కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేందుకే 14న బీసీ గర్జన
ABN , Publish Date - Aug 12 , 2025 | 12:31 AM
బీసీలకు రిజర్వేషన్లపై కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేందుకు 14న బీసీ గర్జన సభ నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
కరీంనగర్ టౌన్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): బీసీలకు రిజర్వేషన్లపై కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేందుకు 14న బీసీ గర్జన సభ నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. సోమవారం నగరంలోని పూలే మైదానంలో ఇతర నాయకులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం చింతకుంట బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో నాయకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ కులవృత్తులకు ఏటా ఇస్తామన్న 20 వేల కోట్ల నిధులను ఎగ్గొంటిందన్నారు. రాష్ట్రంలోని బీసీలనే కాదు అన్నివర్గాల ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లులపై గతంలోనే అప్పటి ముఖ్యమంత్రులు అసెంబ్లీలో తీర్మాణాలు చేయగా, దాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చేందుకు కేంద్రం ఒప్పుకోలేదని వివరించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే డ్రామా చేస్తోందని, కులగణన కూడా తప్పుల తడకగా ఉందన్నారు. ప్రభుత్వాన్ని బొందపెట్టేందుకు రాష్ట్రంలోని ప్రజలు సిద్ధంగా ఉన్నారని, బీసీ సమాజం వారి మోసాలను గ్రహించి తగిన బుద్ధి చెబుతారన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీపై తాము ఎందుకు మాట్లాడడం లేదని కాంగ్రెస్ అంటుందని, కామారెడ్డిలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ వచ్చినప్పుడు ఆ పార్టీ నాయకులు బీజేపీ గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు బీసీ శంఖారావాలను నిర్వహిస్తామని, కరీంనగర్‌లో జరిగే శంఖారావాన్ని పార్టీ నాయకులు, బీసీ సంఘాల నాయకులు, బీసీ బిడ్డలు విజయవంతం చేయాలని కోరారు. శాసనమండలి పక్ష నేత మధుసూదనచారి మాట్లాడుతూ బీసీలకు ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక ప్రభుత్వం మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తుందని చెప్పారు. కరీంనగర్ వేదికగా ఉమ్మడి జిల్లా బీసీల శంఖారావాన్ని విజయవంతం చేయాలని కోరారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీలకు ఎంతో చేశామని ప్రభుత్వం చెబుతూ కేసీఆర్‌ను బద్నాం చేస్తున్నారని అన్నారు. కరీంనగర్‌తో ప్రారంభమయ్యే బీసీ శంఖారావ సభలను మిగిలిన జిల్లాలకు విస్తరిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో బీసీల రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఎంపీలు సభను ఎందుకు స్తంభింపచేయడం లేదన్నారు. బీసీలను మోసం చేస్తే ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తామన్నారు. కార్పొరేషన్ చైర్మన్లుగా బీసీలనే నియమించాలని, మంత్రివర్గంలో మరో ఐదుగురు బీసీలకు మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీ గర్జనను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో శాసనమండలి బీఆర్‌ఎస్ సక్ష ఉపనేత బండ ప్రకాశ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, కౌన్సిల్ మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మాజీ చీఫ్ విప్ డి వినయ్ భాస్కర్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ కృష్ణమోహన్‌రావు, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ పాల్గొన్నారు.