బాల భరోసా సర్వే పకడ్బందీగా చేపట్టాలి
ABN , Publish Date - Aug 21 , 2025 | 11:46 PM
బాల భరోసా కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఐదు సంవత్సరాల్లోపు పిల్లల సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బాల భరోసా కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు.
కరీంనగర్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బాల భరోసా కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఐదు సంవత్సరాల్లోపు పిల్లల సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బాల భరోసా కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే నిర్వహించిన సర్వేను మరొకసారి సరి చూడాలన్నారు. సర్వే సరిగా చేయకపోతే ప్రత్యేక అవసరాలున్న పిల్లలను గుర్తించలేకపోతామని, తద్వారా వారికి ప్రభుత్వం అందించే వివిధ సేవలకు దూరమవుతారని అన్నారు. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వచ్చాక ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలను పక్కాగా అమలు చేయాలని తెలిపారు. భవిత కేంద్రాల్లోని ఐఆర్‌పీలు సైతం ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల వివరాలు సేకరించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాఖడే, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, డీఎంహెచ్‌వో వెంకటరమణ, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి సాజిద, పీవో సన, సీడీపీవోలు సబిత, శ్రీమతి, నర్సింగారాణి, సుగుణ పాల్గొన్నారు.