Share News

రక్తమోడుతున్న రహదారులు

ABN , Publish Date - Nov 05 , 2025 | 12:47 AM

రహదారులు రక్తసిక్తమవుతున్నాయి.. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. ఒకరో.. ఇద్దరో.. మృత్యువాత పడుతూనే ఉన్నారు. గాయాలపాలయ్యే వారి సంఖ్య చెప్పనవసరం లేదు.. అతివేగం.. నిర్లక్ష్యం ప్రమాదాలకు కారణాలుగా నిలుస్తున్నాయి.

  రక్తమోడుతున్న రహదారులు

రహదారులు రక్తసిక్తమవుతున్నాయి.. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. ఒకరో.. ఇద్దరో.. మృత్యువాత పడుతూనే ఉన్నారు. గాయాలపాలయ్యే వారి సంఖ్య చెప్పనవసరం లేదు.. అతివేగం.. నిర్లక్ష్యం ప్రమాదాలకు కారణాలుగా నిలుస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు మొదలుకొని ట్రాక్టర్లు, టిప్పర్లు, లారీలు, కార్లు.. ఇలా ఏ వాహనం చూసినా శరవేగంగా దూసుకుపోతూ కనిపిస్తున్నాయి. ఆ వేగంలో వాహనాలు అదుపు కాక ప్రమాదాలకు కారణమవుతున్నాయి.

కరీంనగర్‌ క్రైం, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): కారు, బైక్‌, ఆర్టీసీ బస్సు, ప్రైవేట్‌ బస్సు, ఆటో వాహనం ఏదైనా అతివేగం అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటున్నది. సామాన్య ప్రజలు ఎక్కువగా ఉపయోగించే రవాణా సదుపాయం ఆర్టీసీ బస్సు. ప్రయాణీకులు క్షేమంగా, భద్రంగా గమ్యస్థానం చేరుకోవాలంటే ఆర్టీసీ బస్సు ప్రయాణం మేలుగా భావించేవారు. రెండు రోజుల క్రితం వికారాబాద్‌-హైదరాబాద్‌ హైవేపై ఆర్టీసీ బస్సు, టిప్పర్‌ ఢీకొన్న ప్రమాదంలో 19 మంది ప్రయాణీకులు మృత్యువాతపడ్డారు. 34 మంది గాయాలపాలయ్యారు. తాజాగా మంగళవారం వేకువజామున జిల్లాలోని రాజీవ్‌రహదారిపై రేణికుంట బ్రిడ్జి వద్ద వరిదాన్యంలోడ్‌తో ముందు వెళుతున్న ట్రాక్టర్‌ను ఆర్టీసీ బస్సు వెనుకనుంచి అతివేగంగా ఢీకొన్న ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. ట్రాక్టర్‌ బోల్తాపడగా డ్రైవర్‌కు గాయాలయ్యాయి. 2018లో మానకొండూర్‌ మండలం చెంజర్ల వద్ద లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ఏడుగురు ప్రయాణీకులు మృత్యువాత పడగా, మరో 26 మంది క్షతగాత్రులయ్యారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ మద్యం సేవించి అతివేగంగా నడిపి ప్రమాదానికి కారణమయ్యాడని పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు.

ఫ ఆర్టీసీ బస్సులూ అతి వేగంగా..

ఇటీవల ఆర్టీసీ బస్సులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. ఆర్టీసీ బస్సులను కూడా డ్రైవర్లు అతివేగంగా నడపటంమూలంగానే అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని వరంగల్‌-జగిత్యాల హైవే, రాజీవ్‌ రహదారిపై వాహనాలు ఇష్టారాజ్యంగా నడుపుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో అధికశాతం మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లనే జరుగుతున్నట్లు పలు సర్వేల్లో వెల్లడైంది. ఓవర్‌లోడ్‌తో వెళుతున్న ఇసుక, గ్రానైట్‌ లారీలు, ఆటోలపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. రహదారులపై వాహనాల వేగాన్ని నియంత్రించడానికి ఏర్పాటు చేసిన ‘స్పీడ్‌ గన్‌’ రవాణా శాఖ కార్యాలయంలో ప్రదర్శనకు మాత్రమే అన్నట్లుగా మారింది. జిల్లాలోని ప్రధాన రహదారులపై ప్రమాదాల నివారణ కోసం ఏర్పాటు చేసిన హైవే గస్తీ బృందం జాడ లేకుండా పోయింది.

ఫ రహదారులపై కనిపించని డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్టులు

మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని గుర్తించడానికి ఏర్పాటు చేసిన ‘బ్రీత్‌ ఎనలైజర్‌’లను పోలీసులు రహదారులపై వినియోగించకుండా నగరాలు, పట్టణాల్లో మాత్రమే వినియోగిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. రాజీవ్‌రహదారి, ఇతర ప్రధాన రహదారులపై మద్యం సేవించి అతివేగంగా డ్రైవింగ్‌ చేస్తున్న డ్రైవర్లు పజల ప్రాణాలను బలితీసుకుంటున్నారు. రహదారులను ఆనుకుని విచ్చల విడిగా దాబాలు, హోటళ్లలో మద్యం సిట్టింగ్‌లు నడుస్తున్నాయి.

ఫ కరీంనగర్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో గడిచిన 21 నెలల్లో 1,205 రోడ్డు ప్రమాదాలు జరగగా ఇందులో 295 మంది మృత్యువాతపడగా మరో 1,138 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిపాలయ్యారు. జిల్లాలో 2024లో 584 రోడ్డు ప్రమాదాలు జరగగా 137 మంది మృత్యువాత పడ్డారు. 562 మంది గాయపడ్డారు. 2025(పెప్టెంబరు 30వ తేదీ వరకు)లో జిల్లాలో 621 రోడ్డు ప్రమాదాలు జరగగా 158 మంది మృత్యువాత పడ్డారు. 576 మంది గాయపడ్డారు.

ఫ డేంజర్‌ జోన్లను గుర్తించినా..

రాజీవ్‌రహదారితో పాటు వివిధ రహదారులపై 30 వరకు డేంజర్‌ జోన్లను పోలీసులు గుర్తించారు. నాలుగు వరుసలతో స్టేట్‌ హైవే-1గా రాజీవ్‌ రహదారి నిర్మాణం చేసినప్పటికీ మూలమలుపులు సరిచేయక పోవడంతోపాటు గ్రామాల వద్ద సర్వీసు రోడ్డు, ఓవర్‌, అండర్‌ బ్రిడ్జిల నిర్మాణాలు పూర్తిస్థాయిలో చేపట్టక పోవడంతో ప్రమాదకరంగా తయారయిందనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో రాజీవ్‌ రహదారి గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామం నుంచి కరీంనగర్‌ మండలం మొగ్ధుంపూర్‌ వరకు 37 కిలోమీటర్లు విస్తరించి ఉన్నది. ఈ రహదారిపై 15పైగా డేంజర్‌ జోన్లుగా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో ప్రమాద నివారణ చర్యలు తీసుకోవడం లేదు.

ఫ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

- గౌస్‌ ఆలం, సీపీ

నిర్లక్ష్యం వల్ల మీ జీవితాన్ని, ఇతరుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టవద్దు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలి. తప్పు చేసి శిక్ష నుంచి తప్పించుకోవాలని చూడొద్దు. నిబంధనలు, తనిఖీలు వాహనాదాఉల భద్రత కోసమే అని గుర్తుంచుకోవాలి. గతంతో పోల్చితే రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖంపట్టాయి. రోడ్డు ప్రమదాల నియంత్రణకు బ్లాక్‌స్పాట్‌ల గుర్తింపు, రోడ్డు భద్రతకు ఇతర ప్రభుత్వశాఖలతో సమన్వయంతో ముందుకు సాగుతున్నాం. నిబంధనలు ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

ఫ రోడ్డు ప్రమాదాల వివరాలు....

-----------------------------------------------------------------------

సంవత్సరం ప్రమాదాలు మరణాలు గాయాలు

---------------------------------------------------------------------

2023 673 215 651

2024 774 200 716

2025 621 158 574

Updated Date - Nov 05 , 2025 | 12:47 AM