బీసీ బంద్ సక్సెస్
ABN , Publish Date - Oct 19 , 2025 | 12:35 AM
బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన తెలంగాణ బంద్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో విజయవంతంగా ముగిసింది. బీసీ సంఘాల బందుకు మద్దతుగా రాజకీయ, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలన్నీ మద్దతు పలికాయి.
- స్తంభించిన రాజన్న సిరిసిల్ల జిల్లా..
- జిల్లావ్యాప్తంగా ర్యాలీలు ధర్నాలు
- ముందస్తుగానే ప్రైవేట్ విద్యాసంస్థల సెలవు
- సర్కారు పాఠశాలలు, కళాశాలలో తరగతుల బహిష్కరణ
- బీసీ సంఘాల ఆందోళనకు సర్వత్రా మద్దతు
- ఆందోళనలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, వామపక్ష పార్టీలు
- ర్యాలీలో పాల్గొన్న ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్
- జిల్లాలో పోలీసుల భారీ బందోబస్తు
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన తెలంగాణ బంద్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో విజయవంతంగా ముగిసింది. బీసీ సంఘాల బందుకు మద్దతుగా రాజకీయ, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలన్నీ మద్దతు పలికాయి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని వివిధ పార్టీలు వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించాయి. ముందస్తుగానే ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో తరగతులు బహిష్కరించారు. సిరిసిల,్ల వేములవాడ ఆర్టీసీ డిపోల నుంచి బస్సులు కదలలేదు. దీంతో సిరిసిల్ల, వేములవాడ బస్ స్టేషన్లు వెలవెలబోయాయి. జిల్లాలోని సిరిసిల్ల. వేములవాడ పట్టణాలతో పాటు ముస్తాబాద్, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, తంగళ్ళపలి,్ల ఇల్లంతకుంట, బోయినపల్లి, చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట మండల కేంద్రాల్లో వ్యాపార, వాణిజ్య సంస్థలు, పెట్రోల్ బంకులు మూసివేశారు. సిరిసిల,్ల వేములవాడలో సినిమాహాళ్లతో పాటు దుకాణాలు మూసివేయడంతో రద్దీ ప్రాంతాలు వెలవెలబోయాయి.
ర్యాలీలు.. ధర్నాలు
రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా బందులో భాగంగా బీసీ సంఘాలు, కాంగ్రెస్, బీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ నాయకులు ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. సిరిసిల్లలో కాంగ్రెస్, బీసీ సంఘాలు ర్యాలీ నిర్వహించారు. బీఆర్‌ఎస్ నాయకులు ద్విచక్ర వాహనాలపై ర్యాలీ నిర్వహించి మద్దతు ప్రకటించారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్టీసీ డిపోల ఎదుట కాంగ్రెస్, సీపీఎం ఇతర పార్టీల నాయకులు ధర్నా నిర్వహించారు. వేములవాడ డిపో ఎదుట ధర్నాలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. సిరిసిల్లలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమాండ్లుతో పాటు పలువురు బీసీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, కాంగ్రెస్ నాయకులు ఆకునూరు బాలరాజు, గడ్డం నర్సయ్య, సంగీతం శ్రీనివాస్, యేల్లె లక్ష్మీనారాయణ, కత్తెర దేవదాస్, గోనె ఎల్లప్ప, గోలి వెంకటరమణ, బొప్ప దేవయ్య ర్యాలీ నిర్వహించారు. బీఆర్‌ఎస్ బైక్ ర్యాలీలో పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, బీసీ సెల్ అధ్యక్షుడు బొల్లి రామ్మోహన్, టెక్స్‌టైల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూడూరు ప్రవీణ్, సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, వెంగళ శ్రీనివాస్, మ్యాన రవిలు పాల్గొన్నారు. సిరిసిల్ల ఆర్టీసీ డిపో ఎదుట సీపీఎం ధర్నాలో జిల్లా కార్యదర్శి మూషం రమేష్, రమణ, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్‌లో బీసీ జేఏసీ వంటావార్పు నిర్వహించారు. తంగళ్ళపల్లి, వేములవాడలో ఇతర మండలాల్లో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు.