Share News

అజ్ఞాతం వీడిన చంద్రన్న

ABN , Publish Date - Oct 29 , 2025 | 12:12 AM

ఆపరేషన్‌ కగార్‌తో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఒక్కొక్కరుగా లొంగుబాట పడుతున్నారు. ఇటీవల జిల్లాకు చెందిన పార్టీ కీలక నేత పొలిట్‌ బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌ రావు అలియాస్‌ సోనూ, అభయ్‌ 62 మంది మావోయిస్టులతో కలిసి ఆయుధాలతో లొంగిపోయారు.

 అజ్ఞాతం వీడిన చంద్రన్న

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి/జూలపల్లి)

ఆపరేషన్‌ కగార్‌తో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఒక్కొక్కరుగా లొంగుబాట పడుతున్నారు. ఇటీవల జిల్లాకు చెందిన పార్టీ కీలక నేత పొలిట్‌ బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌ రావు అలియాస్‌ సోనూ, అభయ్‌ 62 మంది మావోయిస్టులతో కలిసి ఆయుధాలతో లొంగిపోయారు. మంగళవారం తెలంగాణ డీజీపీ శివధర్‌ రెడ్డి ఎదుట జిల్లాకు చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాద రావు (65) అలియాస్‌ చంద్రన్న అలియాస్‌ శంకరన్న 45 ఏళ్ల అజ్ఞాతం వీడి ఆయుధాలు పార్టీకి అప్పగించి లొంగిపోయారు. ఇది మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బేనని చెప్పవచ్చు. ప్రసాదరావుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 25 లక్షల రూపాయల రివార్డును అందజేశారు.

ఫ ఆర్‌ఎస్‌యూ నుంచి అజ్ఞాతంలోకి..

జూలపల్లి మండలం వడుకాపూర్‌ చెందిన పుల్లూరి ప్రసాద్‌ రావు అలియాస్‌ చంద్రన్న 45 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్నారు. 1961లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు పుల్లూరి శ్రీనివాసరావు, వరలక్ష్మి దంపతులకు రెండో సంతానంగా ప్రసాదరావు జన్మించారు. ఆయనకు ఇద్దరు సోదరులు అశోక్‌ రావు, తిరుపతి రావు, ఒక సోదరి ఉన్నారు. ఒకరు హైదరాబాద్‌లో, మరొకరు రామగుండంలో నివాసం ఉంటున్నారు. తల్లిదండ్రులు మరణించగా గ్రామంలో సొంత ఇల్లు శిథిలావస్థకు చేరి నేలమట్టమైంది. ప్రసాద రావు వడుకాపూర్‌లోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 1978లో పదో తరగతి చదివారు. 1979లో పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ బైపీసీ చదువుతుండగా రాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌ ఆర్గనైజర్‌గా వ్యవహరించిన దగ్గు రాజలింగుతో చంద్రన్నకు పరిచయం ఏర్పడింది. రాజలింగు విప్లవ బోధనలతో ప్రభావితుడైన చంద్రన్న ఆర్‌ఎస్‌యూలో చేరి విప్లవ పంథా వైపు అడుగులు వేశారు.

ఫ కిషన్‌జీకి కొరియర్‌గా పని చేస్తూ..

1980లో ఇంటర్‌ పూర్తి చేసిన చంద్రన్న మల్లోజుల కోటేశ్వర్‌ రావు అలియాస్‌ కిషన్‌జీకి కొరియర్‌గా పని చేస్తూ హైదరాబాద్‌, కరీంనగర్‌ ప్రాంతాల్లో పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్న కేఎస్‌ గ్రూపు నాయకుల మధ్య సమాచారాన్ని చేరవేసే వారు. సీపీఐ పీపుల్స్‌వార్‌ గ్రూప్‌ మరో నేత మల్లా రాజిరెడ్డి అలియాస్‌ సంగ్రామ్‌ ఆలియాస్‌ మీసాల రాజిరెడ్డి దండకారణ్యంలో పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తుండగా, ఆయన నేతృత్వంలోని సాయధ దళంలో చేరారు. చంద్రన్నతో పాటు మరో ఇద్దరిని 1980 జూలైలో ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా భూపాలపట్నం పోలీసులు అరెస్టు చేశారు. జగ్దల్‌పూర్‌ జైలులో ఉన్న చంద్రన్న అదే సంవత్సరం డిసెంబరులో బయటకు వచ్చి ఇంటికి చేరారు. తర్వాత కొద్ది రోజులకే అజ్ఞాతంలోకి వెళ్లి ఆసిఫాబాద్‌ దళంలో సభ్యుడిగా పని చేశారు. 1981లో పీపుల్స్‌వార్‌ ఆవిర్భావం తరువాత సిర్పూర్‌ దళ కమాండర్‌గా 1983లో బాధ్యతలు చేపట్టారు. 1987 వరకు దళ కమాండర్‌గా పని చేసిన ఆయన డివిజనల్‌ కమిటీ సభ్యుడిగా బాధ్యతల్లో సిర్పూర్‌, చెన్నూరు ప్రాంత దళాల ఇన్‌చార్జిగా వ్యవహరించారు. 1992లో ఆదిలాబాద్‌ జిల్లా కమిటీ కార్యదర్శిగా వ్యవహరించిన చంద్రన్న 1995లో నార్త్‌ తెలంగాణ స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యుడిగా పని చేశారు. కటకం సుదర్శన్‌ అలియాస్‌ ఆనంద్‌ కార్యదర్శిగా వ్యవహరించిన ఈ కమిటీలో చంద్రన్నతోపాటు జినుగు నర్సింహరెడ్డి అలియాస్‌ జంపన్న, సందె రాజమౌళి అలియాస్‌ ప్రసాద్‌లు సభ్యులుగా పని చేశారు. 2006 వరకు కమిటీలో చంద్రన్నతోపాటు ఆదిలాబాద్‌ జిల్లా కమిటీ ఇన్‌చార్జిగా వ్యవహరించిన చంద్రన్న 2007లో నార్త్‌ తెలంగాణ స్పెషల్‌ జోనల్‌ కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.

ఫ 2008 నుంచి కేంద్ర కమిటీ సభ్యుడిగా..

కేంద్ర కమిటీ ప్రత్యామ్నాయ సభ్యుడిగా వ్యవహరించిన చంద్రన్న 2008లో పూర్తి స్థాయిలో సీసీ కమిటీ సభ్యుడిగా చేరారు. 2021 జూన్‌లో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పని చేసిన యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌ మరణించడ ంతో ఆ బాధ్యతలను చంద్రన్న చేపట్టారు. 2024 డిసెంబర్‌లో తెలంగాణ రాష్ట్ర కమిటీ బాధ్యతలు బడే దామోదర్‌ అలియాస్‌ చొక్కారావుకు అప్పగించిన తరువాత సీసీ మెంబర్‌గా చంద్రన్న తెలంగాణ కమిటీకి మార్గదర్శిగా వ్యవహరించారు. చంద్రన్న 1989లో సిర్పూర్‌, చెన్నూర్‌ డివిజనల్‌ కమిటీ సభ్యురాలు కుర్చంగి మోతిబాయి అలియాస్‌ రాధక్కను వివాహం చేసుకున్నారు. 2013 జూన్‌లో రాధక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అరెస్టు కాగా 2015లో బెయిల్‌పై వచ్చిన తరువాత నిర్మల్‌ ప్రాంతంలోని వారి స్వగ్రామంలో నివాసం ఉంటున్నారు. అజ్ఞాతంలోకి వెళ్లిన నాటి నుంచి ప్రసాదరావు ఇంటి ముఖం చూడలేదు. 17 ఏళ్లకు పైగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా పని చేసిన చంద్రన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పిలుపు మేరకు బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. అనారోగ్య సమస్యలు కూడా వెంటాడుతుండడంతో ఆయన జనజీవన స్రవంతిలో కలిశారు.

పార్టీలో కొనసాగుతున్నది వీరే...

మంథని మండలం శాస్త్రులపల్లికి చెందిన మరో కేంద్ర కమిటీ సభ్యుడు మల్ల రాజిరెడ్డి అలియాస్‌ సంగ్రామ్‌, రామగుండం ప్రాంతానికి చెందిన డీసీఎం అప్పాసి నారాయణ అలియాస్‌ రమేష్‌, కాల్వశ్రీరాంపూర్‌ మండలం కిష్టంపేటకు చెందిన రాష్ట్ర కమిటీ మెంబర్‌ కంకణాల రాజిరెడ్డి అలియాస్‌ వెంకటేశ్‌, పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామానికి చెందిన స్పెషల్‌ జోనల్‌ కమిటీ మెంబర్‌ గంగిడి సత్యనారాయణ రెడ్డి అలియాస్‌ విజయ్‌, పాలితం గ్రామానికి చెందిన డివిజన్‌ కమిటీ మెంబర్‌ ఆలేటి రామలచ్చులు అలియాస్‌ రాయలచ్చులు, ఏరియా కమిటీ మెంబర్లు దాతు ఐలయ్య, వడ్కాపూర్‌ చెందిన ధీకొండ శంకరయ్య అలియాస్‌ శేషన్న, సుల్తానాబాద్‌ మండలం కొదురుపాకకు చెందిన జువ్వాడి వెంకటేశ్వర్‌ రావు అలియాస్‌ ధర్మన్నలు పార్టీలో కొనసాగుతున్నారు.

ఫ మాది లొంగుబాటు కాదు..

- పుల్లూరి ప్రసాద రావు అలియాస్‌ చంద్రన్న

‘మాది లొంగుబాటు కాదు అభివృద్ధిలో కలిసి పనిచేయడానికి వచ్చాం. ఇప్పటివరకు ఉద్యమంలో పీడిత ప్రజల కోసమే పని చేశాను, భవిష్యత్తులో కూడా ప్రజల కోసమే పని చేస్తాను. మా సిద్ధాంతం ఓడిపోలేదు, ఓడించడం ఎవరి తరం కాదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘మా భావాజాలంతో భవిష్యత్తులో మరింత మంది ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రజల మధ్య ఉండి సేవ చేయాలనుకున్నాను. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీని ఎన్నుకున్నారు. దేవ్‌జీని సపోర్ట్‌ చేస్తున్నాను. ఆయుధాలను పార్టీకి ఇచ్చి వచ్చాను.’ అని ఆయన వెల్లడించారు. మావోయిస్టులు మా అన్నదమ్ములని సీఎం రేవంత్‌ పిలుపునివ్వడంతో ముందుకు వచ్చామని, జనంలో ఉంటూ జనం కోసం పని చేస్తామన్నారు.

Updated Date - Oct 29 , 2025 | 12:12 AM