Share News

సీబీఐ విచారణ షురూ

ABN , Publish Date - Sep 19 , 2025 | 12:35 AM

రాష్ట్ర వ్యాప్తంగా సంచనం రేపిన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణి దంపతుల హత్య కేసులో సీబీఐ విచారణ మొదలయ్యింది.

సీబీఐ విచారణ షురూ

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)/మంథని/మంథనిరూరల్‌: రాష్ట్ర వ్యాప్తంగా సంచనం రేపిన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణి దంపతుల హత్య కేసులో సీబీఐ విచారణ మొదలయ్యింది. ఈ కేసులో తమకు న్యాయం జరగలేదని, మరికొందరి ప్రమేయం ఉందని నాలుగేళ్ల క్రితం వామన్‌రావు తండ్రి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా, విచారించిన కోర్టు సీబీఐ దర్యాప్తుకు గతనెలలో ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ఆ మేరకు గురువారం విపిన్‌ గహలోత్‌ ఆధ్వర్యంలో ముగ్గురు అధికారులు గల సీబీఐ బృందం జిల్లాకు చేరుకుంది. మొదట రామగుండం కమిషనరేట్‌ను సందర్శించి అక్కడ కేసు పూర్వపరాలను ప్రాథమికంగా తెలుసుకోవ డంతో పాటు కేసు రికార్డులను పరిశీలించారని సమాచారం.. అక్కడి నుంచి గోదావరిఖని ఏసీపీ మడత రమేష్‌తోకలిసి వామన్‌రావు స్వగ్రామమైన మంథని మండలం గుంజపడుగు గ్రామాన్ని సందర్శించి వారి నివాసానికి వెళ్లారు. ఇంట్లో ఉన్న వామన్‌రావు తల్లిదండ్రులు గట్టు కిషన్‌రావు, ఇంద్రసేన, సోదరుడు ఇంద్రశేఖర్‌ రావును పదినిమిషాల పాటు విచారించారు. వారిని వెంట తీసుకుని మంథని కోర్టును సందర్శించి హత్యకు ముందు వామన్‌రావు దంపతులు కోర్టు వద్ద ఏం చేశారు, ఎక్కడ నిలబడ్డారు, ఎవరితో మాట్లాడారు, కారు ఎంత దూరంలో ఉంది, రెక్కీ ఎలా నిర్వహించారు, అక్కడినుంచి న్యాయవాదులు ఎప్పుడు బయలుదేరారు వంటి అంశాల గురించి ఆరా తీశారు. ఆ తర్వాత హత్య జరిగిన రామగిరి మండలం కల్వచర్ల పంచాయతీ పరిధిలోని మారుతి నగర్‌ వద్ద హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అక్కడ కిషన్‌ రావు ద్వారా మరిన్ని విషయాలను సేకరించారు. అక్కడినుంచి రామగుండం తిరిగి వెళ్లారు. సదరు అధికారులు జిల్లాలో నాలుగైదు రోజులు ఇక్కడే ఉండి విచారణ జరపనున్నారని సమాచారం. కమిషనరేట్‌ కార్యాలయంలో ఒక గదిని కేటాయించాలని సీబీఐ అధికారులు సీపీని కోరినట్లు సమాచారం. ఆమేరకు ఒకగదిని కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. సీబీఐ అధికారులు గట్టు వామన్‌రావు దంపతుల హత్య కేసుపై విచారణ మొదలు పెట్టడం ఈ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.

ఫ నాలుగేళ్ల క్రితం నడి రోడ్డు పైనే హత్య..

హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌ రావు- వెంకట నాగమణి దంపతులను నాలుగేళ్ల క్రితం పట్టపగలు నడి రోడ్డుపై అతి కిరాతంగా హత్యచేసిన ఘటనపై సీబీఐ విచారణ చేపట్టడం ఏం జరుగుతుందోననే చర్చ జరుగుతున్నది. మంథని మండలం గుంజపడుగుకు చెందిన హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు, వెంకట నాగమణి దంపతులు 2021ఫిబ్రవరి 17వ తేదీన మంథని కోర్టులో ఒక కేసు విచారణకు హాజరై తిరిగి హైదరాబాద్‌కు కారులో వెళుతుండగా రామగిరి మండలం కల్వచర్ల సమీపంలో కొందరు కారును అటకాయించి నడిరోడ్డుపైనే పట్ట పగలు నరికి చంపిన ఉదంతం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో కుంట శ్రీనివాస్‌, సేవంతుల చిరంజీవి, అక్కపాక కుమార్‌, బిట్టు శ్రీను, ఊదరి లచ్చయ్య, వెల్ది వసంతరావు, తదితరులను పోలీసులు అరెస్టుచేసి రిమాండ్‌ చేశారు. ఆ తదనంతరం వాళ్లు బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసులో అసలు నిందితులు బయటకు రావాల్సి ఉందని, తమకు న్యాయం చేయాలంటూ ఈ కేసును సీబీఐకి అప్పగించాలని గట్టు వామన్‌రావు తండ్రి గట్టు కిషన్‌రావు 2021 నవంబర్‌ 26వ తేదీన సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు నాలుగేళ్లుగా ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వామన్‌ రావు దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించడానికి తమకు అభ్యంతరం లేదని ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసింది. దీంతో హత్య కేసులో నిజనిర్ధారణకు ఒరిజినల్‌ వీడియోలు, ఫోరెన్సిక్‌ రిపోర్టు, మరణ వాంగ్మూలంతో పాటు అదనపు డాక్యుమెంట్ల దాఖలుకు గడువు విధించింది. దీనిపై వాదోపవాదాలు విన్న ధర్మాసనం కేసును సుప్రీంకోర్టుకు అప్పగిస్తూ గతనెల 12వ తేదీన ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ఆ మేరకు సీబీఐ అధికారులు గురువారం రంగప్రవేశం చేసి విచారణ మొదలుపెట్టారు. ఈ సందర్భంగా వామన్‌రావు విలేకరులతో మాట్లాడుతూ తమ కుమారుడు, కోడలు హత్యకు ప్రధాన కారణం మాజీ జడ్పీచైర్మన్‌ పుట్ట మధు, అతడి భార్య, పూదరి సత్యనారాయణ, పెద్దపెద్ద తలకాయలు కలిసి కిరాయి గూండాలతో హత్య చేయించారని ఆరోపిం చారు. వామన్‌రావు దంపతుల ఆత్మ శాంతించాలంటే అసలైన దోషులను పట్టుకోవాలన్నారు. సీబీఐపై తమకు నమ్మకం ఉందని, తప్పకుండా తమకు న్యాయం జరుగుతుందని భావిస్తు న్నామన్నారు.

Updated Date - Sep 19 , 2025 | 12:35 AM