Share News

సత్తా చాటిన బీసీలు

ABN , Publish Date - Dec 13 , 2025 | 12:52 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజ్యాంగబద్ధంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న ప్రభుత్వ హామీ నెరవేరకపోయినా, జిల్లాలో జరిగిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వు చేసిన స్థానాలు పోనూ జనరల్‌స్థానాల్లో 82.60శాతం మంది అభ్యర్థులు బీసీవర్గాలకు చెందిన వాళ్లే గెలుపొందారు.

  సత్తా చాటిన బీసీలు

- 42 శాతం రిజర్వేషన్లు కల్పించకపోయినా జనరల్‌ స్థానాల్లో పోటీ

- జనరల్‌కు కేటాయించిన 46స్థానాల్లో 38స్థానాల్లో బీసీల గెలుపు

- మొత్తం స్థానాల్లో 65(66.33శాతం) మంది విజయం

- పూర్తయిన మొదటివిడత పంచాయతీ ఎన్నికలు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజ్యాంగబద్ధంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న ప్రభుత్వ హామీ నెరవేరకపోయినా, జిల్లాలో జరిగిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వు చేసిన స్థానాలు పోనూ జనరల్‌స్థానాల్లో 82.60శాతం మంది అభ్యర్థులు బీసీవర్గాలకు చెందిన వాళ్లే గెలుపొందారు. మొత్తంగా 66.33శాతం మంది అభ్యర్థులు విజయం సాధించారు. ఇది బీసీల ఐక్యతకు నిదర్శనంగా బీసీ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఈనెల 11వ తేదీన జిల్లాలోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్‌, కాల్వశ్రీరాంపూర్‌ మండలాల్లోని 98గ్రామ పంచాయతీల సర్పంచ్‌ స్థానాలతోపాటు 896వార్డుస్థానాలకు ఎన్నికలు జరిగాయి. రామగిరి పెద్దంపేట పంచాయతీ ఎన్నిక హైకోర్టు జారీచేసిన ఉత్తర్వుల మేరకు వాయిదావేశారు. మంథని మండలం తోట గోపయ్యపల్లి సర్పంచ్‌ సహ వార్డుస్థానాలు, నాగారం, మైదుపల్లి, రామగిరి మండలం చందనాపూర్‌ పంచాయతీ సర్పంచ్‌స్థానాలతోపాటు అన్ని పంచాయతీల్లో కలిపి 211వార్డుస్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 99పంచాయతీల్లో జనరల్‌, జనరల్‌ మహిళలకు 47స్థానాలు, బీసీలకు 27స్థానాలు, ఎస్సీ వర్గాలకు 25సర్పంచ్‌ స్థానాలను రిజర్వు చేశారు. జనరల్‌కు కేటాయించిన 47స్థానాల్లో ఒక స్థానానికి ఎన్నిక జరగకపోగా, 46స్థానాల్లో 38స్థానాల్లో బీసీలు, 6స్థానాల్లో ఓసీలు, మంథని మండలం ఉప్పట్ల, గాజులపల్లి 2స్థానాల్లో ఎస్సీ అభ్యర్థులు కాసిపేట లింగమ్మ, కారెంగుల సుధాకర్‌ విజయం సాధించారు. జనరల్‌ స్థానాల్లో బీసీ అభ్యర్థులు 89.04శాతం మంది గెలుపొందగా, మొత్తం 98 స్థానాల్లో బీసీలకు రిజర్వుచేసిన 27స్థానాలు కలుపుకుని 65స్థానాల్లో బీసీలు విజయం సాధించారు. గెలుపొందిన వారిలో ముదిరాజ్‌, గౌడ్‌, పద్మశాలి, యాదవ, మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు గెలుపొందారు. మొత్తంగా 66.33శాతం మంది బీసీలే ఉన్నారు. బీసీలకు, జనరల్‌కు కేటాయించిన 73స్థానాల్లో కాంగ్రెస్‌పార్టీ 48స్థానాల్లో, బీఆర్‌ఎస్‌పార్టీ 17స్థానాల్లో, 8స్థానాల్లో ఇతరులు గెలుపొందారు.

ఫ జనరల్‌ స్థానాల్లో ఓసీలు గెలిచింది ఆరు స్థానాల్లోనే..

జనరల్‌కు కేటాయించిన 46పంచాయతీల్లో ఓసీ అభ్యర్థులు కేవలం ఆరుగురు మాత్రమే గెలుపొందారు. కాల్వశ్రీరాంపూర్‌ మండలం ఇప్పలపల్లి సర్పంచ్‌గా జిన్నా రాంచంద్రారెడ్డి, లక్ష్మిపురం సర్పంచ్‌గా మేకల లావణ్య, మల్యాల సర్పంచ్‌గా బూసి సదాశివరెడ్డి, ముత్తారం మండలం ఓడేడు సర్పంచ్‌గా పోతుపెద్ది కవిత, రామగిరి మండలం సుందిళ్ల సర్పంచ్‌గా ముసుగుల నరేందర్‌ రెడ్డి, లద్నాపూర్‌ సర్పంచ్‌గా వనం రాంచంద్రారావు గెలుపొందారు. 38స్థానాల్లో బీసీలు, రెండు స్థానాల్లో ఎస్సీ అభ్యర్థులు గెలిచారు.

ఫ అధికారికంగా దక్కని రిజర్వేషన్లు..

తాము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న ప్రభుత్వ హామీ నెరవేరలేదు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు 2024 నవంబర్‌లో కులగణన చేపట్టడంతోపాటు బీసీ డెడికేషన్‌ కమిషన్‌ను ప్రభుత్వం నియమించింది. కుల గణనకు కేబినెట్‌ ఆమోదం తెలిపిన తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అధికార కాంగ్రెస్‌ సహ అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. దీంతో ప్రభుత్వం రెండు బిల్లులను గవర్నర్‌ ద్వారా రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు. ఆర్డినెన్స్‌లు కూడా తీసుకవచ్చినా కూడా కేంద్రం ఆమోదం లభించ లేదు. దీంతో ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవోలు తీసుకవచ్చి ఎన్నికలకు వెళ్లింది. దీంతో కొందరు బీసీలకు 42శాతం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఎన్నికలను నిలిపివేయాలని హైకోర్టును ఆశ్రయించడంతో మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. వచ్చే మార్చి నెలాఖరులో 15వ ఆర్థిక సంఘం గడువు ముగుస్తున్నందున స్థానికసంస్థలకు రావాల్సిన 3వేల కోట్ల రూపాయలు రాకుండా పోతాయని భావించిన ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ,బీసీలకు 50శాతానికి రిజర్వేషన్లు మించకుండా ఉండే విధంగా ఎన్నికలను నిర్వహిస్తున్నది. అధికారికంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించక పోయినా మొదటివిడత జరిగిన ఎన్నికల్లో 66.33శాతం మంది బీసీ అభ్యర్థులు సర్పంచులుగా విజయం సాధించారు. ఇదిబీసీల ఐక్యతకు నిదర్శనమని బీసీసంఘాల నాయకులు పేర్కొంటున్నారు.

Updated Date - Dec 13 , 2025 | 12:52 AM