బీజేపీ ‘స్థానిక’ వ్యూహం
ABN , Publish Date - Sep 03 , 2025 | 01:10 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు బుధవారం కరీంనగర్‌కు రానున్నారు.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు బుధవారం కరీంనగర్‌కు రానున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మొదటి సారి జిల్లాకు రానుండడంతో కరీంనగర్ బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలోని కొండాసత్యలక్ష్మి గార్డెన్స్‌లో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని పోపలింగ్ బూత్ అధ్యక్ష, కార్యదర్శులతో పాటు, ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావుతో పాటు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దిశా నిర్ధేశం చేయనున్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ఇప్పటికే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో స్థానిక ఎన్నికలపై కసరత్తు చేశారు. కేంద్రం చేపడుతున్న అభివృద్ధి పథకాలు, 20 నెలల కాలంలో కాంగ్రెస్ పాలనలో వైఫల్యాలను ఎండగట్టే విధంగా కార్యకర్తలను సమాయత్తం చేశారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నింటిలో కేంద్ర నిధులు ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వాలు దారి మల్లించి పంచాయతీ సిబ్బంది జీతభత్యాలకు చెల్లిస్తున్న విషయాన్ని ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు.
ఫ జడ్పీ పీఠంపై గురి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు నాయకత్వంలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అత్యధిక స్థానాలు గెలుచుకోవడంతో పాటు, కరీంనగర్, సిరిసిల్ల జిల్లా పరిషత్ ఛైర్మన్ పీఠాలను కైవసం చేసుకునే విధంగా రెండు జిల్లాల్లో పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. బీఆర్‌ఎస్ బలహీనపడటం, కాంగ్రెస్‌కు బలమైన నాయకత్వం లేక పోవటం వంటి అంశాలు కలిసి వస్తుందని కమలనాథులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఒక దఫా సర్వే నిర్వహించి బీజేపీ బలమైన అభ్యర్థులకు స్థానిక ఎన్నికల్లో నిలిపేందకు సిద్ధమవుతున్నది. పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, శిశుమందిర్‌లలో పదవ తరగతి చదివే విద్యార్థులకు 20 వేల సైకిళ్లను పంపిణీ చేయడం కమలనాథులకు కలిసి వచ్చే అంశాలుగా పరిగణిస్తున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టిన విషయాన్ని ప్రజలకు వివరించేందకు సిద్ధమవుతున్నారు. అన్ని కుల సంఘాలకు భవన నిర్మాణం సహా వివిధ అభివృద్ధి పేరుతో ప్రత్యేక నిధులు కేటాయిం చిన విషయం కలిసి వస్తుందని అభిప్రాయ పడుతున్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో అందరికీ అధికారం ఇచ్చారు.. బీజేపీకి ఇవ్వండి అవకాశం.. అనే నినాదాన్ని ఇంటింటికి తీసుకు వెళ్లి అత్యధిక స్థానాలు కైవసం చేసుకునే లక్ష్యంగా బీజేపీ నాయకత్వం పావులు కదుపుతున్నది. స్థానిక ఎన్నికల నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు కరీంనగర్ రావడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నది.
ఫ భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు
బీజేపీ రాష్ట్ర పగ్గాలు చేపట్టాక తొలిసారిగా రామచందర్‌రావు కరీంనగర్‌కు రానుండడంతో కరీంనగర్ బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు సమాయత్తమవుతున్నారు. బుధవారం ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 10.30 గంటలకు కరీంనగర్ సమీపంలోని గుండ్లపల్లి టోల్ గేట్ వద్దకు చేరుకోనున్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ భారీ ఎత్తున కార్యకర్తలు, నాయకులతో కలిసి గుండ్లపల్లి వద్దకు తరలివచ్చి రామచందర్‌రావుకు ఘన స్వాగతం పలకనున్నారు. అక్కడి నుండి కార్యకర్తలతో కలిసి రామచందర్‌రావు, బండి సంజయ్ కరీంనగర్‌కు చేరుకుంటారు. మార్గమధ్యలో అలుగునూరు చౌరస్తా సహా పలు చోట్ల రామచంద్రరావుకు కార్యకర్తలు, నాయకులు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తు న్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కరీంనగర్‌లోని కొండా సత్యలక్ష్మీ గార్డెన్‌లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ బూత్ అధ్యక్ష కార్యదర్శులు, ఆ పైస్థాయి నాయకులతో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు.