Share News

వెట్టి చాకిరితో బాల్యం ఛిద్రం

ABN , Publish Date - Aug 01 , 2025 | 01:16 AM

భావిభారత పౌరులుగా ఎదగాల్సిన బాలలు బాల్యంలోనే కార్మికులుగా మగ్గిపోతున్నారు.

వెట్టి చాకిరితో బాల్యం ఛిద్రం

కరీంనగర్‌ క్రైం, జూలై 31 (ఆంధ్రజ్యోతి): భావిభారత పౌరులుగా ఎదగాల్సిన బాలలు బాల్యంలోనే కార్మికులుగా మగ్గిపోతున్నారు. కుటుంబ పోషణభారమై పిల్లలను చదివించే ఆర్థిక స్తోమతలేక పనిలోకి దించుతున్నారు. మరికొందరు బాలలు తల్లిదండ్రుల ఆదరణలేక, తల్లిదండ్రులు లేని అనాథలు దిక్కులేని పరిస్థితుల్లో బాలకార్మిక వ్యవస్థలోకి వెళుతున్నారు. ఇటువంటి బాలల జీవితాలను బాల్యంలోనే మగ్గిపోనీయకుండా వారిని చేరదీసి మంచి చదువును అందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వాలు బాలకార్మిక చట్టాలను తీసుకువచ్చింది. ఆ చట్టాల అమలు అంత పకడ్బందీగా సాగడంలేదనే విమర్శలున్నాయి. అనాఽథ బాలలు, బాల కార్మికులను గుర్తించి వారికి ఆశ్రయం కల్పించి చదువు, హాస్టల్‌ వసతి కల్పించినా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సాధ్యం కావడం లేదు. ప్రతి ఏడాది చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ, పోలీసులు, చైల్డ్‌ లైన్‌ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా ఇటుక బట్టీలు, హోటళ్లు, రెస్టారెంట్‌, ఇతర పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహించి కూలీలుగా పని చేస్తున్న బాలబాలికలను గుర్తించి వారి కుటుంబ సభ్యులు, బంధువులతో స్వస్థలాలకు పంపిస్తున్నారు.

ఏజెంట్ల ద్వారా.. ఇతర రాష్ట్రాల నుంచి..

ఒడిశా, బీహార్‌, రాజస్థాన్‌ తదితర 14 రాష్ట్రాలకు చెందిన బాలబాలికలు జిల్లాలోని చిన్న తరహా పరిశ్రమలు, హోటళ్లు, రెస్టారెంట్‌, ఇటుకబట్టీలు, గ్రానైట్‌ పరిశ్రమల్లో ఎక్కువగా పని చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాల నుంచి కొందరు ఏజెంట్లు ఈ బాలకార్మికులను ఉమ్మడి జిల్లాకు తరలిస్తున్నారు. పేదరికం, అమాయకత్వాన్ని ఆసరగా చేసుకుని తల్లిదండ్రులకు డబ్బు ఆశజూపి పిల్లలకు భోజనం పెట్ట్టి, చదువుచెప్పించి చిన్న చిన్న పనులు చేపిస్తామంటూ నమ్మబలికి తీసుకువస్తారు. ఇక్కడకు వచ్చిన తరువాత పరిశ్రమల్లో కార్మికులుగా వాడుకుంటున్నారు. బాలకార్మిక చట్టాన్ని కఠినంగా అమలు చేసినప్పుడే ఈ బాలకార్మిక వ్యవస్థ రూపుమాపుతుందని పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అంటున్నారు. బాలల స్వేచ్చను అడ్డుకుని, వారి భవిష్యత్‌ను నాశనం చేసే హక్కు కన్నతల్లిదండ్రులతోపాటు ఎవరికీ అధికారం లేదు.

‘ఆపరేషన్‌ ముస్కాన్‌’తో సత్ఫలితాలు

మహిళా, శిశు సంక్షేమ శాఖ, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ ఆధ్వర్యంలో కార్మికశాఖ, పోలీసు, చైల్‌ హెల్ప్‌లైన్‌ 1098, సమగ్ర బాలల పరిరక్షణ పథకం(ఐసీపీఎస్‌), స్వచ్ఛంద సంస్థల సహకారంతో జూలై 1 నుంచి 31 వరకు నిర్వహించిన ఆపరేషన్‌ ముస్కాన్‌-11 కార్యక్రమం సత్ఫలితాలను ఇచ్చింది. జిల్లా చైల్డ్‌వెల్ఫేర్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ధనలక్ష్మి, కమిటీ సభ్యులు రేండ్ల కళింగశేఖర్‌, విజయ్‌కుమార్‌, రాధా, అర్చనరెడ్డితోపాటు అన్ని శాఖల అధికారులు, పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి జిల్లాలోని 16 మండలాల్లో మూడు విభాగాలుగా, కరీంనగర్‌ రూరల్‌, కరీంనగర్‌ అర్బన్‌, హుజురాబాద్‌లో రెండు టీంలతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. 102 మంది బాల కార్మికులను గుర్తించి విముక్తి కల్పించారు. 102 మంది బాలలను (98 బాలురు, నలుగురు బాలికలు) చైల్డ్‌వెల్ఫేర్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) ముందు ప్రవేశపెట్టారు. చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ పిల్లలకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. పిల్లలను తల్లిదండ్రులు, బంధువులను రప్పించి వారి స్వస్థలాలకు పంపించారు. వీరిని పనిలో పెట్టుకున్న యజమానులపై పోలీసులు 15 కేసులు నమోదు చేశారు. కార్మికశాఖ అదికారులు 72 మంది పిల్లలకు వారి యజమానులచేత జరిమానా రూపంలో కనీస వేతనాలు ఇప్పించారు.

బాలలను పని పెట్టుకుంటే కఠిన చర్యలు

- బి సరస్వతి, జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి

బాలబాలికలను పనిలో పెట్టుకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాము. నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ బాలకార్మిక చట్టాలను ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకుంటాము జూలైలో నిర్వహించిన ఆపరేషన్‌ ముస్కాన్‌లో 102 మంది పిల్లలకు విముక్తి కలిగించాము.

బాల కార్మిక రహిత జిల్లాగా మారుస్తాం..

- ధనలక్ష్మి, జిల్లా చైల్డ్‌వెల్ఫేర్‌ కమిటీ చైర్‌పర్సన్‌

కార్మిక చట్టాలను అతిక్రమిస్తే కఠినంగా వ్యవహరిస్తాం. బాలకార్మిక రహిత జిల్లాగా చేసేందుకు ప్రజలు సహకరించాలి. ఇళ్లలో, దుకాణాల్లో, పరిశ్రమల్లో చిన్న పిల్లల చేత వెట్టిచాకిరి చేయించడాన్ని నేరంగా పరిగణించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.

Updated Date - Aug 01 , 2025 | 01:16 AM