వాహనదారులపై భారం
ABN , Publish Date - Aug 01 , 2025 | 01:01 AM
వాహనదారులపై ప్రభుత్వం భారం వేసింది.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
వాహనదారులపై ప్రభుత్వం భారం వేసింది. రవాణా శాఖ ద్వారా అందించే వివిధ రకాల సేవల చార్జీలను భారీగా పెంచింది. 50 నుంచి 100 శాతం వరకు ఉంది. జూలై 28 నుంచి ఎలాంటి ప్రచారం లేకుండానే చార్జీలు పెంచడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వాహనాల రిజిస్ట్రేషన్, హైపోథీకేషన్, వాహన యాజమాన్య బదిలీ, ఆర్సీల రెన్యూవల్, వాహనాల బదిలీలకు సంబంధించిన క్లియరెన్స్, సర్టిఫికెట్లు, ఎన్‌వోసీల చార్జీలు రూ 100 నుంచి రూ వేలల్లో పెరిగింది. చార్జీల పెరుగుదలకు కంటే ముందే బుక్ చేసుకున్న వారికి రవాణా శాఖ కార్యాలయంలోనే పెరిగిన చార్జీలను చెల్లించాల్సి వస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో రవాణా శాఖకు రూ.39.25 కోట్ల అదాయం సమకూరింది. 2023-24 ఆర్థిక సంవత్సరం కంటే 2024-25 ఆర్థిక సంవత్సరం రూ.1.55 కోట్లు అదనంగా ఆదాయం సమకూరింది. ఇందులో త్రైమాసిక ట్యాక్స్ రూపంలో రూ.6 కోట్ల 78 లక్షల 64 వేలు ఆదాయం సమకూరింది. లైఫ్ ట్యాక్స్ రూపేణా రూ.22 కోట్ల 57 లక్షల 55వేలు, వివిధ ఫీజుల నిమిత్తం వచ్చిన అదాయం రూ 4 కోట్ల 68 లక్షల 15 వేలు, సర్వీస్ ఫీజులు రూపేణా రూ కోటి 49 లక్షల 79 వేలు లభించింది. గ్రీన్ ట్యాక్స్ రూపంలో రూ 53 వేల ఆదాయం వచ్చింది. జరిమానాల ద్వారా రూ కోటి 84 లక్షల 15305 అదాయం లభించింది. 2023- 24 ఆర్థిక సంవత్సరంలో త్రైమాసిక ట్యాక్స్ రూ 6.70 కోట్లు ఆదాయం సమకూరింది. లైఫ్ ట్యాక్స్‌లో రూ 23.80 కోట్లు, వివిధ ఫీజుల ద్వారా రూ 4.93 కోట్లు, రూ 1.28 కోట్లు లభించింది. జరిమానాల ద్వారా రూ 97.7 లక్షలు లభించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెట్టింపు ఆదాయం రానున్నది.
పెరిగిన చార్జీలు ఇలా..
రవాణా శాఖ పెంచిన చార్జీలు ప్రభుత్వానికి ఆదాయాన్ని భారీగా సమకూర్చనుంది. బైక్ లెర్నింగ్ ఫీజు రూ 300 నుంచి రూ 350, ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలకు సంబంధించి పర్మినెంట్ లైసెన్స్ రూ 1335 నుంచి రూ 1450 వరకు పెరిగింది, వాహన యాజమాన్య బదిలీ రూ 935 నుంచి రూ 1805, హైపోథీకేషన్‌కు రూ.2135 నుంచి రూ.3135 వరకు, రవాణేతర బైకులు రిజిస్ట్రేషన్ చార్జీ 200 నుంచి 2010 వరకు, ఇతర వాహనాలకు రూ 400 నుంచి 440 వరకు, ఆటో రిక్షా ఆర్‌సికి రూ 150 నుంచి రూ 250 వరకు పెంచారు. ఆటోరిక్షా పర్మిట్‌కు రూ.100 నుంచి రూ.200 వరకు పెంచారు. ఇతర సర్వీస్ చార్జీలు పెరుగుదల వాహనదారులు భారంగా భావిస్తున్నారు
జిల్లాలో వ్యక్తిగత వాహనాల వైపు ఆసక్తి...
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 5.52 లక్షల జనాభా ఉంది. దాదాపు 1.77 లక్షల ఇళ్లు ఉన్నాయి. వాహనాలు కూడా 1.46 లక్షలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం వాహనాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ సంవత్సరం ఎలక్ర్టానిక్ వాహనాలపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో 2024-25 సంవత్సరంలో ద్విచక్ర వాహనాలు 101902, కార్లు 13279, స్కూల్ బస్సులు 162, రవాణా క్యాబ్‌లు 89, లగ్జరీ టూరిస్ట్ క్యాబ్‌లు 15, జీపులు 14, మోటార్ క్యాబ్‌లు 1198, ప్రైవేటు ఓమినీ బస్సులు 223, రోడ్ రోలర్‌లు 2, స్టేజీ క్యారియర్‌లు మోపెడ్, అండ్ మోటారైజ్‌డ్ సైకిల్ 4959, త్రీవిలర్ గూడ్స్ వాహానాలు 1439, వ్యవసాయ ట్రాక్టర్‌లు 5609, కమర్షియల్ ట్రాక్టర్‌లు 4196, సరుకుల రవాణా వాహానాలు 3042, ప్రైవేటు క్రేన్‌లు 8, కన్‌స్ట్రక్షన్‌కు సంబంధించిన వాహనాలు 236, హార్వేస్టర్‌లు 660, అంబులెన్స్‌లు 39, అటోలు 3673లతో పాటు ఇతర వాహానాలు కూడా పెరిగాయి.
పెరిగిన చార్జీలు అమల్లోకి వచ్చాయి..
- వీ లక్ష్మణ్, జిల్లా రవాణా శాఖ అధికారి
రవాణా శాఖ ద్వారా ప్రభుత్వం పెంచిన వివిధ రకాల సేవలు చార్జీలు అమల్లోకి వచ్చాయి. వాహనదారులు పెరిగిన చార్జీలు చెల్లించి రవాణా శాఖ సేవలు పొందాలి. ముందే స్లాట్ బుక్ చేసుకున్న వారు పెరిగిన చార్జీలకు సంబంధించి మిగిలిన డబ్బులు చెల్లించడానికి కార్యాలయంలో ఏర్పాట్లు చేశాం. జిల్లాలో వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సేవలు అందిస్తున్నాం.