Share News

బంద్‌ సక్సెస్‌

ABN , Publish Date - Oct 19 , 2025 | 12:37 AM

బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ నిర్వహించిన బంద్‌ శనివారం జిల్లాలో విజయవంతమైంది. బంద్‌కు కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌, వామపక్షాలు, టీజేఏసీ, తెలంగాణ జాగృతి, రాజ్యాధికారపార్టీ, ఎమ్మార్పీస్‌తోపాటు కుల, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి.

బంద్‌ సక్సెస్‌

- డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు

- ఉదయం 6 గంటల నుంచే ధర్నాలు, రాస్తారోకోలు

- స్వచ్ఛందంగా బంద్‌ పాటించిన విద్య, వ్యాపార సంస్థలు

- నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరైన ఉద్యోగులు

కరీంనగర్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ నిర్వహించిన బంద్‌ శనివారం జిల్లాలో విజయవంతమైంది. బంద్‌కు కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌, వామపక్షాలు, టీజేఏసీ, తెలంగాణ జాగృతి, రాజ్యాధికారపార్టీ, ఎమ్మార్పీస్‌తోపాటు కుల, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. పోలీసులు జిల్లావ్యాప్తంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటలకే వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌ వద్దకు చేరుకుని ఆందోళనలను చేపట్టారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రైవేట్‌ విద్యాసంస్థలకు యాజమాన్యాలు ముందే సెలవులు ప్రకటించి పాఠశాలలు, కళాశాలలను మూసివేశారు. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆర్టీసీ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలను ధరించి బీసీ బంద్‌కు సంఘీభావం ప్రకటించారు. బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆర్టీసీ బస్సులను నడిపించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, ప్రైవేట్‌ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు నల్లబ్యాడ్జీలను ధరించి బంద్‌కు సహకరించారు. బంద్‌ను విజయవంతం చేసేందుకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు బైక్‌ ర్యాలీలు నిర్వహించి దుకాణాలు, వ్యాపార సంస్థలను బంద్‌ చేయించారు. కరీంనగర్‌ జిల్లాకేంద్రంలో బీఆర్‌ఎస్‌ నేతలు, శ్రేణులు బంద్‌లో కనిపించక పోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సుడా, సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, పార్లమెంట్‌ ఇంచార్జి వెలిచాల రాజేందర్‌రావు, ఆల్ఫోర్స్‌ నరేందర్‌రెడ్డి, వైద్యుల అంజన్‌కుమార్‌, పులి అంజనేయులు, బోనాల శ్రీనివాస్‌ పలువురు కార్పొరేటర్లు, నాయకులు బంద్‌లోపాల్గొన్నారు. బస్టాండ్‌, టవర్‌సర్కిల్‌, తెలంగాణచౌక్‌లో బంద్‌ను పర్యవేక్షించారు. 42శాతం బీసీ రిజర్వేషన్లకు బీజేపీ సానుకూలంగా ఉందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లోని ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా మోసం చేసిందని బీజేపీ పార్లమెంట్‌ కన్వీనర్‌ బోయినపల్లి ప్రవీణ్‌రావు విమర్శించారు. సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజాల శ్రీనివాస్‌ పార్టీ శ్రేణులతో కలిసి బస్టాండ్‌ ఎదుట ఆందోళన చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీ బిల్లును ఆమోదించకుండా బీసీపట్ల మొసలికన్నీరు కార్చుతుందని విమర్శించారు. ఏఐఎఫ్‌బీ నాయకులు అంబటి జోజిరెడ్డి, ఆల్‌ఇండియా యూత్‌లీగ్‌ బాధ్యులు బండారి శేఖర్‌, తెలంగాణ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూసాల సంపత్‌ ఆధ్వర్యంలో పలువురు ఆ కుల సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు బంద్‌లో పాల్గొన్నారు.

Updated Date - Oct 19 , 2025 | 12:37 AM