పారదర్శతకు బాడీవార్మ్ కెమెరాలు
ABN , Publish Date - Aug 08 , 2025 | 01:24 AM
ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు, గొడవలు, బంద్, ర్యాలీలు, పండుగలు, పోలీసు తనిఖీలు, డ్రంకెన్‌డ్రైవ్, సెర్చ్‌ల సమయంలో పోలీసులపై విమర్శలు వస్తుంటాయి.
కరీంనగర్ క్రైం, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు, గొడవలు, బంద్, ర్యాలీలు, పండుగలు, పోలీసు తనిఖీలు, డ్రంకెన్‌డ్రైవ్, సెర్చ్‌ల సమయంలో పోలీసులపై విమర్శలు వస్తుంటాయి. ఇటువంటి సందర్భాల్లో పోలీసులు నెట్టివేశారని, చేయి చేసుకున్నారని, ఇతరులను అగౌరవపరిచారని, దూషించారని ఆరోపణలు వస్తుంటాయి. కొన్ని ఘటనలపై ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణకు ఆదేశిస్తుంటారు. ఇటీవల హుజురాబాద్ సబ్‌డివిజన్‌లో తనిఖీల సమయంలో ఒక వ్యక్తిపై పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారని ఫిర్యాదులు వచ్చాయి. ఇటువంటి సందరర్భాలలో నిజానిజాలను తెలుసుకునేందుకు బాడీవార్మ్ కెమెరాలను వినియోగిస్తున్నారు. పోలీస్ కమిషనర్ గన్‌మెన్ కూడా బాడీవార్మ్ కెమెరాలను వినియోగిస్తుంటారు. ప్రస్తుతం ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) అందుబాటులోకి వచ్చిన తరువాత వీడియోలను రకరకాలుగా మార్చి వైరల్ చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో సామాజిక మాధ్యమాలలో వస్తున్న ఆడియో, వీడియోలు లేది ఒరిజినల్, ఏది ఎడిట్ చేసింది అనేది తెలుసుకోవడం కష్టంగా మారింది. ఇటువంటి సమయంలో పోలీసుల విధుల్లో పారదర్శకతను పెంచేందుకు బాడీవార్మ్ కెమెరాలు ఉపయోగపడతున్నాయి. ఇటీవల దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న బీఎస్‌ఎఫ్ వంటి కేంద్ర బలగాలకు కూడా ఈ బాడీవార్మ్ కెమెరాలను అందిస్తున్నారు.
ఫ నెల రోజుల ఫుటేజీ భద్రం
బాడీ వార్మ్ కెమెరాల్లో ఆడియో, వీడియో రికార్డు సౌకర్యం ఉంటుంది. ఈ కెమెరాలో ఉన్న చిప్‌లో నెల రోజు వరకు ఆడియో, వీడియో రికార్డులకు సంబంధించిన పుటేజీలు భద్రంగా ఉంటాయి. నెల రోజుల తరువాత ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతాయి. ఈలోపు అవసరమైన ఆడియో, వీడియో రికార్డులను అధికారులు డౌన్‌లోడ్ చేసి భద్రపురుస్తారు. ఈ కెమెరాల్లో 8 గంటలపాటు పనిచేసేలా బ్యాటరీల సామర్థ్యం ఉంది.
ఫ కమిషనరేట్‌లో 30 బాడీవార్మ్ కెమెరాలు...
పోలీస్ కమిషనరేట్‌కు 30 బాడీ వార్మ్ కెమెరాలు అందజేశారు. కమిషనరేట్‌లోని ప్రతీ పోలీస్ స్టేషన్‌కు ఒక కెమెరా, కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులకు ఎనిమిది కెమెరాలను అందజేశారు. నగరంలో డ్రంకెన్ డ్రైవ్, వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో, ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న సమయంలో బాడీవార్మ్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. ఈ బాడీవార్మ్ కెమెరాలను ఎస్‌ఐ, సీఐ స్థాయి స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో) డ్యూటీ సమయంలో వారి బుజానికి లేదా ఛాతి వద్ద బాడీ వార్మ్ కెమెరాలను అమరుస్తారు. దీంతో ఆ అధికారి ఎదురుగా ఏమి జరిగినా ఆటోమేటిక్‌గా రికార్డు అవుతుంది. వాదోపవాదాలు, అల్లర్లు, గొడవల సమయంలో ఎవరు ఏమి మాట్లాడినా స్పష్టంగా వీడియో, ఆడియో రికార్డు అవుతుంది. ఈ ఆడియో, వీడియో రికార్డులు కోర్టులో సాక్ష్యాలుగా ఉపయోగపడుతాయి.