పేదలకు మెరుగైన వైద్య సేవలందించాలి
ABN , Publish Date - Nov 24 , 2025 | 11:42 PM
పేదలకు ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలందించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. సోమవారం హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రిలో రూ.1.20కోట్లతో అధునాతనమైన పరికరాలను అందజేసి, వాటిని ఆయన ప్రారంభించారు.
హుజూరాబాద్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): పేదలకు ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలందించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. సోమవారం హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రిలో రూ.1.20కోట్లతో అధునాతనమైన పరికరాలను అందజేసి, వాటిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌కుమార్ మాట్లాడుతూ పేదలు, మధ్యతరగతి ప్రజలు మాత్రమే ప్రభుత్వాస్పత్రులకు వస్తున్నారని, ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆస్పత్రుల బలోపేతం కోసం నేషనల్ హెల్త్ మిషన్ పేరుతో పెద్దఎత్తున నిధులు ఇస్తున్నప్పటికి వాటిని రాష్ట్ర ప్రభుత్వం సరిగా వాడుకోవడం విఫలమవుతోందన్నారు. ప్రజలెవరైనా విద్య, వైద్యం ప్రభుత్వం నుంచి అందాలని భావిస్తారన్నారు. ప్రభుత్వాస్పత్రులకు వచ్చే పేదలకు మెరుగైన వైద్యం అందాలనే ఉద్దేశంతో 1.2 కోట్లతో అధునాతనమైన పరికరాలను ఆస్పత్రికి అందజేశామన్నారు. వైద్యులు వాటిని ఉపయోగించి పేదలకు మరింత వైద్య సేవలందించాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ఆర్డీవో రమేష్‌బాబు, డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటరమణ, డిప్యూటీ డీఎంహెచ్‌వో చందు, ఆస్పత్రి సూపరింటెండెంట్ నారాయణరెడ్డి, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, వైద్యులు కృష్ణప్రసాద్, శ్రీకాంత్‌రెడ్డి, సురేష్, సిబ్బంది పాల్గొన్నారు.
ఫ వైద్య పరికరాలను ఉపయోగించాలి..
జమ్మికుంట: ప్రభుత్వ ఆసుపత్రులకు తాను అందజేస్తున్న వైద్య పరికరాలను ఉపయోగించి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ వైద్యులకు సూచించారు. జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఆయన ఇటీవల కోటి రూపాయాల విలువైన వైద్య పరికరాలను జమ్మికుంట ఆసుపత్రికి ఆందజేశారు. వాటిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా జమ్మికుంట, హుజూరాబాద్, వేములవాడ, హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులకు నాలుగు కోట్ల విలువైన వైద్య పరికరాలను ఎన్‌ఎండీసీ సంస్థ సహాయంతో కొనుగోలు చేసి అందించినట్లు తెలిపారు. జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. త్వరలోనే ఎంపీ ల్యాడ్స్ నుంచి ఎక్స్‌రే మిషన్ ఆందజేస్తామన్నారు. వైద్య పరికరాలు రోగుల కోసం వినియోగించకుంటే వాటిని వాపస్ తీసుకుంటామని హెచ్చరించారు. కరీంనగర్, వేములవాడ ఆసుపత్రులకు ఐసీయూ అంబులెన్స్‌లు ఇస్తే వాడుకోలేదని, వాటిని వేరే ఆసుపత్రులకు పంపించామన్నారు. రైతుల కోసం కాకుండా కమీషన్ల కోసం చెక్‌డ్యామ్‌లను నిర్మిస్తున్నారని విమర్శించారు. గతంలోనూ పలు చెక్‌డ్యామ్‌లు కూలిపోయాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చెక్‌డ్యామ్‌లు కూలిపోవడంపై విచారణ జరపాలన్నారు. బాధ్యులైన కాంట్రాక్టర్ల ఆస్తులను సీజ్ చేయాలన్నారు. అప్పుడే వాళ్లలో భయం ఉంటుందన్నారు. జమ్మికుంట రైల్వేస్టేషన్‌ను త్వరలోనే ఆధునీకరిస్తామని, అందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్దమయ్యాయని తెలిపారు. స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి సూపరింటెండెంట్ పారిపెల్లి శ్రీకాంత్‌రెడ్డి, తహసీల్దార్ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
ఫ ప్రతి చిన్నదాని పెద్దాసుపత్రికి పంపించొద్దు..
ప్రతి చిన్నదానికి రోగులను పెద్దాసుపత్రికి పంపించొద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన అనంతరం ఆయన వైద్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి సూపరింటెండెంట్ పారిపెల్లి శ్రీకారత్‌రెడ్డి మట్లాడుతూ ప్రతి వైద్య పరికరాన్ని రోగుల కోసం తప్పకుండా ఉపయోగిస్తామని ఇంఛారర్జ్ అన్నారు. తమకు మరిన్ని వైద్య పరికరాలు, వైద్యులను ఇస్తే అన్ని రోగులకు నాణ్యమైన సేవలు అందిస్తామని చెప్పారు. అనంతరం బండి సంజయ్‌కుమార్ మాట్లాడుతూ ఆసుపత్రికి అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూరుస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ వారానికి రెండుసార్లు గైనకాలజిస్ట్, అనస్తేషియా, రేడియాలజిస్ట్‌ను కేటాయిస్తామని అన్నారు. విధులపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. నెల రోజులకు సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని, అప్పటికి ఆసుపత్రిలో రిజల్ట్ కనిపించాలని వైద్యులకు సూచించారు.