కాపీయింగ్‌కు చెక్
ABN , Publish Date - Nov 23 , 2025 | 12:39 AM
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షలపై ఇంటర్ బోర్డు ప్రత్యేక దృష్టి సారించింది.
జగిత్యాల, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షలపై ఇంటర్ బోర్డు ప్రత్యేక దృష్టి సారించింది. నిఘా నీడలో ప్రాక్టికల్స్ పరీక్షలు జరగాలని బోర్డు కార్యదర్శి ఇటీవల అన్ని జిల్లాల ఇంటర్మీడియట్ అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ప్రతీ పరీక్ష కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. వాటిని ఇంటర్ బోర్డు ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేయాలని నిర్ణయించారు. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇదివరకు కొన్ని ప్రయివేటు కళాశాలల్లో నామమాత్రంగా ప్రాక్టికల్స్ చేసినా మార్కులు అధికంగా వేసేవారన్న ఆరోపణలు న్నాయి. అలాంటి వాటికి ఇక చెక్ పడనున్నట్లు తెలుస్తోంది.
ప్రైవేటు కేంద్రాలపై ఆరోపణలు..
ప్రతీ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలపై పలు ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రైవేటు కళాశాలల్లో తూతూ మంత్రంగా ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారని, విద్యార్థులు ప్రాక్టికల్స్ చేయకపోయినా మార్కులు వేస్తున్నారనే ఆరోపణలున్నాయి. పర్యవేక్షణకు ఇన్విజిలేటర్లుగా వెళ్లే ప్రభుత్వ లెక్చరర్లను కళాశాలలు ముందే ఆకట్టుకుంటున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ కారణంగా ప్రభుత్వ కళాశాలలకన్నా ప్రైవేటు కళాశాల విద్యార్థులకు ఎక్కువ మార్కులు వస్తున్నాయని విమర్శలు చోటుచేసుకుంటున్నాయి. దీనిని అదిగమించేందుకు ఇంటర్ బోర్డు ప్రత్యేక చర్యలు చేపట్టింది. అటు సీసీ కెమెరాలు.. ఇటు ఫ్లయింగ్ స్క్వాడ్ నిఘాలో కమాండ్ కంట్రోల్ పరిధిలోని కళాశాలల్లోనే ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షా కేంద్రాల్లో జరగనున్నాయి.
ఫిబ్రవరి 2వ తేదీ నుంచి పరీక్షలు..
వచ్చే యేడాది ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో ఈసారి ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో మాత్రమే ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆశాఖ అధికారులు చెబుతున్నారు. రెసిడెన్షియల్, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో పాఠశాలలు కొనసాగుతుండడంతో ఆ విద్యార్థులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో అక్కడ ప్రాక్టికల్ నిర్వహించడం లేదని పేర్కొంటున్నారు.
ఆ స్కూళ్లలో ప్రాక్టికల్స్‌కు నో చాన్స....
కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు పాఠశాల విద్యాశాఖ పరిధిలో, గురుకులాలు ఆయా శాఖలో పరిధిలో పనిచేస్తున్నాయి. దీంతో వాటిల్లో సీసీ కెమెరాలున్నప్పటికీ.. అవి ఇంటర్ బోర్డు కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేయలేదు. ఈ స్కూళ్ల పరిధిలో ఏదైనా అక్రమం జరిగినా చర్య తీసుకునే అధికారం బోర్డుకు లేదు. అందుకు ఈసారి వాటిల్లో ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షా కేంద్రాలను ఇంటర్ బోర్డు తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో అక్కడి విద్యార్థులంతా ప్రాక్టికల్స్ పరీక్షలకు ప్రభుత్వ కళాశాలకు రావాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు మాత్రం కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానమై ఉన్నందున వాటిల్లోనే ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించడానికి అధికారులు కసరత్తులు చేస్తున్నారు. కాగా 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు కూడా ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది.
నిఘా ఇలా...
ఆయా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇప్పటికే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇవి ఇంటర్మీడియట్ బోర్డు కంట్రోల్ కమాండ్‌కు అనుసంధానమై ఉన్నాయి. ఇక్కడి ప్రతీ దృశ్యాన్ని వారు వీక్షించి పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా ఒక్కో ప్రైవేటు కళాశాలల్లో ఐదేసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో నాలుగు ల్యాబ్‌లకు ఒక్కోటి చొప్పున, కారిడార్‌లో మరొకటి ఏర్పాటు చేయాలని ఆదేశాలున్నాయి. ప్రథమ సంవత్సరం ఇంగ్లీష్‌కు సంబంధించిన ప్రాక్టికల్ పరీక్ష ఉంటుంది. దీనిని జనవరి 21వ తేదీన నిర్వహించనున్నారు. అలాగే ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయి. ద్వితీయ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ విద్యార్థులతో పాటు ఎంపీహెచడబ్ల్యూ, ఎంఎల్‌టీ, కంప్యూటర్ సైన్స విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈసారి మాస్ కాపియింగ్‌కు అవకాశం లేకుండా పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా పర్యవేక్షణ కోసం డిపార్ట్‌మెంట్ అధికారులను నియమించనున్నారు.
పకడ్బందీగా నిర్వహిస్తాం..
- బొప్పరాతి నారాయణ, జిల్లా ఇంటర్ విద్యాధికారి
ఇంటటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరుగుతాయి. ఈసారి సీసీ కెమెరాల నిఘాలో నిర్వహించాలని బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాము. ప్రభుత్వ సెక్టార్ కళాశాలల్లో ప్రాక్టికల్స్ సెంటర్లు ఉండవు. ఈ విద్యార్థులు సంబంధిత ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ప్రాక్టికల్స్ సంబంధించిన మెటీరియల్‌ను ప్రభుత్వం పంపిణీ చేసింది. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపడుతాము.