ప్రచారం షురూ
ABN , Publish Date - Dec 05 , 2025 | 12:58 AM
పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారం మొదలైంది.
జగిత్యాల, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారం మొదలైంది. తొలి విడత ఎన్నికలు జరిగే మెట్‌పల్లి, కోరుట్ల, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కథలాపూర్, మేడిపల్లి, భీమారం మండలాల్లో అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ, బరిలో నిలిచిన అభ్యర్థుల ప్రకటన, గుర్తుల కేటాయింపులు పూర్తి కావడంతో అభ్యర్థులు ప్రచారంపై దృష్టి సారించారు. పలువురు అభ్యర్థులు ముఖాముఖిగా తలపడుతున్నారు. కరపత్రాలు, వాల్ పోస్టర్లతో పనులు ప్రారంభించారు. కొందరు తమకు కేటాయించిన గుర్తులతో పాటు తమ ఫొటోలు ఉండే విధంగా భారీ బ్యానర్లు సైతం రెడీ చేసి గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో, కాలనీల వద్ద ఏర్పాటు చేస్తున్నారు.
ఫసోషల్ మీడియాలో విస్తృత ప్రచారం...
పంచాయతీ అభ్యర్థులు సోషల్ మీడియాల్లో తమకు కేటాయించిన గుర్తులతో పాటు ఎన్నికల్లో తమను గెలిపిస్తే చేసే పనుల చిట్టాను చక్కర్లు కొట్టిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఇప్పటికే ఆయా గ్రామాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసుకుంటున్న వాట్సాప్ గ్రూప్‌లను ఇందుకు వేదికగా మలచుకొని ఆన్‌లైన్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కొందరు రీల్స్ సైతం చేస్తూ పంచాయతీల్లో గెలుపు కోసం విభిన్న పంథా అనుసరిస్తుండడంతో పంచాయతీ పోరు రసవత్తరంగా మారింది. పట్టణాలు, నగరాల్లో ఉన్న తమ పల్లె ప్రజలకు కూడా వాట్సాప్ ద్వారానే తమ గుర్తు, హామీలను పంపుతూ ఓట్లను అభ్యరిస్తూ నయా ట్రెండ్ సృష్టిస్తున్నారు. మరో ఐదు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఊర్లలో ఉన్న తమ బంధుగణంతో పాటు స్నేహితులతో గెలుపు మంతనాలు చేస్తున్నారు. కులాలు, యూత్ అసోసియేషన్ల వారీగా హామీలు ఇస్తూ సర్పంచ్ పీఠంతో పాటు వార్డు స్థానాలు గెలుచుకునేందుకు యత్నిస్తున్నారు.
ఫగుర్తుల ప్రచారంపై స్పెషల్ ఫోకస్..
పంచాయతీ ఎన్నికల సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తులను ప్రచారంలో స్పెషల్ ఫోకస్ చేయడంపై దృష్టి సారించారు. ఉంగరం, కత్తెర, ఫుట్‌బాల్, లేడీ పర్సు, టూత్ పేస్టు, చెత్తడబ్బా, నల్ల బోర్డు, బెండకాయ, బ్యాట్, టీవీ రిమోట్, కొబ్బరి తోట, వజ్రం, బకెట్, డోర్ హ్యాండిల్, టీ జల్లెడ, మంచం, టేబుల్, బ్యాటరీ లైట్, బిస్కట్, వేణువు, చెప్పులు, గాలి బుడగ, క్రికెట్ స్టంప్స్ తదితర గుర్తులను గుర్తుంచుకోవాలంటూ సర్పంచ్, వార్డు అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టారు. ఈ ప్రచారం అటు సోషల్ మీడియాలో ఇటు ప్రచారంలో హీట్ పుట్టిస్తోంది. కరపత్రాలు, వాల్ పోస్టర్లు, బ్యానర్లతోని పల్లెల్లో సందడి ఉంది. తొలి దశ ఎన్నికలు జరిగే మూడు మండలాల్లో ఈ ఆన్‌లైన్ ప్రచారం పతాక స్థాయికి చేరింది.
ఎక్కడెక్కడ ఎలా అంటే..
ఫ ఈనెల 11వ తేదీన తొలి దశ ఎన్నికలు జరగనున్న మెట్‌పల్లి, కోరుట్ల, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కథలాపూర్, మేడిపల్లి, భీమారం మండలాల్లో 122 సర్పంచ్ పంచాయతీలకు, 1,172 వార్డు సభ్యులకు స్థానాలకు గాను నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 461 మంది సర్పంచ్ పదవుల కోసం 1,954 మంది వార్డు పదవుల కోసంబరిలో నిలిచారు.
ఫ ఈనెల 14వ తేదీన మలి విడత ఎన్నికలు జరిగే జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోని జగిత్యాల అర్బన్, జగిత్యాల రూరల్, సారంగాపూర్, రాయికల్, బీర్‌పూర్ మండలాలు, చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గంలోని మల్యాల, కొడిమ్యాల మండలాల్లో 144 సర్పంచ్, 1,276 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలు గడువు ముగిసే సరికి 941 సర్పంచ్...2,927 వార్డు సభ్యుల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం నామినేషన్లపై అప్పీళ్ల స్వీకరణ, అప్పీళ్ల పరిష్కారం అధికారులు నిర్వహిస్తున్నారు.
ఫ ఈనెల 17వ తేదీన మూడో దశ ఎన్నికలు జరిగే ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలోని ధర్మపురి, గొల్లపల్లి, బుగ్గారం, ఎండపల్లి, వెల్గటూరు, గొల్లపల్లి పెగడపల్లి మండలాల్లో 119 సర్పంచ్, 1,088 వార్డు సభ్యుల స్థానాలున్నాయి. నామినేషన్ల స్వీకరణ తొలి రోజు అయిన ఈనెల 3వ తేదీన 152 మంది సర్పంచ్ అభ్యర్థులు, 299 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు.