రమణీయం.. వేణుగోపాలస్వామి రథోత్సవం
ABN , Publish Date - Nov 06 , 2025 | 12:27 AM
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి.
ఎల్లారెడ్డిపేట, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి) : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం ఆలయంలో పురోహితులు బిటుకూరి నవీన్‌కుమార్‌చారి, గోపాలాచారి ఆధ్వర్యంలోని పురోహితులు నిత్య ఆరాధన, సేవాకాలం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. వేణుగోపాలస్వామి, రుక్మిణీ, సత్యభామల ఉత్సవ విగ్రహాలను గరుడ వాహనం పై పురవీధుల గుండా ఊరేగించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణ ల నడుమ వైభోవోపేతంగా నిర్వహించారు. డప్పుచప్పుళ్ల నడుమ స్వామివారు ముందుకు కదిలారు. మహిళలు మంగళహారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రి ఆలయం నుంచి శ్రీవారిని జాతర మైదానానికి తీసుకువచ్చారు. రథంపై ఉత్సవమూర్తులను ప్రతిష్టించారు. వేద మంత్రోచ్ఛరణల మధ్య ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. లడ్డూ వేలంలో భక్తులు పోటాపోటీగా పాల్గొన్నారు. మొదటి లడ్డును సిరిగాధ అశోక్ రూ.40,116, రెండో లడ్డును ఎర్ర భాస్కర్‌రెడ్డి రూ.19,116, మూడో లడ్డును వేముల సతీ ష్ రూ.15116, కొబ్బరికాయను రూ.రంజిత్‌రెడ్డి రూ.6116లకు దక్కించుకున్నారు. వేలాదిమంది రాత్రి వరకు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. భారీ రథంపై స్వామివారు పురవీధుల గుండా ఊరేగారు. రథంను లాగడానికి భక్తులు పోటీ పడ్డారు. మండల కేం ద్రంతో పాటు వీర్నపల్లి, గంభీరావుపేట, ముస్తాబాద్, కోనరావుపేట, సిరిసిల్ల, తంగళ్లపల్లి మండలాలనుంచి ప్రజలు తరలివచ్చారు. వేణు గోపాలస్వామికి జన నీరాజనాలు పలికారు. అవాంఛనీయ ఘటన లు చోటుచేసుకోకుండా సీఐ శ్రీనివాస్, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి ఎస్‌ఐ లు రాహుల్‌రెడ్డి, లక్ష్మణ్, ఆర్‌ఎస్‌ఐలు శ్రావణ్, సాయిల నేతృత్వంలోని పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. ఆలయంలో మహా పూర్ణాహుతి, చక్రస్నానం, నాగవల్లి, ఏకాంత సేవతో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.