పడిగాపులకు చెక్
ABN , Publish Date - Dec 26 , 2025 | 12:51 AM
యూరియా కోసం రైతుల పడిగాపులకు చెక్ పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
జగిత్యాల, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): యూరియా కోసం రైతుల పడిగాపులకు చెక్ పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. రైతులకు అవసరమయ్యే యూరియాను ముందుగా బుక్ చేసి తెచ్చుకునేలా వ్యవసాయ శాఖ కొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. వానాకాలంలో యూరియా కోసం రైతులు బారులు దీరి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లాలోని పలు మండలాల్లో అవసరం మేరకు యూరియా లభ్యం కాకపోవడంతో అన్నదాతలు ఆందోళనలు చేశారు. పలువురు డీలర్లు అధిక ధరలకు యూరియా విక్రయించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యాసంగి నుంచి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రైతులకు సరిపడా అందజేసేలా కొత్త బుకింగ్ విధానం అమల్లోకి తీసుకొచ్చింది. దీనిపై రాష్ట్ర స్థాయిలో శిక్షణ పూర్తి చేశారు. జిల్లాలో వ్యవసాయ అధికారులతో పాటు డీలర్లు, రైతులకు అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ కార్యాచరణ రూపొందించింది. జిల్లాలో ప్రస్తుత యాసంగి సీజన్‌లో సుమారు 3.50 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయన్న అంచనా ఉంది. ఇందుకు గాను సుమారు 45వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుంది.
ఫవిడతల వారీగా సరఫరా..
యూరియా పంపిణీ ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక మొబైల్ యాప్ విధానాన్ని అందుబాటులో తీసుకొచ్చింది. పంటలకు కావల్సిన యూరియా బస్తాలు తీసుకోవాలంటే తప్పనిసరిగా యాప్‌లో బుకింగ్ చేసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు యాప్‌ను ఈనెల 20వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా అమల్లోకి తీసుకవచ్చారు. రైతులు యూరియా కోసం పడిగాపులు పడకుండా ఉండేందుకు వ్యవసాయ అధికారులు చర్యలు చేపడుతున్నారు. యూరియా బుకింగ్ కోసం రైతులు తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారుల సేవలను కూడా వినియోగించుకోవచ్చు. యూరియా బుక్ చేసిన అనంతరం రైతులకు ఒక బుకింగ్ ఐడీ నంబర్ వస్తుంది. దీంతో రైతు తాను ఎంపిక చేసిన డీలర్ వద్ద యూరియా బస్తాలు కొనుగోలు చేయవచ్చు. బుకింగ్ సమయంలో రైతు కేవలం పంట పేరు, ఆ పంట సాగు విస్తీర్ణం నమోదు చేస్తే సరిపోతుంది. నమోదు చేసిన వివరాల ఆధారంగా రైతు అర్హతను బట్టి మొత్తం యూరియా పరిమాణం ఏయే వ్యవధుల్లో బుక్ చేసుకోవచ్చునో లెక్కిస్తుంది. ఏమైనా సమస్యలు ఎదురైతే రైతుల సౌకర్యార్థం హెల్ప్‌లైన్ నంబర్లతో కూడిన ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ కూడా అందుబాటులో ఉంచారు. రైతులు యాప్‌ను మొబైల్ ఫోన్‌లోని ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని ఒకేసారి కాకుండా విడతల వారీగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐదు ఎకరాల్లోపు ఉన్న రైతులు రెండు విడతల్లో 5 నుంచి 20 ఎకరాల్లోపు రైతులు మూడు, అంతకంటే ఎక్కువ ఉన్న రైతులు నాలుగు విడతల్లో యూరియాను బుక్ చేసుకోవచ్చు.
ఫయాప్ ప్రత్యేకతలు..
రైతులు/సిటిజన్ శాఖ, డీలర్ల కోసం వేర్వేరు లాగిన్లు ఉంటాయి. మొబైల్ నంబర్, ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది. రైతులు పంట నమోదు (క్రాప్ బుకింగ్) లో ఎంటర్ చేసిన మొబైల్ నంబర్‌తో ఓటీపీ ద్వారా యాప్‌లో లాగిన్ కావాలి. లాగిన్ అయిన రైతులు తమ జిల్లాను ఎంపిక చేయగానే ఆ జిల్లాలో అందుబాటులో ఉన్న యూరియా బ్యాగుల సంఖ్య కనిపిస్తుంది. తర్వాత ఏ సీజన్, రైతు పట్టాదారు పాసుపుస్తకం నంబర్, ఎన్ని ఎకరాల్లో పంట వేస్తున్నారో, ఏయే పంటలు వేస్తున్నారనే సమాచారాన్ని నమోదు చేయాలి. రైతు సాగు చేసే ఎకరాలను బట్టి వారికి అవసరమయ్యే యూరియా బ్యాగులు యాప్‌లో కనిపిస్తాయి. అయితే వారు సాగు చేసే విస్తీర్ణాన్ని బట్టి వారికి అవసరమయ్యే యూరియా బస్తాలను 15 రోజుల వ్యవధితో 1 నుంచి 4 వ దశల్లో అందజేసేలా వివరాలు కనిపిస్తాయి. పాసు పుస్తకాలు లేని రైతులు వారి పట్టాదారు పాసు పుస్తకం దగ్గర ఆధార్ ఎంపిక చేసుకుని, ఆధార్ నంబర్ అందులో నమోదు చేసి, ఓటీపీ (కన్ఫర్మేషన్ చేసిన) సరిచూసుకొని తర్వాత పై వివరాలు నింపాలి. కౌలు రైతులు కూడా వారి పేరు, తండ్రి పేరు, ఆధార్ నంబర్ నమోదు చేసి, ఓటీపీ కన్ఫర్మేషన్ తర్వాత భూ యజమాని పట్టాదారు పాసు పుస్తకం నంబర్ నమోదు చేస్తే యజమాని మొబైల్ నంబర్‌తో ఓటీపీ వ్యాలిడేషన్ తర్వాత కౌలు రైతులు కూడా తమ వివరాలు నమోదు చేసేలా ఈ యాప్‌లో అవకాశం కల్పించారు.
ఫనిర్ణీత సమయంలోగా మాత్రమే..
యాప్‌లో యూరియా బుక్ చేసుకున్న రైతులు 24 గంటల్లో యూరియా బస్తాలు తీసుకోవాలి. లేని పక్షంలో మళ్లీ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్‌లో బుక్ చేసుకున్న రైతులు మాత్రమే డీలర్లు లేదా సొసైటీల వద్ద యూరియా బస్తాలు తీసుకునే వీలు ఉంటుంది. పంటల రకం సాగు విస్తీర్ణం ఆధారంగా యూరియా పరిమాణం లెక్కిస్తారు. రైతులు తాము సాగు చేసే పంటల వివరాలు పక్కాగా నమోదు చేయాల్సి ఉంటుంది.
ఫబహుళ ప్రయోజనాలు..
ప్రత్యేక మొబైల్ యాప్ డేటా ఆధారంగా బహుళ ప్రయోజనాలు అందనున్నాయి. పంటల కొనుగోళ్లు, పంటల నష్టం భవిష్యత్‌లో అంచనా వేసేందుకు వీలుంటుంది. డీలర్లు వారి మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయి రోజువారీగా వారికి వచ్చిన స్టాక్, అమ్మకం వివరాలను నింపాలి. యాప్ వినియోగంలో లేదా బస్తాల బుకింగ్‌లో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే రైతులు సంబంధిత వ్యవసాయ అధికారులు లేదా విస్తరణ అధికారుల (ఏఈవో)ను సంప్రదించవచ్చని సూచించారు.
అర్హులందరికీ యూరియా సరఫరా
-భాస్కర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
నిజమైన సాగుదారులకు యూరియా సరఫరా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక మొబైల్ యాప్‌ను తీసుకువచ్చింది. ఈ విధానంలో రైతుల అవసరాల మేరకు పారదర్శకంగా యూరియా పంపిణీ జరుగుతుంది. యూరియా కోసం సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం లేకుండా రైతులకు అవసరమైన కోటాను ఇంటి వద్ద నుంచే ముందస్తుగా బుక్ చేసుకునే అవకాశం ఉంది.