Share News

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

ABN , Publish Date - Nov 26 , 2025 | 12:10 AM

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీస్‌ కమిషనరేట్‌ యంత్రాంగం పూర్తి సంసిద్ధంగా ఉండాలని సీపీ గౌస్‌ ఆలం ఆదేశించారు. మంగళవారం కమిషనరేట్‌ పరిధిలోని పోలీస్‌ అధికారులతో సీపీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎన్నికల సన్నద్ధత, శాంతిభద్రతల పరిరక్షణపై కీలక సూచనలు చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతున్న సీపీ గౌస్‌ ఆలం

కరీంనగర్‌ క్రైం, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీస్‌ కమిషనరేట్‌ యంత్రాంగం పూర్తి సంసిద్ధంగా ఉండాలని సీపీ గౌస్‌ ఆలం ఆదేశించారు. మంగళవారం కమిషనరేట్‌ పరిధిలోని పోలీస్‌ అధికారులతో సీపీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎన్నికల సన్నద్ధత, శాంతిభద్రతల పరిరక్షణపై కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా జరిగేలా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. గత ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిని, పాత నేరస్తులను గుర్తించి వారిని వెంటనే బైండోవర్‌ చేయాలన్నారు. కమిషనరేట్‌ పరిధిలో లైసెన్స్‌ కలిగిన తుపాకులను వెంటనే ఆయా పోలీస్‌ స్టేషన్లలో డిపాజిట్‌ చేయించుకోవాలన్నారు. అక్రమ మద్యం రవాణా, నిల్వలపై దృష్టి సారించాలని ఆదేశించారు.

ఫ అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం..

అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ఆలం అధికారులను ఆదేశించారు. కరీంనగర్‌ రూరల్‌ డివిజన్‌ ఏసీపీ కార్యాలయాన్ని సీపీ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డివిజన్‌ పరిధిలోని శాంతి భద్రతలు, క్రైం రేట్‌పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను, వాటికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. సీపీ గౌస్‌ ఆలం మాట్లాడుతూ పెండింగ్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. విజిబుల్‌ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలన్నారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్‌ స్పాట్స్‌గా గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. సైబర్‌ నేరాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో రూరల్‌ ఏసీపీ విజయ కుమార్‌, సీఐలు నిరంజన్‌రెడ్డి, సదన్‌ కుమార్‌, బిల్లా కోటేశ్వర్‌, ప్రదీప్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 26 , 2025 | 12:10 AM