బీజేపీతో, బీఆర్‌ఎస్ చీకటి ఒప్పందం
ABN , Publish Date - May 24 , 2025 | 12:33 AM
బీజేపీతో, బీఆర్‌ఎస్ చీకటి ఒప్పందం తాము ఎప్పటి నుంచో చెబుతున్నామని, కవిత లేఖతో అది నిర్ధారణ అయిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
- కవిత లేఖతో అది నిర్ధారణ
- జిల్లాలో కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగింది
- మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్ అర్బన్, మే 23 (ఆంధ్రజ్యోతి): బీజేపీతో, బీఆర్‌ఎస్ చీకటి ఒప్పందం తాము ఎప్పటి నుంచో చెబుతున్నామని, కవిత లేఖతో అది నిర్ధారణ అయిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన కరీంనగర్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ గతంలో బీజేపీతో బీఆర్‌ఎస్ ఎందుకు స్నేహంగా ఉందని కాంగ్రెస్ అడిగితే రాజకీయం అన్నారన్నారని, ఇప్పుడు ఆ పార్టీ అధినేత కూతురే ఈ విషయంపై ప్రశ్నిస్తోందన్నారు. ఎమ్మెల్సీ కవిత నేరుగా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడిపై లేఖ ద్వారా విమర్శలు చేశారని, వీటికి ఆ పార్టీ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్ వేర్వేరు కాదని తాము ముందు నుంచీ చెబుతున్నామని, నేడు కవిత రాసిన లేఖలో అది నిజమని తేలిందన్నారు. బీజేపీ నాయకత్వం కూడా దీనికి సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. కేసీఆర్ సూచన మేరకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ని తొలగించి కిషన్‌రెడ్డిని అధ్యక్షుడిని చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కవిత లేఖలోని అంశాలపై చర్చను డైవర్షన్ చేసేందుకే కేటీఆర్ చిట్‌చాట్ చేసి కాంగ్రెస్‌పై విమర్శలు చేశారన్నారు.
కరీంనగర్‌లో శాతవాహన యూనివర్సిటీకి లా కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల తీసుకొచ్చామన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొచ్చామని, డంప్ యార్డ్ తొలగించే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా ప్రజల సమస్యలు పరిష్కరించవచ్చని, స్థానిక శాసన సభ్యుడు గంగుల కమలాకర్ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కరీంనగర్‌లో అభివృద్ధి జరిగిందన్నారు. గత ప్రభుత్వం స్మార్ట్ సిటీ పేరుతో వందల కోట్ల బిల్లులు బకాయిలు పెట్టిందని, ఆ బిల్లులను తామే చెల్లిస్తున్నామన్నారు. మిగతా నియోజకవర్గాల మాదిరిగానే కరీంనగర్‌లో కూడా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని, బద్దిపల్లిలో ఎనిమిది వేల ఇళ్లు కట్టించామని, పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్‌రూం పనులు పూర్తి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.