Share News

బయోమెట్రిక్‌ ప‘రేషన్‌’

ABN , Publish Date - Jun 04 , 2025 | 03:54 AM

పేద ప్రజలు వర్షాకాలంలో ఇబ్బందులకు గురికాకుండా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 3 నెలలకు సంబంధించిన రేషన్‌ బియ్యం సరఫరా మొదలైంది. జూన్‌, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి ఒకేసారి లబ్ధిదారులకు రేషన్‌ బియ్యాన్ని అందిస్తున్నారు. ఇతర రాష్ట్రాల కంటే భిన్నమైన పరిస్థితి తెలంగాణలో ఉంది.

బయోమెట్రిక్‌ ప‘రేషన్‌’

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

పేద ప్రజలు వర్షాకాలంలో ఇబ్బందులకు గురికాకుండా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 3 నెలలకు సంబంధించిన రేషన్‌ బియ్యం సరఫరా మొదలైంది. జూన్‌, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి ఒకేసారి లబ్ధిదారులకు రేషన్‌ బియ్యాన్ని అందిస్తున్నారు. ఇతర రాష్ట్రాల కంటే భిన్నమైన పరిస్థితి తెలంగాణలో ఉంది. దొడ్డురకం బియ్యం బదులు సన్నరకం బియ్యం పంపిణీ కొనసాగుతోంది. బియ్యం సరఫరాకు రేషన్‌ డీలర్లు అనేక ఇబ్బందుల మధ్య సరఫరాకు పూనుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రేషన్‌ సరఫరాలో బయోమెట్రిక్‌ సమస్య ఇబ్బందికి గురిచేస్తోంది. మూడు నెలల బియ్యం ఒకేసారి ఇవ్వడంతో లబ్ధిదారులు అనేకమార్లు వేలిముద్రలు వేయాల్సి వస్తోంది. జిల్లాలో 345 రేషన్‌ దుకాణాలు ఉండగా, 1,77,851 రేషన్‌ కార్డులు ఉన్నాయి. ఇందులో అంత్యోదయ కార్డులు 13,748, ఆహార భద్రత కార్డులు 1,63,900, అంత్యోదయ అన్నయోజన కార్డులు 203 ఉన్నాయి. వీటి పరిధిలో లబ్ధిదారులు 5,35,920 మంది ఉన్నారు. ఇందులో అంత్యోదయ లబ్ధిదారులు 37,389 మంది, ఆహార భద్రత లబ్ధిదారులు 4,98,324 మంది, అంత్యోదయ అన్నయోజన లబ్ధిదారులు 207 మంది ఉన్నారు. వీరికి మూడు నెలల కోటా 98.59 లక్షల కిలోల బియ్యం పంపిణీ మొదలైంది. ఈనెల 1వ తేది నుంచి బియ్యం పంపిణీ చేస్తున్నప్పటికీ బయోమెట్రిక్‌ సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే 5 కిలోలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే కిలో బియ్యంకు సంబంధించి పలుమార్లు వేలిముద్రలు వేయాల్సి వస్తోంది. మూడు నెలలకు సంబంధించి మూడుసార్లు కొన్ని సందర్భాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కూడా వేలిముద్రలు ఆరుసార్లు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఒక్కో వినియోగదారుడు 20నిముషాల వరకు బయోమెట్రిక్‌తోనే గడపాల్సి వస్తోంది. అంతేకాకుండా పది కిలోలు, 20 కిలోలు, 30 కిలోల బియ్యం పంపిణీకి వేలిముద్రలు తీసుకోవడం వల్ల ఆలస్యంతో పాటు సర్వర్‌ బిజీతో మరింత ఇబ్బంది అవుతోంది. ఒక్కొక్కరికి 6కిలోల చొప్పున ఇద్దరు లబ్ధిదారులు ఉంటే 12 కిలోలు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు 10కిలోలకు ఒకసారి, 2కిలోలకు ఒకసారి వేలిముద్రలు వేయాల్సి వస్తోందని రేషన్‌ డీలర్లు చెబుతున్నారు. మరోవైపు నెలకు సంబంధించిన రేషన్‌ సమాచారం ఉండగా, మూడు నెలలకు సంబంధించిన బియ్యం ఒకేసారి పంపిణీ చేయడం వల్ల కూడా ఇబ్బందులు పడుతున్నారు. సాఫ్ట్‌వేర్‌ సమస్యతోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.

తక్కువ తూకంతో బస్తాలు...

జిల్లాలో రేషన్‌ డీలర్లకు సరఫరా చేస్తున్న సన్నబియ్యం బస్తాలు 50 కిలోలతో రావాల్సి ఉంటుంది. బస్తా తూకంలో కిలో నుంచి 3 కిలోల వరకు తక్కువ వస్తున్నాయని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి 50 కిలోల బస్తా గన్నీ బ్యాగుతో కలిపి 50కిలోల 500 గ్రాములు ఉండాలి. తక్కువ తూకంతో డీలర్లు బెంబేలెత్తిపోతున్నారు. డీలర్లు మాత్రం లబ్ధిదారులకు కోత లేకుండా పంపిణీ చేయడం ద్వారా నష్టపోతున్నారని తెలుస్తోంది.

మిల్లర్లు, అధికారుల కుమ్మక్కు..

రేషన్‌ డీలర్లకు సరఫరా అవుతున్న బియ్యం బస్తాల్లో తక్కువ రావడం వెనక మిల్లర్లు, అధికారుల కుమ్మక్కు ఉందనే ఆరోపణలు ఉన్నాయి. మిల్లర్ల నుంచి బియ్యం బస్తాలు తక్కువ తూకంతో వస్తున్నా అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మిల్లర్ల నుంచి వస్తున్న బియ్యంపై పౌరసరఫరాల శాఖ పట్టించుకోకపోవడం వెనక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డీలర్లు తక్కువ తూకం వస్తున్నాయని అధికారుల దృష్టికి తీసుకవెళ్లినా పట్టించుకోకపోగా రేషన్‌ డీలర్లనే ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

మూడు నెలల రేషన్‌ కోటా పంపిణీ ఇలా...

మండలం లబ్ధిదారులు బియ్యం (కిలోల్లో)

బోయినపల్లి 35,224 6,35,698

చందుర్తి 32,671 5,75,444

గంభీరావుపేట 44,049 7,96,665

ఇల్లంతకుంట 45,684 8,10,801

కోనరావుపేట 43,077 7,61,987

ముస్తాబాద్‌ 45,382 8,21,029

రుద్రంగి 16,155 2,89,183

సిరిసిల్ల 85,726 17,60,795

తంగళ్లపల్లి 42,401 8,11,116

వీర్నపల్లి 14,055 2,55,335

వేములవాడ 60,249 10,64,136

వేములవాడ రూరల్‌ 22,483 3,97,365

ఎల్లారెడ్డిపేట 48,764 8,80,232

------------------------------------------------------------------------------------------------------

మొత్తం 5,35,920 98,59,786

------------------------------------------------------------------------------------------------------

Updated Date - Jun 04 , 2025 | 03:54 AM