బీజేపీ నేతల నారాజ్..
ABN , Publish Date - Sep 11 , 2025 | 01:09 AM
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో జిల్లాకు చెందిన ఆ పార్టీ నాయకులకు చోటు దక్కక పోవడంపై వారంతా నారాజ్‌గా ఉన్నారు. రాష్ట్ర కమిటీలోనే కాకుండా ఆయా మోర్చాల అధ్యక్ష పదవులు కూడా ఎవరికీ దక్కక పోవడం గమనార్హం. సోమారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు 22 మందితో రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించారు.
- రాష్ట్ర కమిటీలో జిల్లా నేతలకు దక్కని చోటు
- ప్రధాన పదవుల్లో ప్రతీసారి కొనసాగిన నేతలు
- కార్యవర్గ సభ్యుల స్థానాలపైనే ఆశలు
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో జిల్లాకు చెందిన ఆ పార్టీ నాయకులకు చోటు దక్కక పోవడంపై వారంతా నారాజ్‌గా ఉన్నారు. రాష్ట్ర కమిటీలోనే కాకుండా ఆయా మోర్చాల అధ్యక్ష పదవులు కూడా ఎవరికీ దక్కక పోవడం గమనార్హం. సోమారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు 22 మందితో రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించారు. ఇందులో యువకులకు, మహిళలకు, బీసీలకు, కొత్తవారికి పెద్ద పీట వేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ, మహిళా, కిసాన్ మోర్చాలకు అధ్యక్షులను కూడా ప్రకటించారు. ఇందులో కూడా జిల్లాకు చెందిన నాయకులకు అవకాశం దక్కలేదు. పెద్దపల్లి జిల్లా ఏర్పాటైన నాటి నుంచి జిల్లాకు చెందిన సీనియర్ నాయకులకు రాష్ట్ర కార్యవర్గంలో ఆఫీస్ బేరర్ పోస్టులు దక్కుతున్నాయి. ఈ దఫా ఎవరికీ దక్కలేదు. మూడు పర్యాయాలుగా పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా కొనసాగిన దుగ్యాల ప్రదీప్‌కుమార్‌కు ఏ పదవి దక్కలేదు. అలాగే మాజీఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి పలు పర్యాయాలు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగారు. గోదావరిఖనికి చెందిన బల్మూరి వనిత సైతం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. మాజీఎమ్మెల్యే కాసిపేట లింగయ్య కూడా ఆఫీస్ బేరర్ పోస్టులో ఉన్నారు. వీళ్లకు కూడా రాష్ట్ర కార్యవర్గంలో చోటు లభించలేదు. జిల్లాలో సీనియర్ నాయకులు మేరుగు హన్మంతు, మీస అర్జున్‌రావు వంటి నేతలు ఉన్నప్పటికీ వారికి పదవులు దక్కలేదు. గుజ్జుల రామకృష్ణారెడ్డి ప్రస్తుతం పార్టీ జాతీయ కౌన్సిల్ మెంబర్‌గా ఉన్నారు. గడిచిన కార్యవర్గంలో జిల్లాకు చెందిన శీలారపు పర్వతాలు, బల్మూరి వనిత, గొట్టెముక్కుల సురేష్‌రెడ్డి, రావుల రాజేందర్, వడ్డెపల్లి రాంచందర్, చంద్రుపట్ల సునీల్ రెడ్డిలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కొనసాగారు. వడ్డేపల్లి రాంచందర్‌కు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు కావడంవల్ల ఆయనకు రాష్ట్రకమిటీలో చోటు లభించనట్లు తెలుస్తున్నది. రాష్ట్రకార్యవర్గ సభ్యుల పదవులను ఇంకా భర్తీ చేయలేదు. ఆ పదవులపై కొంతమంది నాయకులు ఆశలు పెంచుకున్నారు. గత నెలలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు సమక్షంలో పెద్దపల్లి పట్టణంలో జరిగిన పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన నల్ల మనోహర్‌రెడ్డి బీజేపీలో చేరారు. ఆయన కూడా రాష్ట్ర కార్యవర్గంలో చోటుకోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. ఆయనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అండదండలు ఉండడంతో పాటు జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవ రెడ్డి ఆయనకు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడి పదవి ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యవర్గంలో చోటు దక్కకపోవడంతో పార్టీ సీనియర్ నాయకులంతా అసంతృప్తిగా ఉన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం పార్టీలు మారకుండా ఎన్నోఏళ్లుగా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న తమకు రాష్ట్ర కార్యవర్గంలో పదవులు దక్కకపోవడంపై నారాజ్‌గా ఉన్నారు. అలాగే పార్లమెంట్ ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన మాజీఎంపీ బొర్లకుంట వెంకటేశ్ నేత, ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు గట్టి పోటీనిచ్చిన గొమాసే శ్రీనివాస్‌కు కూడా రాష్ట్ర కమిటీలో చోటు దక్కలేదు. ప్రతి జిల్లాకు ఒకరిద్దరు కార్యవర్గ సభ్యులను నియమించనున్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ, మహిళా, కిసాన్ మోర్చాల్లో కూడా పలు పదవులను భర్తీ చేయాల్సి ఉంది. ఆ పదవులపైనే కొంతమంది నాయకులు ఆశలు పెట్టుకున్నారు. ఆ పదవులు ఎవరికి దక్కనున్నాయో వేచి చూడాల్సిందే.