విజృంభిస్తున్న దోమలు
ABN , Publish Date - Jul 08 , 2025 | 01:07 AM
వర్షాలు ఊపందుకుంటు న్నాయి.
- పొంచి ఉన్న వ్యాధులు
- ఆందోళనలో నగర వాసులు
- పెరిగిన నగర విస్తీర్ణం
- ఎక్కడా కనిపించని ఫాగింగ్
కరీంనగర్ టౌన్, జూలై 7 (ఆంధ్రజ్యోతి): వర్షాలు ఊపందుకుంటు న్నాయి. వారం రోజుల క్రితం వరకు 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వేడిమిని భరించలేక ఉక్కిరి బిక్కిరి అయిన నగరవాసులు వర్షాలతో వాతావరణం చల్లబడి ఊపిరిపీల్చుకుంటున్నారు. వర్షాలు ప్రారంభం కావడంతోనే దోమలు పెరిగిపోయి స్వైర విహారం చేస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.
ఫ వర్షాకాలం సమస్యలపై వంద రోజుల ప్రణాళిక
రాష్ట్ర ప్రభుత్వం వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని జూన్ నెలలోనే నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో వంద రోజుల ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలని అధికారులకు సూచించింది. వర్షాలతో ప్రజలు ఎదుర్కునే సమస్యలపై ప్రదానంగా దృష్టి పెట్టలంటూ అదికారులకు ఆదేశాలు జారీ చేసింది. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించింది. ముగునీటి కాలువలు, వరద నీటి కాలువలను శుభ్రం చేసి సిల్ట్‌ను తొలగించి. నీరు నిలువ ఉండకుండా చర్యలు చేపట్టాలని అన్నది. ప్రజలను బాగస్వాములను చేసి నివాస గృహాలు, వాటి పరిసరాల్లో శుభ్రంగా ఉంచుకోవాలని, దోమలతో కలిగే దుష్పరిణామాలను వివరించి చైతన్య పరచాలని సూచించింది. మెప్మా పారిశుధ్య విభాగం, డీఆర్‌ఎఫ్ బృందాలు కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని ఆదేశించింది. దోమల నివారణ చర్యలను కూడా ముమ్మరంగా చేపట్టాలని అధికారులకు ఉత్తర్వులు జారి చేసింది. అధికారులు ఇందుకోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు.
ఫ దోమల నివారణకు నామమాత్రపు చర్యలు
క్షేత్ర స్థాయిలో వంద రోజలు ప్రణాళిక అమలు కావడం లేదు. దోమల నివారణ చర్యలు నామ మాత్రంగానే తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇటీవల కాంగ్రెస్, బీజేపి, బీఆర్‌ఎస్ నాయకులు దోమల నివారణ చర్యలను ముమ్మరంగా చేపట్టాలని కోరుతూ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ఫాగింగ్ వంటి చర్యలు ఎక్కడ చేపడుతున్నారో తెలియడం లేదని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అంతే కాకుండా నగర వ్యాప్తంగా దోమలు స్వైర విహారం చేస్తున్నాయన్నది వాస్తవం. చాలా చోట్ల మురుగు నీటి కాలువలు, రోడ్లు, ఖాళీ స్థలాల్లో దోమలు వృద్ధి చెందడంతో వ్యాధులు ప్రబలుతున్నాయి. మరో వైపు నగర పాలక సంస్థలో కొత్తపల్లి మున్సిపల్‌తో పాటు శివారు గ్రామాలను విలీనం చేయడంతో నగర విస్తీర్ణం పెరిగింది. విలీన గ్రామాల్లో, శివారు ప్రాంతాల్లో పారిశుధ్య పనులు ఏమాత్రం మెరుగు పడలేదు. దీంతో దోమలు, దుర్వాసనతో ఆనారోగ్యలకు గురవుతున్నామని అక్కడి ప్రజలు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వర్షాలు కురుస్తున్నందున దోమల నివారణ చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా శివారు డివిజన్లు విలీన గ్రామాలపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.