Share News

బీసీల ఆశలు గల్లంతు

ABN , Publish Date - Nov 25 , 2025 | 01:06 AM

పంచాయతీ ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి గెజిట్‌ జారీ చేశారు. గెజిట్‌లో పొరపాట్లు ఎలా ఉన్నా బీసీల ఆశలు గల్లంతయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

బీసీల ఆశలు గల్లంతు
సిరిసిల్ల కలెక్టరేట్‌లో వినతిపత్రం అందిస్తున్న వీర్నపల్లి నాయకులు

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

పంచాయతీ ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి గెజిట్‌ జారీ చేశారు. గెజిట్‌లో పొరపాట్లు ఎలా ఉన్నా బీసీల ఆశలు గల్లంతయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పాత పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు చేసిన 2019 ఎన్నికల రిజర్వేషన్లతో పోల్చుకుంటే బీసీల రిజర్వేషన్లు తగ్గిపోయాయి. వీర్నపల్లి మండలంలో బీసీలకు సర్పంచ్‌ స్థానాలే కేటాయించలేదు. వీర్నపల్లిలో 17 గ్రామ పంచాయతీలు ఉండగా 8 ఎస్టీలకు, మూడు ఎస్సీలకు, ఆరు జనరల్‌ స్థానాలుగా రిజర్వ్‌ చేశారు. బీసీలకు రిజర్వ్‌ కాలేదు. జిల్లాలో కొన్ని గ్రామపంచాయతీలో వార్డు స్థానాలు బీసీ, ఎస్సీలకు రిజర్వు కాలేదు. దీంతో సర్పంచ్‌, స్థానాలు కోలోయిన బీసీ ప్రతినిధులు సోమవారం జిల్లాలో నిరసన తెలిపారు. వీర్నపల్లి మండలంలో బీసీలకు సర్పంచ్‌ స్థానాలు కేటాయించకపోవడంతో మాజీ ప్రజాప్రతినిదులు, బీసీ నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌కు వచ్చి నిరసన తెలిపారు. ప్రజావాణిలో బీసీ స్థానాలు కేటాయించాలని, రంగంపేటలో వార్డుల్లో ఎస్సీలకు స్థానాలు కేటాయించాలని వినతిపత్రం అందించారు. ఇల్లంతకుంట మండలంలో వెంకట్రావుపల్లి, తిప్పాపూర్‌ పంచాయతీల వార్డుల్లో బీసీలకు స్థానాలు కేటాయించకపోవడంతో వెంకట్రావుపల్లె పంచాయతీ కార్యాలయం వద్ద బీసీలు నిరసన తెలిపారు. ఇదిలా ఉండగా గెజిట్లో పొరపాట్లు కూడా దొర్లాయి. ఇల్లంతకుంట గ్రామపంచాయతీలో 12వార్డులు ఉండగా 10 వార్డులకు రిజర్వేషన్లతో గెజిట్‌ జారీ చేశారు. తరువాత మళ్లీ సవరించి గెజిట్‌ జారీ చేశారు.

ఫ 260 సర్పంచ్‌, 2,268 వార్డు స్థానాలకు రిజర్వేషర్లు

సిరిసిల్ల జిల్లాలో 260 సర్పంచ్‌, 2,268 వార్డు స్థానాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. 2011 జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఖరారు చేశారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కులగణన- 2024 సర్వే లెక్కల ప్రకారం బీసీ డెడికేటెడ్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు 50 శాతం మించకుండా రిజర్వేషన్లు పూర్తిచేసి గెజిట్‌ జారీ చేశారు. గతంలో ప్రకటించిన రిజర్వేషన్లు అమలైతే బీసీ సీట్లు భారీగా ఉండేవి. ఇప్పుడు సీట్లను గణనీయంగా కోల్పోయారు. పాత రిజర్వేషన్‌ పద్ధతిలో కూడా బీసీలకు నిరాశే మిగిలింది. 2019 పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్‌ కంటే కూడా ఇప్పుడు బీసీలకు సీట్లు తగ్గిపోయాయి. 2019 ఎన్నికల్లో 255 గ్రామపంచాయతీలు ఉంటే బీసీలకు 57సర్పంచ్‌ స్థానాలు, 2,230 వార్డు స్థానాల్లో 540 బీసీలకు కేటాయించారు. ప్రస్తుతం ప్రకటించిన రిజర్వేషన్లలో 260 సర్పంచ్‌ స్థానాల్లో 56 బీసీలకు రిజర్వ్‌ చేశారు. ఇందులో మహిళకు 24 స్థానాలు, జనరల్‌గా 32 స్థానాలు ఉన్నాయి. వంద శాతం ఎస్టీ పంచాయతీలు 26 ఉండగా 11 మహిళలకు, 15జనరల్‌కు కేటాయించారు. మిగతా నాలుగు ఎస్టీ స్థానాల్లో రెండు మహిళలు, రెండు జనరల్‌గా ఉన్నాయి. ఎస్సీలకు 53 స్థానాలు కేటాయించగా 24 మహిళలకు, 29 జనరల్‌గా ఉన్నాయి. జనరల్‌ స్థానాలు 121ఉండగా 58 మహిళకు, 63 జనరల్‌ స్థానాలుగా కేటాయించారు. 2,268 వార్డుల్లో వందశాతం ఎస్టీ పంచాయతీల్లో 176 వార్డులు ఉండగా 88మహిళకు, 88 జనరల్‌, ఇతర 53 ఎస్టీ వార్డుల్లో 18 మహిళలకు, 35 జనరల్‌గా కేటాయించారు. 442 ఎస్సీ వార్డులలో 177 మహిళకు, 26 జనరల్‌గా ఉన్నాయి. 553 బీసీ వార్డుల్లో 222 మహిళకు,331 జనరల్‌ స్థానాలుగా ఉన్నాయి. 1,044 జనరల్‌ వార్డుల్లో 471 మహిళలకు, 573 జనరల్‌గా ఉన్నాయి. కులగణన జీవో 9 ద్వారా రిజర్వేషన్లలో260 సర్పంచ్‌ స్థానాల్లో 30 ఎస్టీలకు,53 ఎస్సీలకు,101 బీసీలకు,76జనరల్‌ స్థానాలగా రిజర్వ్‌ చేశారు. రిజర్వేషన్లు రద్దుచేసి పాత పద్ధతిలో రిజర్వేషన్లు ప్రకటించడంతో బీసీల ఆశలు గల్లంతై నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

ఫ పల్లెల్లో సందడి

రిజర్వేషన్లు ఖరారు రావడంతో పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది. నోటిఫికేషన్‌ రావడమే తరువాయిగా ఆశావహులు పోటీకి సిద్ధమవుతున్నారు. 260 గ్రామపంచాయతీల్లో రిజర్వేషన్లు అనుకూలించిన వారు గ్రామాల్లో పెద్దల మద్దతుకు కసరత్తు ప్రారంభించారు. కుల సంఘాలు, యువజన సంఘాలు, పార్టీ పెద్దల భరోసా పొందడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరోవైపు అధికార యంత్రాంగం రిజర్వేషన్లు ఖరారు చేసి గెజిట్‌ జారీ చేయడంతో పాటు ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికల వాతావరణం ఏర్పడింది.

Updated Date - Nov 25 , 2025 | 01:07 AM