వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న బీజేపీ
ABN , Publish Date - Aug 09 , 2025 | 12:18 AM
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి విమర్శించారు.
గణేశ్‌నగర్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి విమర్శించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్), బీహార్‌లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ను వ్యతిరేకిస్తూ తెలంగాణ చౌక్‌లో సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ ‘సర్’ ఏకపక్షంగా ఉందని, వయోజన ఓటు హక్కు సార్వత్రిక హక్కును ఉల్లంఘిస్తుందన్నారు. గుర్తింపు ప్రక్రియ రుజువు భారాన్ని వ్యక్తిగత పౌరులపై మోపడం సరికాదన్నారు. పౌరసత్వానికి సంబంధించిన దరఖాస్తులు, డాక్యుమెంటరీ ఆధారాలు అవసరం అవుతాయని, పేదవారు వాటిని ఎక్కడి నుంచి తీసుకొస్తారని ప్రశ్నించారు. ఆధార్, రేషన్ కార్డులు వంటి సూచికలను మినహాయించి తల్లిదండ్రుల గుర్తింపును తప్పనిసరి చేయడం అవివేకం అన్నారు. తక్కువ సమయం, ముందస్తు సంప్రదింపులు లేకుండా హడావుడిగా నెల రోజుల్లో రివిజన్ ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. బీహార్ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన ముసాయిదాలో 64 లక్షల ఓట్లు తొలగించారని, ముఖ్యంగా మైనార్టీలు, మహిళల ఓట్లు తొలగించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చిన ఎన్నికల కమిషన్ ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండాను అమలు చేస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్య విరుద్ధమైన ఈ ప్రక్రియకు వ్యతిరేకంగా ప్రజలు, ప్రజాస్వామ్యవాదులుప్రగతిశీల శక్తులు, ఉద్యమించాలని పిలపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గిట్ల ముకుందరెడ్డి, గుడికందుల సత్యం, జి భీమాసాహెబ్, జిల్లా కమిటీ సభ్యులు ఎడ్ల రమేష్, నాయకులు శనిగరపు రజనీకాంత్, తిప్పారపు సురేష్, జి తిరుపతినాయక్, గజ్జల శ్రీకాంత్, శివరాజ్, కనకరాజు, సాగర్, అరవింద్, వినయ్ సాగర్, సందేశ్, కండె రాజు, లక్కి పాల్గొన్నారు.