చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగించాలి
ABN , Publish Date - Nov 23 , 2025 | 12:26 AM
వీరనారి చాకలి ఐలమ్మ ఆశయాలను ప్రతీ ఒక్కరూ కొనసాగించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.
- ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
కథలాపూర్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): వీరనారి చాకలి ఐలమ్మ ఆశయాలను ప్రతీ ఒక్కరూ కొనసాగించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని గంభీర్‌పూర్‌లో శనివారం చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజాం ప్రభువులను ఎదిరించి రైతాంగ పోరాటాలు చేసి చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు. పేదల పక్షాన నిలబడి భూస్వాములను ఎదిరించిన ఘనత చాకలి ఐలమ్మకే దక్కిందని అన్నారు. ఐలమ్మను ఆదర్శంగా తీసుకుని బడుగు, బలహీన వర్గాలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో కుల గణన నిర్వహిస్తామని ఇచ్చిన హామీ మేరకు రిజర్వేషన్లను పెంచుతూ నిర్ణయం తీసున్నామన్నారు. జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వారికి రావాలనే సంకల్పంతో రిజర్వేషన్లన పెంచామని పేర్కొన్నారు. అభివృద్ధి కోసం తాను నిరంతరం ప్రజల్లో ఉంటూ నిధులు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. గంభీర్‌పూర్ అభివృద్ధి పనుల కోసం ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. తాండ్ర్యాల నుంచి గోవిందారం మీదుగా సూరంపేట వరకు రోడ్డు కోసం నిధులు కేటాయించడానికి కృషి చేస్తానని చెప్పారు. సూరమ్మ చెరువుకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోక పోవడంతో నిరసనలు తెలిపామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ముందుగా సూరమ్మ చెరువుకు నిధులు కేటాయించి పనులు పూర్తి చేస్తున్నట్టు తెలిపారు. రైతులకు నష్టపరిహారం కోసం 44.50 లక్షల రూపాయలు మంజూరు చేయించినాని అన్నారు. 1.5 కోట్ల రూపాయలతో వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి కంకణం కట్టుకున్నామన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పూండ్ర నారాయణరెడ్డి, పీసీసీ కార్యవర్గ సభ్యుడు తొట్ల అంజయ్య, మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజీం, జిల్లా కార్యదర్శి గోపిడి ధనుంజయ్‌రెడ్డి, పులి హరిప్రసాద్, అంబటి రాధాకృష్ణ, జవ్వాజి రవి, గడ్డం చిన్నారెడ్డి, తిరుపతిరెడ్డి, ఎగ్యారపు శ్రీహరి, గంగాధర్, కారపు గంగాధర్, పోతు శేఖర్, లింగారావు, చాకలి సంఘ సభ్యులు పాల్గొన్నారు.
- కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ
మండలంలోని తాండ్ర్యాలలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 40 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.