Share News

స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ

ABN , Publish Date - Oct 01 , 2025 | 11:02 PM

స్థానిక ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ రాంచంద్రరావు అన్నారు. కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో మండల అధ్యక్షులు, జడ్పీటీసీ ప్రభారీలతో బుధవారం సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలన్నారు.

స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో  బీజేపీ పోటీ

కరీంనగర్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): స్థానిక ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ రాంచంద్రరావు అన్నారు. కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో మండల అధ్యక్షులు, జడ్పీటీసీ ప్రభారీలతో బుధవారం సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలన్నారు. అభ్యర్థుల ఎంపిక మొదలైందన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే చోట్ల జడ్పీటీసీ అభ్యర్థులకు బి ఫాంలు అందిస్తామన్నారు. వార్డు సభ్యుడి నుంచి మొదలుకొని జడ్పీటీసీ వరకు అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేసి అత్యధిక స్థానాలను సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన పార్టీ బీఆర్‌ఎస్‌ అన్నారు. కేంద్ర నిధులను దారి మళ్లించి గ్రామాల్లో అభవృద్ధి లేకుండా చేశారన్నారు. నాడు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి కల్పించారన్నారు. తాజా మాజీ సర్పంచులు పడిన యాతన వర్ణణాతీతమన్నారు. పంచాయతీలకు కరెంట్‌ బిల్లులు కూడా కట్టలేని దుస్థితి తెచ్చారన్నారు. కాంగ్రెస్‌ అనేక వాగ్దానాలు చేసి రైతు భరోసా ఇవ్వడం లేదన్నారు. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద కేంద్రం క్రమం తప్పకుండా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తోందన్నారు. ఉచితంగా బియ్యం అందిస్తుందని, కేంద్ర నిధులతోనే పంచాయతీల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. బీఆర్‌ఎస్‌ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తే, కాంగ్రెస్‌ పార్టీ మోసం చేస్తోందన్నారు. బీజేపీ మాత్రం అభివృద్ధిపైనే మాట్లాడుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎరువుల పంపిణీ చేతకాక యూరియా కొరత ఏర్పడిందన్నారు. ఈ మధ్యనే లక్ష మెట్రిక్‌ టన్నుల యూరియా వచ్చిందన్నారు. బీజేపీని గెలిపిస్తే కేంద్ర నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామన్నారు. 42 శాతం రిజర్వేషన్ల సవరణ అప్పుడే చేస్తే ఈ సమస్య వచ్చేది కాదన్నారు. స్థానిక ఎన్నికలు నిర్వహించాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు లేదు కాబట్టే రెండేళ్ల జాప్యం చేశారన్నారు. హైకోర్టు ఆదేశించినందునే తప్పని సరి పరిస్థితుల్లో ఇష్టం లేకపోయినా ఎన్నికలు నిర్వహిస్తున్నారన్నారు. కేంద్ర నిధుల కోసమే నిర్వహిస్తున్నారన్నారు. బీజేపీ బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉందన్నారు. ఎన్నికలు జరగాలన్నదే బీజేపీ అభిమతమని, కోర్టుకు కాంగ్రెస్‌ నేతలే వెళ్లినట్లున్నాన్నారు. రాజ్యాంగ పరంగా ఎన్నికలు నిర్వహించే బాధ్యతను కాంగ్రెస్‌ తీసుకోవాలన్నారు. దేశంలో రిజర్వేషన్లకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో అనేక సామాజిక సమస్యలుంటాయన్నారు. రిజర్వేషన్లను అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రానిదే అన్నారు. రాష్ట్రంలో బీసీఈ ముస్లింలకు సంబంధించినదే అని, ఎడ్యుకేషన్‌, ఎంప్లాయిమెంట్‌కు మాత్రమే ఆనాడు పరిమితం చేశారన్నారు. కానీ వాళ్లకు రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తున్నారన్నారు. దీనిపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోందన్నారు. స్థానిక ఎన్నికలపై కోర్టు ఏ విధంగా స్పందిస్తోందో వేచి చూడాలన్నారు. కోర్టు తీర్పును ముందుగా అంచనా వేయలేమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో బీఆర్‌ఎస్‌ అవినీతి పాల్పడిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టునూ పూర్తిగా విచారణ చేపట్టాలన్నారు. పార్టీ ఫిరాయింపులకు బీజేపీ వ్యతిరేకమని, ఎవరైనా పార్టీ మారాలనుకుంటే పదవులకు రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, కరీంనగర్‌, సిరిసిల్ల బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, గోపి, మాజీ మేయర్‌ వై సునీల్‌రావు, గౌతంరావు, సుభాష్‌, బాస సత్యనారాయణరావు పాల్గొన్నారు.

ఫ కాంగ్రెస్‌ చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించాలి

కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్నున్న మోసాలను ప్రజలకు వివరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ రాంచంద్రరావు అన్నారు. బుధవారం కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు సిద్ధం కావాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరును, అధికారంలో ఉండి అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్‌ఎస్‌ వ్యవహారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. దేశాన్ని 60 ఏళ్లు ఏలిన కాంగ్రెస్‌ పార్టీ గ్రామాల అభివృద్ధి కోసం చేసిందేమిలేదని విమర్శించారు. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి ప్రజల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలుగా గడినాఆ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం భయపడుతుందన్నారు. తెలంగాణలో ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. లోగడ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే ఎందుకు నిదర్శనమన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. ప్రజలు బీజేపీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా, జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటడానికి పార్టీ శ్రేణులంతా తగిన కృషి చేయలన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్‌ రావు, చీఫ్‌ స్పోక్స్‌ పర్సన్‌ ఎన్‌వీ సుభాష్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ, మాజీ మేయర్‌ సునీల్‌ రావు, బాస సత్యనారాయణరావు, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పాల్గొన్నారు.

Updated Date - Oct 01 , 2025 | 11:02 PM