చేప పిల్లల పంపిణీపై నీలినీడలు
ABN , Publish Date - Oct 11 , 2025 | 12:50 AM
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి) రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా పంపిణీ చేసే చేప పిల్లల పంపిణీపై నీలినీడలు అలము కున్నాయి. చేప పిల్లలు పంపిణీ చేసే విషయమై ప్రభుత్వం ముందుచూపు కనబరచక పోవడంతో రెండేళ్లుగా మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత ఏడాది కూడా ప్రభుత్వం ఆలస్యంగా పంపిణీ చేపట్టడంతో కాంట్రాక్టర్లు నాణ్యతలేని చేప పిల్లలను తీసుకువచ్చి పంపిణీ చేసేందుకు సిద్ధం చేయడంతో వాటిని మత్స్యకారులు తిరస్కరించారు.
చేప పిల్లల పంపిణీపై నీలినీడలు
- దాఖలైన రెండు టెండర్లు అనర్హమైనవే..
- ఉన్నతాధికారులకు లేఖ రాసిన అధికారులు
- చేప పిల్లలకు బదులు నగదు పంపిణీ చేయాలంటున్న మత్స్యకారులు
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా పంపిణీ చేసే చేప పిల్లల పంపిణీపై నీలినీడలు అలము కున్నాయి. చేప పిల్లలు పంపిణీ చేసే విషయమై ప్రభుత్వం ముందుచూపు కనబరచక పోవడంతో రెండేళ్లుగా మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత ఏడాది కూడా ప్రభుత్వం ఆలస్యంగా పంపిణీ చేపట్టడంతో కాంట్రాక్టర్లు నాణ్యతలేని చేప పిల్లలను తీసుకువచ్చి పంపిణీ చేసేందుకు సిద్ధం చేయడంతో వాటిని మత్స్యకారులు తిరస్కరించారు. దీంతో ఆ ఏడాది జిల్లాలో ఏ ఒక్క మత్స్య సహకార సంఘానికి కూడా చేప పిల్లల పంపిణీ జరగలేదు. ఈ ఏడాదైనా ప్రభుత్వం చేప పిల్లలను ఉచితంగా అందిస్తుందని మత్స్యకారులు ఎదురుచూశారు. కానీ ముందస్తుగా టెండర్లను ఆహ్వానించక పోవడంతో జాప్యం జరుగుతున్నది. చేప పిల్లలకు బదులు నగదు పంపిణీ చేయాలని మత్స్యకారులు కోరుతున్నా ప్రభుత్వం టెండర్లకే వెళ్ళింది. అర్హత లేని కాంట్రాక్టర్లు టెండర్‌కు దరఖాస్తు చేసుకోవడంతో అవి కొట్టుకుపోయాయి. దీంతో చేప పిల్లల పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది.
జిల్లాలో 1018 చెరువులు, కుంటలతో పాటు శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్ ఉంది. వీటిలో కోటి 60 లక్షల చేప పిల్లలను మత్స్యకారుల ద్వారా పెంచేందుకు జిల్లా మత్స్యశాఖ ప్రణాళికలు రూపొందించింది. చేప పిల్లల సరఫరాకు ప్రభుత్వం ఆగస్టు రెండో వారంలో టెం డర్లను ఆహ్వానించింది. ఆ మేరకు ఇద్దరు కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేశారు. దాఖలైన టెండర్లను గడువు తేదీ సెప్టెంబరు 8 తర్వాత సంబంధిత అధికారులు పరిశీలించారు. అందులో ఒక టెండర్ ఫ్రీ క్వాలిఫికేషన్ లో కొట్టుడుపోగా, మరో టెండర్ వేసిన కాంట్రాక్టర్‌కు జిల్లాకు సరిపడా చేప పిల్లలను పంపిణీ చేసే సామర్థ్యం లేదని గుర్తించి రద్దు చేశారు. అనంతరం జిల్లాలో చేప పిల్లల పంపిణీ కోసం అర్హత కలిగిన కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేయలేదని, ఇతర జిల్లాల నుంచి జిల్లాకు చేప పిల్లలను సరఫరా చేయాలని జిల్లా మత్సశాఖ అధికారులు ఉన్నతాధికారు లకు లేఖలు రాశారు. దీనిపై నిర్ణయం వెలువడే లోపే సెప్టెంబరు 27వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9 పై పలువురు కోర్టును ఆశ్రయించి కొట్టివేయాలని అభ్యర్థించారు. దీనిని విచారించిన హైకోర్టు ఆరువారాల పాటు బీసీ రిజర్వేషన్లను, ఎన్నికల నోటిఫికేషన్లు తాత్కాలికంగా వాయిదా వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వెంటనే రాష్ట్ర్ట్రంలో ఎన్నికల కోడ్ నిలిచి పోయింది. స్థానిక సంస్థల ఎన్నికలపై తుది విచారణ నవంబరు 20వ తేదీ తర్వాత జరగనున్నది. అప్పటి వరకు ప్రభుత్వం ఉచిత చేప పిల్లలను పంపిణీ చేస్తుందా, లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ ఏడాది సాధారణ స్థాయికి మించి జిల్లాలో వర్షాలు కురవడంతో రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు అన్ని జల కళను సంతరించుకున్నాయి. వాస్తవానికి ఆగస్టు నెలాఖరులోపే చెరువులు, కుంటల్లో చేప పిల్లలు పోయాల్సి ఉంటుంది. ఇప్పటికే నెల 15 రోజుల ఆలస్యం కావడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. చేప పిల్లలకు బదులు నగదు పంపిణీ చేయాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే చేప పిల్లలను ప్రభుత్వం పంపిణీ చేస్తుందా, లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే చేప పిల్లలకు బదులు నగదు పంపిణీ చేస్తే తాము వాటిని కొనుగోలు చేసి చెరువుల్లో వేసుకుంటామని మత్స్యకారులు చెబుతున్నారు.