Share News

‘భూభారతి’ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

ABN , Publish Date - May 16 , 2025 | 11:58 PM

భూభారతి ఆర్‌ఓఆర్‌ చట్టం అమలులో భాగంగా పైలెట్‌ మండలం సైదాపూర్‌లోని వివిధ గ్రామాలలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో స్వీకరించిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.

‘భూభారతి’ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

సైదాపూర్‌, మే 16(ఆంధ్రజ్యోతి): భూభారతి ఆర్‌ఓఆర్‌ చట్టం అమలులో భాగంగా పైలెట్‌ మండలం సైదాపూర్‌లోని వివిధ గ్రామాలలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో స్వీకరించిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సైదాపూర్‌ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో, వెన్నంపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నిర్వహిచిన రెవెన్యూ సదస్సులను సందర్శించారు. రైతుల నుంచి స్వీరించిన దరఖాస్తులను పరిశీలించారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పరిష్కారానికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ సైదాపూర్‌ మండలాన్ని భూభారతి పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన నేపధ్యంలో, భూసమస్యలున్నవారు రెవెన్యూ సదస్సులో పాల్గొని దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. దరఖాస్తులు స్వీకరించి నూతన చట్టం ప్రకారం భూసమస్యల పరిష్కా రానికి చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో ప్రజలు భూ సమస్యలపై తహసీల్దార్‌, ఆర్డీవో వద్దకు వెళ్లేవారని, ఇప్పుడు అధికారులే స్వయంగా గ్రామాలకు వచ్చి ప్రజల వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌ రెవెన్యూ బృందాలను ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాలు, భూభారతి నిబంధ నలపై అధికారులు పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉన్నప్పుడే తప్పిదాలకు తావులేకుండా సమస్యలు పరిష్కారమవు తాయని తెలిపారు. రెవెన్యూ సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీ ల్దార్‌లు గుర్రం శ్రీనివాస్‌, కనకయ్య, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

ఫ పీహెచ్‌సీని సందర్శించిన కలెక్టర్‌

సైదాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి శుక్రవారం సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మరమ్మతు పనులను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో మొక్కలు నాటాలని, పచ్చదనం కనిపించేలా తీర్చిదిద్దాలని సూచించారు. అనంతరం ఇక్కడి ఓపీ రికార్డు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగుల ఆధార్‌, ఫోన్‌నెంబర్‌ సేకరించి ఆయుష్మాన్‌ భారత్‌లో రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని అన్నారు. బీపీ, షుగర్‌ వ్యాధిగ్రస్తులకు అవసరమైన మాత్రలు నిరంతరం అందుబాటులో ఉంచాలని అన్నారు. మహిళలకు మల్టీ విటమిన్‌ టాబ్లెట్లు, క్యాల్షియం ఐరన్‌ మాత్రలు ఇవ్వాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. ఆరోగ్య మహిళ ఉచిత వైద్య పరీక్షల బోర్డును కేంద్రంలో ప్రదర్శించాలని సూచించారు. కలెక్టర్‌ వెంట మెడికల్‌ ఆఫీసర్‌ కృష్ణారావు ఉన్నారు.

Updated Date - May 16 , 2025 | 11:58 PM