Share News

బోగస్‌ సంఘాలకు చెక్‌

ABN , Publish Date - Nov 20 , 2025 | 01:15 AM

క్రీడల పేరిట ఇష్టారాజ్యంగా పుట్టుకొస్తున్న సంఘాలకు చెక్‌ పెట్టే దిశగా స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ(శాట్‌) కసరత్తు మొదలుపెట్టింది.

బోగస్‌ సంఘాలకు చెక్‌

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

క్రీడల పేరిట ఇష్టారాజ్యంగా పుట్టుకొస్తున్న సంఘాలకు చెక్‌ పెట్టే దిశగా స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ(శాట్‌) కసరత్తు మొదలుపెట్టింది. గుర్తింపు క్రీడా సంఘాల వివరాలు సేకరించే దిశగా జిల్లా యువజన క్రీడా శాఖకు ఆదేశాలు ఇచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎలాంటి గుర్తింపు లేకుండా వెలుస్తున్న క్రీడా అసోసియేషన్లు క్రీడాకారుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. శాట్‌ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు క్రీడా సంఘాల లెక్కలు తీసే పనిలో నడుం బిగించారు. జిల్లాలో క్రీడలతో సంబంధం లేని కొందరు వ్యక్తులు తామే క్రీడలకు దిక్కన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరుకు తెరపడుతుందని భావిస్తున్నారు. అంతేకాకుండా ఒకే క్రీడాంశానికి సంబంధించి వేరువేరు సంఘాలు ఉన్నాయి. ముఖ్యంగా క్రికెట్‌, కరాటే వంటి క్రీడలకు సంబంధించి ఎలాంటి గుర్తింపు లేకుండానే తమకు తామే స్వతహాగా క్రీడా సంఘాలు ఏర్పాటు చేసుకున్నవారు ఉన్నారు.

జిల్లాలో 14 గుర్తింపు క్రీడా సంఘాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో అనేక క్రీడా సంఘాలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ, కేవలం 14 సంఘాలు మాత్రమే బైలా ప్రకారం నడుస్తూ గుర్తింపు పొందినవి ఉన్నాయి. క్రీడా సంఘాలకు స్టేట్‌ అసోసియేషన్‌, జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ గుర్తింపు ఉండాలి. జిల్లాలోని క్రీడా సంఘాలన్నీ తమ అసోసియేషన్‌ వివరాలు, క్రీడా సంఘం బైలా, స్టేట్‌ అసోసియేషన్‌ అఫిలియేషన్‌ పత్రంతో పాటు ఆయా సంఘాల సర్వసభ్య సమావేశాల వివరాలు స్పోర్స్ట్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ సూచించిన ఫార్మాట్‌ ప్రకారం జిల్లా యువజన క్రీడా శాఖకు అందించాల్సి ఉంది. గతంలో క్రీడా సంఘాల్లో ఉన్నవారు ఇతర జిల్లాల్లో స్థిరపడ్డవారు ఇంకా కొనసాగుతున్న తీరు ఉంది. అలాంటివారిని ప్రస్తుతం తొలగించే పరిస్థితి ఉండడంతో వివరాలు అందించడానికి మల్లగుల్లాలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రతి క్రీడా సంఘం నాలుగేళ్లకు ఒకసారి కొత్త కమిటీ ఎన్నుకోవడం, మూడు నెలలకు ఒకసారి జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో ఉన్న సంఘాలు జనరల్‌బాడీ సమావేశాలు నిర్వహించుకోవడం మొక్కుబడిగా మారిందనే విమర్శలున్నాయి. జిల్లాలోని సంఘాల వివరాలు సేకరించి గుర్తింపు లేని సంఘాలపై చర్యలు తీసుకోవడంతో పాటు నూతన క్రీడా పాలసీ రూపొందించడానికి శాట్‌ కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

క్రీడా సంఘాలు ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలి

- రాందాస్‌, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న గుర్తింపు క్రీడా సంఘాలు తమ సంఘానికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలను జిల్లా క్రీడా శాఖకు అందించాలి. క్రీడాకారులకు జవాబుదారీగా ఉండడానికి, క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఆయా సంఘాల వివరాలు సేకరణ ఉపయోగపడుతుంది. జిల్లాలోని క్రీడా సంఘాలు బైలా, గుర్తింపు పత్రాలు, జనరల్‌ బాడీ సమావేశాల వివరాలను అందించాలి.

జిల్లాలోని గుర్తింపు క్రీడా సంఘాలు

సంఘం పేరు అధ్యక్షుడు

అథ్లెటిక్‌ అసోసియేషన్‌ సీహెచ్‌ రామారావు

కబడ్డీ అసోసియేషన్‌ తోట రాంకుమార్‌

వాలీబాల్‌ అసోసియేషన్‌ సీహెచ్‌ శ్రీకుమార్‌

ఖో-ఖో అసోసియేషన్‌ బీ రవీందర్‌రావు

యోగా అసోసియేషన్‌ కే గోపాల్‌ రావు

కరాటే అసోసియేషన్‌ కొండ దేవయ్య

తైౖక్వాండో అసోసియేషన్‌ జే చక్రపాణి

సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ డీ అర్చన

జూడో అసోసియేషన్‌ కే తిరుపతిరెడ్డి

యోగాసన, స్పోర్స్ట్‌ అసోసియేషన్‌ యెలిగేటి కృష్ణ

అమెచ్యూర్‌ స్పోర్స్ట్‌ కరాటే డీవో అసోసియేషన్‌ ఎండీ హనీఫ్‌ఖాన్‌

ఉషు స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ఎండీ మునీర్‌

వెయిట్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ గోగికార్‌ శ్రీనివాస్‌

టేబుల్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ ఎండీ అజీముద్దీన్‌

Updated Date - Nov 20 , 2025 | 01:15 AM