజొన్న 705 ఎకరాలు, 2,301 ఎకరాల్లో ఇతర పంటలను సాగు చేశారు.

ప్రారంభమైన కోతలు

జిల్లాలో పది రోజుల క్రితం నుంచే వరి కోతలు ఆరంభించారు. వ్యవసాయ బావుల కింద రోహిణి కార్తెలో వేసిన వరి పంట కోతకు వచ్చింది. కోతకు వచ్చిన వరి పంటను కోసి రైతులు ఆరబెట్టారు. అలాగే మొదటి దశ పత్తి పంట కూడా కాతకు వచ్చింది. రైతులు పత్తిని ఏరుతున్నారు. ఈ ఏడాది జిల్లాలో సాధారణ స్థాయిలోనే వర్షాలు కురిశాయి. ఇప్పటి వరకు 935.7 మిల్లీ మీటర్లకు గాను 900.7 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ముత్తారం మండలంలో సాధారణ స్థాయి కంటే ఎక్కువగా, రామగుండం మండలంలో సాధారణ స్థాయిలో కూడా వర్షాలు పడలేదు. మరో నాలుగు రోజుల వరకు రాష్ట్రంలో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరిస్తుండడంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. రెండు రోజుల నుంచి ఆకాశం మబ్బులు కమ్ముకుని ఉంటు న్నాయి. అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి. ఎప్పుడు భారీ వర్షాలు పడతాయోనని కలవర పడుతున్నారు.

పత్తి రైతుకు దక్కని మద్దతు ధర

పత్తి రైతులు కూలీలు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. కాతకు వచ్చిన పత్తిని వేగంగా తెంపకపోతే వర్షాలకు పత్తి తడిసి నల్ల బడే ప్రమాదం ఉంది. ఇప్పటికే పత్తిలో తేమ శాతం 8 కంటే ఎక్కువగానే ఉంటుండడంతో వ్యాపారులు మద్దతు ధరలు చెల్లించడం లేదు. పొడవు పింజ గల పత్తి క్వింటాలుకు రూ.8,110, మధ్య రకం పింజ గల పత్తికి 7,710 రూపాయల మద్దతు ధర చెల్లించాల్సి ఉంటుంది. కానీ తేమ శాతం అధికంగా ఉండడంతో రైతులకు మద్దతు ధర దక్కడం లేదు. శుక్రవారం పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు 986 బస్తాల్లో 1010.90 క్వింటాళ్ల పత్తిని 349 మంది రైతులు తీసుక వచ్చారు. గరిష్టంగా క్వింటాలుకు 7,011 రూపాయలు, కనిష్టంగా 5,210, మోడల్‌ ధర 6,750 రూపాయలు పెట్టారు. ఏ ఒక్క రైతుకు కూడా మద్దతు ధర దక్కక పోవడం గమనార్హం. ఏరిన పత్తిని నిల్వ చేసేందుకు సరిపడా స్థలాలు లేక రైతులు మద్దతు ధర దక్కకున్నా విక్రయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ నిల్వ చేస్తే తేమ ఎక్కువై పత్తి నల్లబడి పోయి అసలుకే మోసం వాటిల్లవచ్చనే భయంతో రైతులు మద్దతు ధరలు దక్కకున్నా కూడా పత్తిని విక్రయిస్తున్నారు. ధాన్యాన్ని కూడా రైతులు తేమ శాతం అధికంగా ఉండడంతో రైస్‌మిల్లర్లకు విక్రయిస్తున్నారు. పంట చేతికి వచ్చే వరకు వర్షాలు పడవద్దని రైతులు వరుణ దేవుడిని కోరుకుంటున్నారు.

Updated Date - Oct 25 , 2025 | 01:03 AM